
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ (షాబాద్ మండలం) దగ్గర 200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పార్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని టీ–ఫైబర్ ఎండీ, టీ–వర్క్స్ సీఈఓ సుజయ్ కారంపురి అన్నారు. ఇప్పటికే ల్యాండ్‌ను గుర్తించామని, రానున్న రెండు మూడు నెలల్లో ల్యాండ్ కేటాయింపులు చేయడం స్టార్ట్ చేస్తామని చెప్పారు. ముఖ్యంగా మైక్రో, స్మాల్, మీడియం కంపెనీ (ఎంఎస్‌ఎంఈ) లను ఆకర్షించేందుకు ఈ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా దివిటిపల్లి (మహబూబ్‌నగర్) లో ఎనర్జీ స్టోరేజ్ పార్కును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటోందని చెప్పారు. ఇక్కడ లిథియం అయాన్ సెల్, బ్యాటరీ తయారీని ప్రమోట్ చేస్తామని అన్నారు. సోలార్ సెల్, సోలార్ మాడ్యుల్స్ అసెంబుల్ చేయడం వంటి రెన్యువబుల్ ఎనర్జీకి చెందిన ఇతర ప్రొడక్టల మాన్యుఫాక్చరింగ్‌ను పెంచుతామన్నారు. హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి హబ్‌గా మార్చాలని కంపెనీలను కోరారు. కరెంట్ బండ్లయిన టూ వీలర్, ఆటో రిక్ష, కార్లు, క్యాబ్‌లు, బస్సులను కొనే వారికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందని చెప్పారు. వీరికి రోడ్డు ట్యాక్స్ నుంచి మినహాయింపు దొరుకుతుందని సుజయ్ చెప్పారు. హైటెక్స్‌లో రెండు రోజుల పాటు జరిగే ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్‌పో శనివారం ప్రారంభమయ్యింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న సుజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈవీపై ఫుల్ ఫోకస్..
ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్‌ను ప్రాధాన్య సెక్టార్‌గా చూస్తోందని టీఎస్‌ఆర్‌ఈడీసీ జీఎం ప్రసాద్ అన్నారు. మన సీఎం, మినిస్టర్లు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వాడుతున్నారని అన్నారు. ‘తెలంగాణ ఏర్పడక ముందే మన దగ్గర 34 మెగా వాట్ల సోలర్ ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీ ఉండేది. ప్రస్తుతం ఇది 3,900 మెగా వాట్లకు పెరిగింది’ అని ప్రసాద్ చెప్పారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల విషయంలోనూ తెలంగాణ టాప్‌లో ఉందని రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామక్రిష్ణ అన్నారు. ప్రస్తుతానికి 9 వేల ఈవీలు రాష్ట్రంలో రిజిస్టర్ అయ్యాయని చెప్పారు. కామన్ వెల్త్ గేమ్స్ టైమ్‌లో ఇండియాలో మొదటి సారిగా ఈవీని చూశాం. ప్రస్తుతం చాలా ఈవీలు రోడ్లపై కనిపిస్తుంటే కల నిజమయినట్టు అనిపిస్తోందని ఈ ఈవీ ఎక్స్‌పోని ఆర్గనైజ్ చేస్తున్న కంపెనీ సోనీ ఈ –వెహికల్స్ పేర్కొంది. ఇప్పటి వరకు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, లక్నోలలో 11 ఈవీఎక్స్‌పోలను ఏర్పాటు చేశారు. ఆల్టిస్ టెక్నాలజీ, సోని ఈ వెహికల్స్, ఫ్రాంక్లిన్ ఈవీ, రోజ్‌మెట్రా, లయాన్‌ఎనర్జీ, ఎపిక్ బైక్స్, ఈవీ ఛార్జ్‌మ్యాన్, యోగో బైక్స్, మయూరి ఈ రిక్ష, ఓలెక్ట్రా, డూడుల్, జౌల్ పాయింట్ వంటి 42 కంపెనీలు ఈ ఎక్స్‌పోలో పాల్గొన్నాయి. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా ఆదివారం ఈవీ ఎక్స్‌పోని సందర్శించే అవకాశం ఉంది.