కేసీఆర్ నిర్ణయాలతోనే రైతులకు ఇబ్బందులు

కేసీఆర్ నిర్ణయాలతోనే రైతులకు ఇబ్బందులు

తెలంగాణ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కారణం సీఎం కేసీఆరేనని అన్నారు. నాలుగు రోజుల్లో ధాన్యం మొత్తం కొనుగోలు చేయకపోతే.. కలెక్టరేట్ల ను ముట్టడిస్తామని మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హెచ్చరించారు. బుధవారం కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఈటల రాజేందర్ పర్యటించారు. బత్తినివారి పల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆ తర్వాత  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దాన్యం కొనుగోలు విషయంలో  కేసీఆర్ కు ముందుచూపు లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

తడుస్తున్న ధాన్యం, మొలకెత్తుతున్న ధాన్యంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతూ..తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని తెలిపారు. ఈ వర్షాకాలంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పినప్పటికీ.. వచ్చే సీజన్ కు ముడిపెట్టి కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.  రాజకీయాలు చేసుకోండి.. కానీ రైతుల జీవితాలతో చెలగాటం మాత్రం ఆడుకోవద్దని హెచ్చరించారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడదు అని, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని గుర్తు చేశారు ఈటల. రైతులతో పెట్టుకున్న ఎవరైనా సరే ముందుకు పోలేరని, కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పి హుందాగా వ్యవహరించిందన్నారు.