ఊరకుంటకు ఎసరు! .. నాగర్ కర్నూల్ లో ఆగని చెరువులు, కుంటల కబ్జాలు

ఊరకుంటకు ఎసరు! .. నాగర్ కర్నూల్ లో  ఆగని చెరువులు, కుంటల కబ్జాలు
  • ఊరకుంటలో నీళ్లు నిలవకుండా గండి కొట్టారనే ఆరోపణలు
  • కబ్జాదారులపై చర్యలు తీసుకోవడంలో ఆఫీసర్లు విఫలం
  • పోలీసులకు ఫిర్యాదు చేసి ఊరుకున్నారనే విమర్శలు

నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంగా మారిన తరువాత పట్టణంలోని కేసరిసముద్రం చెరువుతో పాటు పుట్నాలకుంట, సద్దల్​సాబ్​ కుంట, నాగనూలు చెరువు కబ్జాలకు గురయ్యాయి. తాజాగా ఉయ్యాలవాడ ఊరకుంటకు ఎసరు పెడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కబ్జాలకు ప్రయత్నిస్తున్నారని ఇరిగేషన్​ అధికారులు గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న కోట్లు విలువ చేసే 16 ఎకరాల ఊరకుంటకు ఏడాది కింద గండి పడింది. 

భారీ వర్షాలు, వరదల కారణంగా కుంటకు గండి పడిందని అంటున్నప్పటికీ, కుంటలో నీరు నిల్వ ఉండకుండా కట్టను ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. వానాకాలంలో వచ్చిన నీరు వచ్చినట్లే కేసరిసముద్రంలోకి వచ్చి చేరుతోంది. ఇదే అదనుగా కొందరు టెంపరరీ నిర్మాణాలకు తెరతీశారు. కొన్ని చోట్ల చదునుచేసి మొరం పోసుకున్నారు. దీనిపై పోలీసులకు ఇరిగేషన్​ అధికారులు కంప్లైంట్​ ఇచ్చి ఊరుకున్నారు. కుంట గండి పూడ్చేందుకు రూ.5లక్షలతో ప్రభుత్వానికి ప్రప్రోజల్స్​ పంపించారు. 

మరోసారి కోర్టుకు ఇరిగేషన్​ ఆఫీసర్లు..

నాగర్​క​ర్నూల్  పట్టణం నుంచి ఉయ్యాలవాడ, మెడికల్​ కాలేజీకి వెళ్లే మెయిన్​ రోడ్డు పక్కనే ఉన్న ఊరకుంటను కబ్జా చేసేందుకు టార్గెట్​ చేస్తున్నారు. సర్వే నంబర్​170లో 16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊరకుంట కింద ఆయకట్టు ఉంది. ఊరకుంట శిఖంలో ఏక్​ ఫసల్​ పట్టాదారులు ఉన్నారు. కుంటపై తమకే సర్వ హక్కులు ఉన్నాయని ఏక్​ ఫసల్​ పట్టాదారులు గతంలో కోర్టుకు వెళ్తే ఇరిగేషన్​ ఆఫీసర్లు పట్టించుకోలేదు. దీంతో కోర్టు​వారికి పర్మినెంట్​ ఇంజక్షన్​ మంజూరు చేసింది. ఇటీవల నాగర్​కర్నూల్​ ఇరిగేషన్​ డివిజన్​లో బాధ్యతలు తీసుకున్న అధికారులు ఆ ఇంజక్షన్​ ఆర్డర్​ను రద్దు చేయాలని జిల్లా కోర్టులో అప్పీల్  
చేశారు. 

పక్కా ప్లాన్​తో కబ్జాలు..

ఊరకుంట కట్ట వరదలతో తెగిందా? లేక ఎవరైనా ధ్వంసం చేశారా? అనేది చర్చనీయాంశంగా మారింది. కుంట భూమిలో ఒక ఇంటి నిర్మాణంతో పాటు రోడ్డు పక్కన డబ్బాలు వేసుకున్నారు. కుంటలో నీరు నిలిస్తే ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో కట్టను ధ్వంసం చేశారని అంటున్నారు. ఇక జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న చెరువుల కట్టలు, శిఖం, బఫర్​ జోన్​ భూములను టార్గెట్​ చేస్తున్న కబ్జాదారులు, ఆ తరువాత అక్రమ నిర్మాణాలను తొలిగించకుండా కోర్టును ఆశ్రయిస్తున్నారు. కేసరిసముద్రం చెరువులో అక్రమంగా నిర్మించిన 41 కట్టడాలను తొలిగించాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేయగా, కొన్నింటిని తొలిగించారు. మరి కొందరు మాత్రం హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు.

 దీనిపై ఇరిగేషన్​ ఆఫీసర్లు అప్పీల్​కు వెళ్లినట్లు సమాచారం. పుట్నాలకుంట మధ్యలో కట్ట వేసి నాలుగు ఎకరాలు కబ్జాకు ప్రయత్నించిన ఘటనపై, కేసరిసముద్రంలో ఎండబెట్ల గ్రామం వైపు కబ్జాలపై ఇరిగేషన్​ ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు​చేశారు. ఇదిలాఉంటే కబ్జా చేసింది ఎవరనే విషయం బహిరంగ రహస్యమే, అయినప్పటికీ సంబంధిత అధికారులు గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేశారని కంప్లైంట్​ చేసి ఊరుకుంటున్నారనే విమర్శలున్నాయి.జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న చెరువులు, కుంటలు కబ్జా అవుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జోరుగా సాగిన కబ్జాల దందాకు కొంత బ్రేక్​ పడగా, ఇటీవల మళ్లీ మొదలైందని చెబుతున్నారు. ఇప్పటికైనా నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు 
కోరుతున్నారు. 

ప్రతిపాదనలు పంపించాం..

ఉయ్యాలవాడ ఊరకుంట గండి పూడ్చేందుకు రూ.5లక్షలతో ప్రపోజల్స్​ పంపించాం. కబ్జాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. గతంలో ఏక్​ ఫసల్​ పట్టాదారులకు కోర్టు ఇచ్చిన పర్మినెంట్​ ఇంజక్షన్​ ఆర్డర్​ రద్దు కోసం కోర్టులో అప్పీల్​ చేశాం.

శ్రీకాంత్, ఇరిగేషన్​ డీఈ