తమిళనాడులో మరో ఘోరం.. పవర్ ప్లాంట్లో ప్రమాదం 9 మంది కూలీలు మృతి

తమిళనాడులో మరో ఘోరం.. పవర్ ప్లాంట్లో ప్రమాదం 9 మంది కూలీలు మృతి
  • ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ సంతాపం

చెన్నై: తమిళనాడులో మరో ఘోర ప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఆర్చ్ (కమాన్) మంగళవారం రాత్రి సడెన్​గా కూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు తొమ్మిది మంది చనిపోయారు. మృతులంతా అస్సాం నుంచి వలస వచ్చిన వారేనని అధికారులు తెలిపారు. చెన్నై శివార్లలోని ఎన్నోర్ సూపర్ క్రిటికల్ పవర్ స్టేషన్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) ఆవరణలోని ఈ విద్యుత్ ప్లాంట్ లో ఆర్చ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నట్టుండి అది కూలిపోవడంతో వలస కూలీలు మృత్యువాత పడ్డారని టీఏఎన్జీఈడీసీఓ చైర్మన్, ఎండీ డా.జే రాధాకృష్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు. 

ప్లాంట్ లో బొగ్గు నిల్వ చేసే గోడౌన్ నిర్మిస్తున్నామని, మంగళవారం పైకప్పు, ఆర్చ్ అమర్చే పనులు చేపట్టామని వివరించారు. గోడౌన్ కు ఆర్చ్  అమర్చే ప్రయత్నాల్లో ఉండగా ఈ ఘోరం జరిగిందని, దాదాపు 45 అడుగుల పైనుంచి ఆర్చ్ మీదపడడంతో కూలీలు స్పాట్ లోనే చనిపోయారని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో కూలీని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ప్రమాదంపై విచారణ చేపట్టినట్లు రాధాకృష్ణన్ వివరించారు. కాగా, ప్రమాదం విషయం తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని, ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. గాయపడిన కూలీకి రూ.50 వేలు పరిహారం అందిస్తామని మోదీ తెలిపారు. విద్యుత్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన అస్సాం కూలీల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు అందజేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.