కవిత ఫోన్ల చుట్టే ఈడీ విచారణ

కవిత ఫోన్ల చుట్టే ఈడీ విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత 10  సెల్ ఫోన్లను ధ్వంసం లేదా మార్చినట్లుగా ఈడీ అధికారులు అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 21 ఈడీ విచారణకు వెళ్తున్న సందర్భంలో.. తాను గతంలో వాడిన మొబైల్ ఫోన్లను కూడా తీసుకెళ్లారు. రెండు కవర్లలో మొబైల్స్ ను మీడియా ప్రతినిధులకు చూపించి.. కారెక్కారు. ఈడీ కార్యాలయానికి చేరుకుని కారు దిగిన తర్వాత కూడా మరోసారి తాను గతంలో వాడిన ఫోన్లు మీడియా ప్రతినిధులకు చూపించారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత మూడోసారి ఈడీ ముందు (వరుసగా రెండోరోజు) హాజరయ్యారు. 

ఫోన్ల చుట్టే విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  36 మందిని నిందితులు, అనుమానితులుగా గుర్తించిన ఈడీ...వారంతా 170 ఫోన్లు వాడినట్టుగా తెలిపారు.  ఇప్పటివరకు  కేవలం 17 ఫోన్లు మాత్రమే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఫోన్ల ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. ప్రధానంగా ఈడీ అధికారులు కవితను ఫోన్ల చుట్టే ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. 

ఈడీకి కవిత లేఖ

ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తనపై ఈడీ తప్పుడు ప్రచారం చేస్తోందని, దురుద్దేశంతో వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. అందుకే తన పాత ఫోన్లన్నీ ఇచ్చేస్తున్నానని పేర్కొన్నారు. నవంబర్​ లోనే తాను ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ప్రచారం చేసిందని,  ఏ ఉద్దేశంతో ఇలా చేశారని కవిత ఈడీని ప్రశ్నించారు. మహిళల ఫోన్లు స్వాధీనం చేసుకోవడం అంటే స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందన్నారు. ఫోన్ల విషయంలో కనీసం సమన్లు కూడా ఇవ్వలేదని కవిత తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను విచారణకు సహకరిస్తున్నానని తెలిపారు.