ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ఈ సారి ప్రత్యేకత ఏంటంటే..

ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ఈ సారి  ప్రత్యేకత ఏంటంటే..

నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హలపౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి. దాన్ని జేష్ట పౌర్ణమి రోజునే ఎందుకు చేసుకుంటారు . ఈ ఏడాది జూన్ 4 నుంచి ఏరుకాక పనులు ప్రారంభమయ్యాయి.  

దుక్కిదున్నే రోజు..

వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా కూడా, జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం. ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు... ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక కేలెండర్‌ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్ధకించకుండా... ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు. 

వ్యవసాయ పనిముట్లకు పూజలు.. ఎద్దులకు పొంగలి ప్రసాదం


ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రంచేసుకుంటారు రైతులు. వాటికి పసుపుకుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతైతే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి, పసుపుకుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కలో కొందరు, తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి, కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఏరువాక సాగుతుండగా, అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా ఉంటుంది. మన దేశంలోని దాదాపు 80 శాతం వర్షపాతం ఈ నైరుతి వల్లనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకోవడం గమనించవచ్చు. 

ఏరువాక అంటే ఏమిటి..

వ్యవసాయాన్ని ఓ యజ్ఞంగా భావిస్తారు. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేసి దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఈ వేడుకను జ్యేష్ఠ పౌర్ణమిరోజే ఎందుకు జరుపుకుంటారంటే. ఏరువాక అనే మాట అందరికీ తెలిసినదే! కానీ ‘ఏరువాక’ అనే పదానికి అర్ధం చాలామందికి తెలియదు. ఏరు అంటే ఎద్దులను పూన్చి దుక్కి దున్నడానికి సిద్దపరచిన నాగలి. దుక్కిదున్నే పనిని శాస్త్రోక్తంగా ప్రారంభించడాన్ని ‘ఏరువాక’ అని పేరు అంటే వ్యవసాయ పనుల ప్రారంభించడం అని అర్థం. 

జ్యేష్ఠ పౌర్ణమి రోజే  ఎందుకు... 

సస్యానికి అధిపతి చంద్రుడు  ఇంకా చెప్పాలంటే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమనాడు మొదటిసారి పొలాన్ని దున్నడం సెంటిమెంట్.

పంటపొలం దైవక్షేత్రం..

పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తారు, వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం..అందుకే దీన్న యజ్ఞంలా పవిత్రంగా భావించి చేస్తారు. అందుకే పొలం గట్లపై చెప్పులేసుకుని నడుస్తారు కానీ పొలాలు లోపలకు దిగేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకోరు. ఏందుకంటే ఆ క్షేత్రం దైవసమానంగా భావిస్తారు. అందుకే వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జ్యేష్ఠ పూర్ణిమరోజు రైతులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి పూజిస్తారు. వాటికి భక్ష్యాలు సమర్పించి మేళతాళాలతో ఊరేగిస్తారు.

ఏరువాకకి ఎన్ని పేర్లో..

ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో అంటారు, కన్నడంలో కారణి పబ్సం అని జరుపుకుంటారు. అధర్వణవేదం ఏరువాకను 'అనడుత్సవం'గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు లాంటి  మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. 

విష్ణు పురాణంలో..

 విష్ణు పురాణంలో సీతాయజ్ఞంగా ఏరువాక గురించి ప్రస్తావించబడింది. ఇందులో సీత అంటే నాగలి అని అర్థం. 'వప్ప మంగళ దివసం'.. 'బీజవాపన మంగళ దివసం'...'వాహణ పుణ్ణాహ మంగళమ్‌'...'కర్షణ పుణ్యాహ మంగళమ్‌..' అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకునేవారు. శుద్ధోదనమహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా శాస్త్రాలలో వివరించబడింది. హాలుడు రాసిన గాథాసప్తశతిలో ఏరువాక గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్యధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నల ప్రస్తావన వచ్చింది

వేదకాలం నుంచే..

వేద కాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీనకాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తున్నారు. అధర్వవేదం ఏరువాకను 'అనడుత్సవం'గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం వంటి పద్ధతులను ఆచరించేవారు. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగ గురించి ప్రస్తావించారు.కొన్ని ప్రాంతాలలో ఊరు బయట, గోగునారతో చేసిన తోరాలు కడతారు. రైతులంతా అక్కడికి చేరి చెర్నాకోలతో ఆ తోరాలను కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకొచ్చి ఎద్దుల మెడలో కడతారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయం, పశు సంపద వృద్ది చెందుతుందని నమ్ముతారు. వేదకాలంలో సైతం ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది. కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కేవగా ఉండేది కాబట్టి, ఈ రోజున ఇంద్రపూజకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు. నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కకి జరిగినా... వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు, తప్పదు కూడా..