వెలుగు సక్సెస్.. బయో రిమిడియేషన్​

వెలుగు సక్సెస్.. బయో రిమిడియేషన్​

శిలాజ ఇంధనాల దహనం, రసాయనాల వాడకం, గృహ, పారిశ్రామిక రంగాల నుంచి జనించే కర్బన, అకర్బన మూలక కాలుష్యకాలు, భార లోహాలు, మురుగు వల్ల గాలి, నీరు, ఆహారం, ఆవరణ వ్యవస్థలు కాలుష్యానికి గురవుతున్నాయి. అయితే, జీవ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యావరణ కాలుష్యాన్ని నివారించే అవకాశం ఉంది. దీన్నే బయో రిమిడియేషన్​ అంటారు. సూక్ష్మ జీవులు లేదా సూక్ష్మ జీవుల మిశ్రమాన్ని వినియోగించి కాలుష్యకాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడాన్నే బయోరిమిడియేషన్​ అంటారు. బయో రిమిడియేషన్​ను రెండు విధాలుగా చేపట్టవచ్చు. 

1. కాలుష్యకాలను ఆక్సిజన్​ సమక్షంలో సూక్ష్మజీవుల సహాయంతో విచ్ఛిన్నం చెందించి  కార్బన్​, నీటి అణువులుగా మార్చే విధానం. 
2. అవాయు శ్వాసక్రియ విధానం(ఆక్సిజన్​ లేకుండా)లో సూక్ష్మజీవుల సాయంతో మృత్తికలో ఉన్న రసాయనాలను విచ్ఛిన్నం చేసే విధానం.

బయో స్టిమ్యులేషన్​: సూక్ష్మజీవుల సాయంతో మృత్తిక లేదా నీటిలో సహజసిద్ధంగా నిర్వహించబడుతున్న బయో రిమిడియేషన్​ను ప్రేరేపించే విధానాన్నే బయో స్టిమ్యులేషన్​ అంటారు.
బయో ఆగ్​మెంటేషన్: సూక్ష్మజీవులను సరఫరా చేసి కాలుష్యకాలను తొలగించడాన్నే బయో ఆగ్​మెంటేషన్​ అంటారు. మున్సిపల్​ వేస్ట్​ వాటర్​ ట్రీట్​మెంట్​లో ఈ రకమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. 
ఇంట్రినిక్స్​ బయో రిమిడియేషన్​: దీన్నే నేచురల్​ అటిన్యుయేషన్​ అంటారు. సహజ వాతావరణంలో మానవ ప్రమేయం లేకుండా పూర్తిస్థాయి సూక్ష్మజీవులతో నిర్వహిస్తున్న బయో రిమిడియేషన్​ ప్రక్రియనే ఇంట్రినిక్స్ ​బయో రిమిడియేషన్​ అంటారు. చమురు వ్యర్థాల నిర్మూలనలో ఈ విధానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 
ఇన్​ సిటు బయో రిమిడియేషన్​: కాలుష్య పదార్థాలు జనించిన ప్రాంతంలోనే బయో రిమిడియేషన్​ చేపడితే దాన్ని ఇన్​ సిటు బయో రిమిడియేషన్​ అంటారు. నేల కాలుష్య కారకాలను బయోరిమిడియేషన్​ ద్వారా తొలగించాలనుకున్నప్పుడు మృత్తికలో ఉన్న బ్యాక్టీరియాకు ఎరువులు, పోషకాలు, ఆక్సిజన్​ను అందిస్తారు. ఈ పోషకాలు, ఎరువులు సూక్ష్మజీవులకు ఉన్న విచ్ఛిన్న సామర్థ్యాన్ని పెంచుతాయి.
ఎక్స్​టు బయో రిమిడియేషన్​: ఈ రకమైన బయోరిమిడియేషన్​ ప్రక్రియలో ఒక ప్రాంతంలో జనించిన వ్యర్థ పదార్థాలను మరో ప్రాంతానికి తరలించి బయోరిమిడియేషన్​ను చేపడుతారు. 

అనువర్తనాలు

పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణకు అనుగుణంగా విస్తరిస్తున్న పర్యావరణ కాలుష్యాన్ని తొలగించడానికి బయో రిమిడియేషన్​ ఒక పరిష్కారం. ఈ పద్ధతి పర్యావరణాన్ని శుభ్రపరచడంలో చౌకైంది. సులువైంది. సురక్షితమైంది. అధిక ప్రయోజనం కలిగి ఉంది. జనజీవన ప్రదేశాలకు దూరంగా ఈ పద్ధతి ద్వారా కాలుష్యకాలను తొలగించవచ్చు. ఇంతటి ప్రయోజనాలు కలిగిన  ఈ బయో రిమిడియేషన్​ అనువర్తనాలను ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగిస్తున్నారు.

