
గద్వాల, వెలుగు: గద్వాల నడిబొడ్డున రూ.10 కోట్లు విలువ చేసే ఎండోమెంట్ స్థలం అన్యాక్రాంతమైంది. ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ ఉన్న బావిని పూడ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. ఇంత జరుగుతున్నా ఎండోమెంట్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో కొన్నేండ్ల కింద ఉత్తనూర్ వెంకట్ రెడ్డి, ఉత్తనూర్ పాపిరెడ్డి తమ స్థలాన్ని ఎండోమెంట్ కు డొనేట్ చేశారు. కానీ, ఇప్పుడు ఆ స్థలం కబ్జారాయుళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.
తమ పూర్వీకులు సదుద్దేశంతో స్థలాన్ని డొనేట్ చేస్తే, ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యంతో ఆ స్థలం అన్యాక్రాంతమైందని స్థలాన్ని డొనేట్ చేసిన వారి వారసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థలాన్ని కాపాడకపోతే తమకు తిరిగి ఇవ్వాలని దాతల వారసులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కబ్జాలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.
కబ్జా చేస్తున్నా పట్టించుకుంటలేరు..
ఉత్తనూర్ వెంకట్ రెడ్డి, పాపి రెడ్డి చిన్న అగ్రహారం సమీపంలో జానకమ్మ పేరిట పొలాన్ని, బావి, సత్రాన్ని దేవాదాయశాఖకు డొనేట్ చేశారు. కూరగాయల మార్కెట్, రాయర్ లాడ్జ్ సమీపంలో సర్వే నంబర్ 230లో 21 గుంటలు, 516లో 8 గుంటలు, 294లో 22 గుంటల తో పాటు బావి, ఖాళీ స్థలాన్ని అందజేశారు. ఆ స్థలం విలువ ప్రస్తుతం కోట్లకు చేరింది. దీనిని కాపాడాల్సిన ఎండోమెంట్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో కొందరు వ్యక్తులు బావిని పూడ్చేసి, ఖాళీ స్థలాన్ని కలుపుకొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నారు.
ఇదంతా జరుగుతున్నా ఎండోమెంట్ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దేవాదాయశాఖలోని ఓ ఉద్యోగి అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే దాతలు ఇచ్చిన స్థలంలో 70 శాతం వరకు కబ్జా చేయగా, మిగిలిన 30 శాతం స్థలంలో ఉన్న 8 షాపుల ఓనర్లు ఏండ్లుగా కిరాయి చెల్లించడం లేదు. ఈ ఏరియాలో ఒక్కో షాపునకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కిరాయి ఉంది. కానీ, ఎండోమెంట్ పరిధిలోని షాపులకు కేవలం రూ. వెయ్యి మాత్రమే వసూలు చేస్తున్నారు. ఈ కిరాయి కూడా చెల్లించడం లేదని అంటున్నారు. ఈ దుకాణం ఓనర్ల నుంచి దేవాదాయ శాఖకు చెందిన అధికారులు రెండు, మూడు నెలలకోసారి మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం..
ఎండోమెంట్ శాఖకు సంబంధించిన జానకమ్మ సత్రం దగ్గర స్థలం కబ్జాకు గురైన విషయం నా దృష్టికి కూడా వచ్చింది. దీనిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తాం. 8 షాపులకు రూ.వెయ్యి చొప్పున కిరాయి వస్తున్న మాట వాస్తవమే. కిరాయి పెంచేందుకు నోటీసులు ఇస్తాం. ఎండోమెంట్ స్థలం కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం.
వెంకటేశ్వరమ్మ, ఎండోమెంట్ ఇన్స్ పెక్టర్, గద్వాల