ఐపీఎల్‌‌ను బంద్ చేస్తే కరోనా పోతుందా? 

ఐపీఎల్‌‌ను బంద్ చేస్తే కరోనా పోతుందా? 

అహ్మదాబాద్: భారత్‌లో విజృంభిస్తున్న కరోనా నియంత్రణకు ఐపీఎల్‌ను ఆపెయ్యడం సరైన పరిష్కారం కాదని ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. మహమ్మారితో విలవిల్లాడుతున్న ఇండియాకు సాయంగా 50 వేల డాలర్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ.37 లక్షలు)ను కమిన్స్ ప్రకటించాడు. ఈ క్రమంలో భారత్‌లో కరోనా పరిస్థితులపై అతడు పలు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌‌ను మధ్యలోనే ముగించడం సరైన పరిష్కారం కాదని ఓ అంతర్జాతీయ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిన్స్ చెప్పుకొచ్చాడు. కరోనాతో భయాందోళనల్లో ఉన్న ప్రజలకు సాయంత్రం సమయాల్లో తమ ఆట ద్వారా ఉపశమనం లభిస్తుందన్నాడు. భారత్‌‌కు సాయం అందించేందుకు ఆస్ట్రేలియాలో చాలా మంది సిద్ధంగా ఉన్నారని, దీని కోసం ఓ ఛారిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని పేర్కొన్నాడు. కాగా, కరోనా టైమ్‌లో ఐపీఎల్‌‌ను కొనసాగించడం కరెక్టేనా, ప్రజలు ఆస్పత్రుల్లో గోస పడుతుంటే కోట్ల రూపాయల ఖర్చుతో టోర్నీని జరపడం అవసరమా అంటూ ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై, మాజీ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశ్నించారు.