బలవంతంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసిన్రు

 బలవంతంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసిన్రు
  • కేసీఆర్ అండగా ఉన్నాడనే ధీమాతోనే  వృద్ధ దంపతులపై దాడి
  • గాయపడ్డ వారిని బలవంతంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసిన్రు
  • పులుమామిడిలో బాధితుడు యాదయ్యను  పరామర్శించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ 

చేవెళ్ల/వికారాబాద్, వెలుగు : కేసీఆర్ అండగా ఉన్నాడనే ధీమాతోనే అధికార పార్టీ నాయకులు పులుమామిడిలో వృద్ధ దంపతులపై దాడికి పాల్పడ్డారని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పొలం అమ్ముతలేరని చేవెళ్ల సెగ్మెంట్ నవాబుపేట మండలం పులుమామిడికి చెందిన వృద్ధ దంపతులు యాదయ్య, భారతమ్మపై ఇటీవల టీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త, తమ్ముడు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ యాదయ్య నిమ్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా.. గురువారం అధికారులు బలవంతంగా డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. అతడి భార్య భారతమ్మ వికారాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిట్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. 

శుక్రవారం పులుమామిడికి గ్రామానికి వెళ్లిన ఈటల రాజేందర్  బాధితుడు యాదయ్య ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న యాదయ్యను బలవంతంగా డిశ్చార్జి చేసి పంపడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. పేదల భూములను లాక్కునేందుకు టీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. మూడేళ్లుగా యాదయ్య, భారతమ్మ దంపతులను ఎంపీటీసీ భర్త, అతడి తమ్ముడు వేధిస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎస్ఐ మద్దతుతోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. జిల్లా ఎస్పీ స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

భారతమ్మను పంపించేందుకు తనిఖీల సాకుతో  హాస్పిటల్ సీజ్


దాడిలో గాయపడ్డ యాదయ్య భార్య భారతమ్మ వికారాబాద్ లోని మెడిక్యూర్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. గురువారం తనిఖీల పేరుతో అక్కడికి వచ్చిన డిప్యూటీ డీఎంహెచ్​వో జీవన్ రాజ్ హాస్పిటల్ పేపర్లు సరిగా లేవంటూ సీజ్ చేశారు. పేషెంట్లను ప్రభుత్వ ఆస్పత్రికి పంపించాలని ఆదేశించారు. దీనిపై ఆగ్రహించిన  భారతమ్మ బంధువులు అక్కడ ఆందోళన చేపట్టారు. ఆమెను పంపించేందుకు నాయకుల ఒత్తడికి తలొగ్గి అధికారులు తనిఖీల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ వార్డులో భారతమ్మకు ట్రీట్​మెంట్ అందిస్తోంది.