ఆర్టీఐ పరిధిలోనే దేవాదాయ శాఖ ..తెలంగాణ ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి

ఆర్టీఐ పరిధిలోనే దేవాదాయ శాఖ ..తెలంగాణ ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి
  •     యాదగిరిగుట్ట నారసింహుడిని దర్శించుకుని పూజలు 

యాదగిరిగుట్ట, వెలుగు : దేవాదాయ శాఖ కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని తెలంగాణ ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి స్పష్టం చేశారు. భక్తులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. ఎండోమెంట్ పరిధిలోకి వచ్చే ఆలయాల సమాచారం అధికారులు ఇవ్వాల్సిందేనని తెలిపారు.  

ఆర్టీఐ కమిషనర్లు పీవీ శ్రీనివాస్ రావు, దేశాల భూపాల్ తో కలిసి బుధవారం ఆయన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నార సింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయోధ్యరెడ్డి మాట్లాడుతూ ఎండోమెంట్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా డిపార్ట్ మెంట్ కు ఆర్టీఐ వర్తించదని, హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ కోదండరాం తీర్పు ఇచ్చారని, కానీ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు తో పాటు పలు రాష్ట్రాల హై కోర్టులు తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు. 

గతంలో టీటీడీ కూడా హైకోర్టుకు వెళ్తే.. ఆర్టీఐ కిందికే వస్తుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని వెల్లడించారు.  గత హైకోర్టు ఆర్డర్ ను సాకుగా చూపి  సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేశారని, ఇప్పుడలా కుదరదని,  దీనిపై ఎండోమెంట్ అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. 

ఆలయ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు చేసే ఖర్చు, వినియోగం గురించి తెలుసుకునే హక్కు భక్తులకు ఉందని,  దాతలు విరాళాలు సైతం ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తే, వాటి వివరాలు కోరినా అందించాల్సిందేనన్నారు.  ఆర్టీఐ కమిషనర్లకు కలెక్టర్ హనుమంతరావు మొక్కను అందించగా.. ఆలయ అర్చకులు పూర్ణకుంభం స్వాగతం పలికి  వేదాశీర్వచనం చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోలను బహూకరించారు. ఆర్డీవో కృష్ణారెడ్డి, గుట్ట తహసీల్దార్ గణేశ్​నాయక్ ఉన్నారు.