చెన్నూర్​లో 100 ఎకరాల సెరీకల్చర్ భూమి కబ్జా

చెన్నూర్​లో 100 ఎకరాల సెరీకల్చర్ భూమి కబ్జా
  • అన్యాక్రాంతమైన జాగల విలువ రూ.30 కోట్ల పైమాటే..
  •     పట్టపగలే ఏరుమద్ది ప్లాంటేషన్ నరికి పంటల సాగు 
  •     నాలుగేండ్లుగా     యథేచ్ఛగా భూదందా 
  •     సెరికల్చర్ ఏడీ ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్
  •     సర్వే చేయడానికి సిబ్బంది లేరంటున్న రెవెన్యూ శాఖ

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో సెరీకల్చర్ (పట్టు పరిశ్రమ) భూములు కబ్జా అవుతున్నాయి. పట్టుగూళ్ల పెంపకం కోసం ప్రభుత్వం కేటాయించిన ఈ భూములను రూలింగ్ పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, చోటామోటా నాయకులు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. పట్టపగలే  ఏరుమద్ది చెట్లను కొట్టేసి బ్లేడ్ ట్రాక్టర్లతో సాఫ్ చేసి పంటలు వేస్తున్నారు. మరికొందరు మామిడి తోటలు పెడుతున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఇప్పటికే సుమారు వంద ఎకరాలను కబ్జా చేశారు. ఇక్కడ ఎకరానికి రూ.30 లక్షల పైనే పలుకుతోంది. ఈ లెక్కన అన్యాక్రాంతమైన భూముల విలువ రూ.30 కోట్ల పైమాటే. మూడు, నాలుగు సంవత్సరాలుగా ఈ ఆక్రమణల పర్వం అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. సెరీకల్చర్ అధికారులు కలెక్టర్​కు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సర్వే చేయడానికి సిబ్బంది లేరని సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. కబ్జాదారులు అధికార పార్టీ లీడర్లు కావడంతోనే అధికారులు చర్యలకు వెనుకాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

306 ఎకరాలను కేటాయించిన ప్రభుత్వం

1982 లో సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో చెన్నూర్​లో ప్రభుత్వం దసిలిపట్టు గూళ్ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం లంబాడిపల్లి, ఎల్లక్కపేట శివార్లలో సెరీకల్చర్ డిపార్ట్ మెంట్​కు 306 ఎకరాలను కేటాయించింది. ఇందులో 90 ఎకరాలను సెంట్రల్ సిల్క్ బోర్డుకు, 206 ఎకరాలను స్టేట్ సెరీకల్చర్ డిపార్ట్​మెంట్​కు ఇచ్చింది. సర్వేనంబర్లు 1/5 నుంచి 1/13 వరకు, 318/12, 318/13లో మొత్తం 103.83 ఎకరాల భూములున్నాయి. అలాగే సర్వేనంబర్లు 1284/13 నుంచి 1284/22 వరకు 84.19 ఎకరాల భూములున్నట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. ఈ భూముల్లో పట్టుగూళ్ల ఉత్పత్తి కోసం వేల సంఖ్యలో ఏరుమద్ది చెట్లను పెంచుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన నాణ్యమైన పట్టుగూళ్లకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. 

100 ఎకరాలు కబ్జా....

కొంతకాలంగా చెన్నూర్​లోని సర్కారు జాగలను దర్జాగా కబ్జా చేస్తున్న రూలింగ్​ పార్టీ లీడర్లు మూడు, నాలుగేండ్ల నుంచి సెరికల్చర్ భూములను పొతం పెడుతున్నారు. అధికార పార్టీ నాయకులే కబ్జాలు చేస్తుండడంతో గతంలో రిటైర్మెంట్​కు దగ్గరలో ఉన్న అధికారులు ఈ గొడవ తమకెందుకని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఒకరిని చూసి మరొకరు సెరీకల్చర్ భూములపై పడ్డారు. మొదట గుట్టుచప్పుడు కాకుండా కబ్జాలు చేసినవారు ఇటీవల మరింత బరి తెగించారు. పట్టపగలే ఏరుమద్ది చెట్లను నరికి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. బ్లేడ్ ట్రాక్టర్లను పెట్టి భూములను సాఫ్ చేసి పంటలు వేసుకుంటున్నారు. లంబాడిపల్లి, కిష్టంపేటకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు సుమారు వంద ఎకరాలను ఆక్రమించుకున్నారు. సెంట్రల్ సిల్క్ బోర్డు భూముల్లో లంబాడిపల్లికి చెందిన ఒక స్థానిక ప్రజాప్రతినిధి, కిష్టంపేటకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి మామిడి తోటలు పెట్టారు. 

