అవసరమైతే తప్ప ఆక్సిజన్ పెట్టొద్దు

అవసరమైతే తప్ప ఆక్సిజన్ పెట్టొద్దు

కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం పూర్తిస్థాయిలో పని చేస్తోందన్నారు మంత్రి ఈటల రాజేందర్. కరోనా వైద్యానికి అవసమైన రెమ్ డెసివర్ ఇంజెక్షన్ల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లా  హుజురాబాద్ మండలం కందుగుల హైస్కూల్ లో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ను ప్రారంభించారు ఈటల రాజేందర్. ఆక్సిజన్ అనేది రాష్ట్ర పని కాదన్నారు. మనకు దగ్గరగా ఉన్న  విశాఖ, బల్లారి స్టీల్ ప్లాంట్ల నుంచి కేటాయింపులు తగ్గించి.. ఎక్కడో 3800 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూర్కీ నుంచి కేటాయించారన్నారు. దీంతో ఒక్క ట్యాంకర్ రావడానికి ఏడెనిమిది రోజులు పడుతోందన్నారు. ట్రాన్స్ పోర్టు ఇబ్బందిగా ఉందన్నారు.  రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ కేటాయించాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు. ఇప్పటికైతే ఆక్సిజన్ కొరత లేదని.. కానీ పేషెంట్లు పెరిగితే ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అవసరమైతే తప్ప ఆక్సిజన్ పెట్టొద్దని డాక్టర్లను కోరమన్నారు. రాత్రి కర్ఫ్యూ పెట్టినప్పటికీ ప్రజలు స్వీయ నియంత్రణలో ఉండాలన్నారు. పల్లెల్లో కరోనా విస్తరించకుండా గ్రామ పంచాయితీ పాలకమండళ్లు, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.