అనువర్తనాలు

1. అనేక ప్రదేశాల్లో పట్టణ, పారిశ్రామిక వ్యర్థాలను  లాండ్​ ఫార్మింగ్​, బయో ఫిల్లింగ్​, ఎక్స్​ సిటు బయోరిమిడియేషన్ ద్వారా కాలుష్యరహితం చేసి జీవ విచ్ఛన్నం చేస్తున్నారు.
2.  సముద్ర ఉపరితలంపై ఏర్పడిన చమురు తెట్టులను, ఆయిల్​ రిఫైనరీల్లో ఉత్పత్తయ్యే వ్యర్థ పదార్థాలను జీవ విచ్ఛిన్నం చేయడానికి జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉత్పత్తి చేసిన అనేక బ్యాక్టీరియాలను ఉపయోగిస్తున్నారు. 
ఉదాహరణలు 

  •     సముద్ర ఉపరితలంపై ఏర్పడిన చమురు తెట్టును తొలగించేందుకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు సూడోమోనాస్ పుటిడ అనే బ్యాక్టీరియాను జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సృష్టించారు. 
  •     2010లో మెక్సికో తీర ప్రాంతంలో మునిగిన నౌక వల్ల ఏర్పడిన చమురు తెట్టును తొలగించేందుకు ఓషనోస్పిరిల్లేవ్​ అనే బ్యాక్టీరియాను జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తయారు చేశారు. 
  •     భారతదేశంలో డిపార్ట్​మెంట్​ ఆఫ్​ బయో టెక్నాలజీ, ది ఎనర్జీ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​(టీఈఆర్​ఐ) శాస్త్రవేత్తలు చమురు శుద్ధి కర్మాగారాల్లో ఉత్పత్తయ్యే  వ్యర్థ పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు ఆయిల్​ జాఫర్​ అనే సూక్ష్మజీవిని జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో టీఈఆర్​ఐ శాస్త్రవేత్తలు ఆయిల్​ జాఫర్​ – ఎస్​ అనే మరో సూక్ష్మజీవి మిశ్రమాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఇది ఆయిల్​ జాఫర్​ కంటే సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది. 

3. ప్లాస్టిక్​ పరిశ్రమల్లో ఉత్పత్తి చేసే మిథనాల్​ వంటి కాలుష్యకాల వల్ల నేల కాలుష్యం సంభవిస్తుంది. ఈ రకమైన కాలుష్యకాలను జీవ విచ్ఛిన్నం చెందించేందుకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మిథైల్​ కోకస్​ క్యాప్సులేటస్​ అనే బ్యాక్టీరియాను జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సృష్టించారు. 
4. గృహ సంబంధ వ్యర్థ పదార్థాలను నేరుగా పర్యావ రణంలోకి వదలకుండా బయో ఆగ్​మెంటేషన్​ పద్ధతి ద్వారా శుద్ధిచేసి అనేక దేశాల్లో పర్యావరణ పరిరక్షణ చేపడుతున్నారు. అమెరికాకు చెందిన ప్రొవెస్టమ్​ కార్పొరేషన్​ అనే సంస్థ మురుగు వ్యర్థాల నుంచి ప్రొవెస్టమ్​ అనే ఏకకణ ప్రోటీన్​ను తయారు చేసి పశువులకు దాణాగా ఉపయోగిస్తున్నారు. 

సమస్యలు

  • బయోరిమిడియేషన్​ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ కాలుష్యకాలను విచ్ఛిన్నం చేసేందుకు రోజుల నుంచి నెలల వరకు సమయం తీసుకుంటుంది.
  •     ఈ ప్రక్రియలో అన్ని పరిమాణాల్లో ఉండే కాలుష్యకాలు తొలిగిపోవు.
  •     బయో రిమిడియేషన్​ ప్రక్రియ ద్వారా లెడ్​, కాడ్మియం, మెర్క్యురీ తదితర భారీలోహ కాలుష్యకాలు తొలగిపోవు.
  •     ఇన్​సిటు బయో రిమిడియేషన్​ జరిపే ప్రదేశం కచ్చితంగా పారగమ్యత కలిగిన మృత్తికను కలిగి ఉండాలి.
  •     బయోరిమిడియేషన్​ ప్రక్రియ నియంత్రణ సరిగ్గా లేకపోతే కాలుష్యకాలు పూర్తిగా విచ్ఛిన్నం కాకపోగా, ప్రమాదకరమైన విష కాలుష్యకాలు ఉప ఉత్పన్నాలుగా ఏర్పడే అవకాశం ఉంది.
  •     బయో రిమిడియేషన్​ ప్రక్రియ ఉష్ణోగ్రత, తేమ, పీహెచ్​ తదితర పర్యావరణ కారకాల దృష్ట్యా చాలా సున్నితమైంది. 
  •     ఎక్స్​ సిటు బయోరిమిడియేషన్​ ప్రక్రియలో వొలెటైల్​ ఆర్గానిక్​ కాంపౌండ్స్​ను నియంత్రించడం కష్టతరమైంది.
  •     ఈ ప్రక్రియను పరిశుభ్రమైన స్థలాల్లో నిర్వహిచకపోతే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేం.