తండ్రి చనిపోతే.. బిడ్డకు.. బిడ్డ చనిపోతే.. ఆమె పిల్లలకు ఆస్తిలో వాటా

తండ్రి చనిపోతే.. బిడ్డకు.. బిడ్డ చనిపోతే.. ఆమె పిల్లలకు ఆస్తిలో వాటా

‘2005 చట్టం’.. అంతకు ముందు నుంచీ వర్తిస్తది
కూతురు చనిపోతే ఆమె బిడ్డలూ హక్కుదారులే
హిందూ వారసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు క్లారిటీ
ఇలాంటి కేసులను 6 నెలల్లో క్లియర్‌‌ చేయాలని ఆదేశం

న్యూఢిల్లీ: తల్లిదండ్రుల ఆస్తిలో ఆడపిల్లలకు హక్కుపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 అమల్లోకి వచ్చిన నాటికి తండ్రి బతికున్నా లేకున్నా కొడుకులతో సమానంగా కూతురుకు ఆస్తిలో హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. 2005కు ముందు నుంచి (రెట్రో స్పెక్టివ్‌ గా) కూడా చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. కూతురు చనిపోతే ఆమె బిడ్డలకూ హక్కుంటుందంది. ఆడపిల్లలకు ఆస్తి హక్కుపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను విచారించిన జస్టిస్‌ అరుణ్‌మిశ్రా, జస్టిస్‌ ఎస్‌ నజీర్‌, జస్టిస్‌ఎంఆర్‌షాల త్రిసభ్య బెంచ్‌ మంగళవారం ఈ తీర్పునిచ్చింది.

గతంలో వేర్వేరు తీర్పులు
2005కు ముందు నుంచి కూడా హిందూ వారసత్వ సవరణ చట్టం వర్తిస్తుందా లేదా అనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఈ విషయంపై 2015లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. తండ్రి, కూతురు 2005 నాటికి బతికి ఉంటే సవరణ వర్తిస్తుందని చెప్పింది. తర్వాత 2016లో ప్రకాశ్‌ వర్సెస్‌ ఫులావతి కేసులో 2005కు ముందు చట్టం వర్తించదని చెప్పింది. 2018లో దనమ్మ వర్సెస్‌ అమర్‌ కేసులో 2005కు
ముందు నుంచి కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు బెంచ్‌ తీర్పునిచ్చింది.

ప్రకాశ్‌ వర్సెస్‌ ఫులావతి కేసేంటి?
ప్రకాశ్ వర్సెస్ ఫులావతి కేసులో బాధితురాలి తండ్రి 1999 డిసెంబర్ 11న మరణించారు. ఆస్తిలో ఆడపిల్లకు సమాన హక్కు కల్పిస్తూ 2005 సెప్టెంబర్ 9న సవరణలు చేశారు. సవరణ చేసిన తేదీని ప్రాతి పదికగా తీసుకుంటే ప్రకాశ్ వర్సెస్ ఫులావతి కేసులో బాధితురాలికి ఆస్తిలో హక్కు ఉండదనేది వాదన. అయితే ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలు ఆస్తిలో హక్కు ఉంటుందని సుప్రీం తాజా తీర్పులో స్పష్టంచేసింది.

తండ్రిని కూతురు ప్రేమిస్తూనే ఉంటది
హిందూ వారసత్వ సవరణ చట్టంపై జస్టిస్‌ అరుణ్‌మిశ్రా తాజాగా క్లారిటీ ఇచ్చారు. ‘కొడుకు.. పెండ్లాం వచ్చే వరకే కొడుకు. కూతురు.. తండ్రిని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటుంది. తండ్రి ఉన్నా లేకపోయినా పుట్టింటితో జీవితాంతం అనుబంధం కొనసాగిస్తుంది. తండ్రి బతికున్నా లేకున్నా కొడుకులాగే కూతురుకు వారసత్వ హక్కుంటుంది’ అని చెప్పారు. కూతురు చనిపోతే తన తండ్రి ఆస్తిలో ఆమె పిల్లకు హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా హైకోర్టుల్లో ఈ కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయని, రకరకాల వ్యతిరేక తీర్పుల గందరగోళంతో ముందుకు సాగలేదని అన్నారు. తాజాగా ట్రయల్ కోర్టుల్లో పెండింగ్‌‌లో ఉన్న ఇలాంటి కేసులను 6 నెలల్లో పరిష్కరించాలని చెప్పారు.

For More News..

చలాన్ రాస్తూ మాస్క్ పెట్టుకోని పోలీస్.. ఫైన్ వేసిన ఎస్పీ

వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

టాప్ టెన్ హయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్‌ విడుదల.. ఇండియా నుంచి ఒకే ఒక్కడు..