
అంతరిక్షంలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా ఆక్సియం-4 (Ax-4) మిషన్ సిబ్బంది తిరిగి భూమికి వచ్చే తేదీ వాయిదా పడింది. జూలై 14కి తిరిగి వచ్చే అవకాశం ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తెలిపింది.
ఆక్సియం-4 మిషన్ సాధారణంగా 14 రోజుల పాటు కొనసాగనుండగా మరికొద్దిరోజులకు పొడిగించినట్లు తెలుస్తోంది. ఈ మిషన్ జూన్ 25న ప్రారంభమైంది. జూలై 10 నాటికి 14 రోజులు పూర్తయ్యాయి. అయితే, సిబ్బంది తిరిగి వచ్చే తేదీని జూలై 14 వరకు పొడిగించినట్లు ESA పేర్కొంది.
అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చేందుకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.ల్యాండింగ్ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు, అంతరిక్ష నౌక సిద్ధంగా ఉండటం, ఇతర కక్ష్య షెడ్యూల్స్ వంటివి తిరిగి రావడానికి ఆలస్యం కావడానికి కారణాలుగా భావిస్తున్నారు.
భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, ఆక్సియం-4 మిషన్‌లో పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో అడుగుపెట్టిన తొలి భారతీయ వ్యోమగామి ఈయనే. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడు కూడా శుక్లానే.
ISSలో శుభాన్షు శుక్లా వివిధ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో మొక్కల పెరుగుదల, స్టెమ్ సెల్ పరిశోధన, వ్యోమగాముల జీవశాస్త్రంపై మైక్రోగ్రావిటీ ప్రభావం వంటి వాటిపై ఆయన ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా సూట్ రైడ్ ప్రాజెక్టులో భాగంగా మధుమేహం పర్యవేక్షణకు ఉపయోగించే టెక్నాలజీలను అంతరిక్షంలో పరీక్షిస్తున్నారు.
ఆక్సియం-4 మిషన్‌లో శుభాన్షు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గి విట్సన్ (అమెరికా), మిషన్ స్పెషలిస్ట్ స్లావోస్ ఉజ్నాన్స్కీ-విస్నియెవ్స్కి (పోలాండ్), మిషన్ స్పెషలిస్ట్ టిబోర్ కపు (హంగేరీ) ఉన్నారు.
ఆక్సియం-4 మిషన్ సిబ్బంది సురక్షితంగా భూమికి తిరిగి రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆక్సియం స్పేస్, స్పేస్‌ఎక్స్, నాసా ,అంతర్జాతీయ భాగస్వాములు పర్యవేక్షిస్తున్నారు.