పట్టించుకోని రెవెన్యూ అధికారులు 

సెరీకల్చర్ భూముల కబ్జా విషయాన్ని చెన్నూర్ పట్టుపరిశ్రమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పార్వతి రాథోడ్ ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఉన్న కలెక్టర్​కు, చెన్నూర్ తహసీల్దార్​కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. సర్వేచేసి హద్దులు పెడితే తాము ట్రెంచ్​కొట్టి భూములను కాపాడుకుంటామని చెప్పినా స్పందన లేదు. సర్వే చేయడానికి తమ వద్ద సిబ్బంది లేరని, ఇతర పనుల్లో బిజీగా ఉన్నామని రెవెన్యూ అధికారులు తప్పించుకుంటున్నారు. కబ్జాదారులకు రాజకీయ పలుకుడి ఉండడం వల్లే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మిగిలిన భూములు కూడా అన్యాక్రాంతమవుతాయని హెచ్చరిస్తున్నారు. 

గోడౌన్ స్థలం మున్సిపాలిటీకి.... 

చెన్నూర్ కొత్త బస్టాండ్ పక్కనున్న సెరీకల్చర్ గోడౌన్ స్థలాన్ని సైతం మున్సిపాలిటీకి కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఐటీడీఏకు చెందిన ఈ స్థలంలో 1975 ప్రాంతంలో గోడౌన్లు, సిబ్బంది క్వార్టర్లు నిర్మించగా, అవి శిథిలావస్థకు చేరాయి. పట్టు పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ స్టోరేజీ బిల్డింగ్ నిర్మాణం కోసం కలెక్టర్ రూ.40 లక్షలు శాంక్షన్ చేశారు. అలాగే పట్టు రైతులు పట్టుగూళ్లను అమ్మడం కాకుండా దారం తీసి అమ్మితే అదనపు ఆదాయం వస్తుందని భావించి మెషీన్ల కోసం మరో రూ.20 లక్షలు కేటాయించారు. ఇదిలా ఉండగా, గోడౌన్ల స్థలంలో స్ర్టీట్ వెండింగ్ జోన్ నిర్మించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. సెరీకల్చర్ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండానే ఇటీవల బ్లేడ్ ట్రాక్టర్, జేసీబీతో స్థలాన్ని చదును చేయడానికి ప్రయత్నించారు. ఏడీ పార్వతి రాథోడ్ అడ్డు చెప్పడంతో వెళ్లిపోయారు. దీంతో స్ర్టీట్ వెండింగ్ జోన్ నిర్మాణానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. 

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం...

పట్టు పరిశ్రమ భూములను లంబాడిపల్లి, కిష్టంపేట గ్రామాలకు చెందిన కొంతమంది కబ్జా చేస్తున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి పెంచుతున్న ఏరుమద్ది చెట్లను నరికేస్తున్నారు. కొంతమంది పంటలు సైతం సాగు చేస్తున్నారు. కబ్జాల గురించి శాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్​కు, మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం. వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. 
- పార్వతి రాథోడ్, పట్టుపరిశ్రమల శాఖ ఏడీ 

ఎమ్మెల్యే బాల్క సుమన్ సపోర్ట్​తోనే కబ్జాలు

చెన్నూర్ పట్టణంతో పాటు మండలంలోని రూ.కోట్ల విలువైన గవర్నమెంట్, అసైన్డ్ భూములను బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేస్తున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మద్దతుతోనే ఆయన అనుచరులు బరితెగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కళ్లు తెరిచి అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలి. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతాం.  
- సుద్దపల్లి సుశీల్​ కుమార్, 
బీజేపీ చెన్నూర్ టౌన్ ప్రెసిడెంట్