గ్రామాల్లో ప్రజాపాలన టీమ్​లు ఏర్పాటు చేయండి : దానకిశోర్

గ్రామాల్లో ప్రజాపాలన టీమ్​లు ఏర్పాటు చేయండి :   దానకిశోర్

హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఈనెల 28న నిర్వహించనున్న వార్డు సభలకు అవసరమైన టీమ్​లు ఏర్పాటు చేయాలని ఎంఏయూడీ ప్రిన్సిపల్​సెక్రటరీ దానకిశోర్​అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్రంలోని మున్సిపల్​కార్పొరేషన్​లు, మున్సిపాలిటీల కమిషనర్​లతో ప్రజాపాలన సన్నద్ధతపై సీడీఎంఏ ఆఫీస్​లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ప్రజాపాలన సభలు ప్రారంభం కావడానికి రెండు రోజులే వ్యవధి ఉందని, ఈ లోగా అన్ని వార్డుల టీమ్​ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం, వాటికి రశీదులు ఇవ్వడం, ఆయా అప్లికేషన్లను కంప్యూటరైజ్​చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఏయే వార్డుల్లో ఏ రోజు సభ ఉంటుందనే దానిపైనా విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. 

వార్డు సభల్లో ఆయా వార్డులకు చెందిన ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, ముందుగానే వారికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంపై ప్రతి రోజు స్టేట్​హెడ్​క్వార్టర్స్​కు నివేదికలు పంపాలని సూచించారు. సమావేశంలో సీడీఎంఏ దాసరి హరిచందన, జేడీలు కృష్ణమోహన్​రెడ్డి, శ్రీధర్​తదితరులు పాల్గొన్నారు.