ఇండియా మార్కెట్లో ఎంట్రీకి ఎథోస్​ రెడీ

ఇండియా మార్కెట్లో ఎంట్రీకి ఎథోస్​ రెడీ
  • ఇన్​ఫ్రా, ఎనర్జీ ప్రాజెక్టులకు అప్పులు ఇస్తామంటున్న సీఈఓ

ముంబై: ఇండియా మార్కెట్లో అడుగు పెట్టడానికి అమెరికా కంపెనీ ఎథోస్​ ఎసెట్​ మేనేజ్​మెంట్​ ప్లాన్స్​ రెడీ చేసుకుంది. ప్రాజెక్టులకు ఈ కంపెనీ అప్పులిస్తుంది. ఇండియాలో రాబోయే అయిదేళ్లలో బిలియన్​ డాలర్ల మేర ప్రాజెక్టులకు అప్పులు ఇవ్వాలని ప్లాన్​ చేస్తున్నట్లు కంపెనీ సీనియర్​ అధికారి ఒకరు వెల్లడించారు.  కంపెనీ ఇచ్చే అప్పులను తీసుకున్న వారు 12 ఏళ్ల కాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా, యూరప్​, సౌత్​ అమెరికా దేశాలలో ఎథోస్​ ఇప్పటికే 9 బిలియన్​ డాలర్లను అప్పులుగా ఇచ్చింది. 2012 లో ఎథోస్​ కార్యకలాపాలు మొదలెట్టింది. ఇండియా ఎకనమిక్​ గ్రోత్​తోపాటు, యువత ఎక్కువగా ఉండటం తమను ఆకట్టుకుందని ఎథోస్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​, ఫౌండర్​ కార్లోస్​ శాంటోస్​ వెల్లడించారు. 

ఇండియాలో 10 సెక్టార్లు దూసుకెళ్తున్నాయని చెబుతూ, ఇందులో ఆరు సెక్టార్లు.... ఇన్​ఫ్రా, ఎనర్జీ, అగ్రి బిజినెస్​, మాన్యుఫాక్చరింగ్​, ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ తనకి ఇష్టమైనవని స్పష్టం చేశారు. 2023 సెకండ్​ హాఫ్​లో 100 మిలియన్​ డాలర్లను వెచ్చిస్తామని, 2024 లో 200 మిలియన్​ డాలర్లు వెచ్చిస్తామని ఆయన చెప్పారు. అయిదేళ్లలో ఈ పెట్టుబడులను బిలియన్​ డాలర్లకు చేరుస్తామని అన్నారు. క్లయింట్లు జరిపే రీపేమెంట్​ మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్​ చేస్తామని వివరించారు. తాము ఇండియాలో ఇచ్చే అప్పులు ఎక్స్​టర్నల్​ కమర్షియల్​ బారోయింగ్స్​ కిందకే వస్తాయని చెప్పారు. ఈ బిజినెస్​కు రెగ్యులేటరీ ఇబ్బందులేవీ ఉండకపోవచ్చని అన్నారు. అప్పుగా ఇచ్చే మొత్తంలో అయిదో వంతుకు సెక్యూరిటీ కోరతామని, ఈ సెక్యూరిటీని విదేశాలలో తమకు తనఖా పెట్టాల్సి ఉంటుందని కార్లోస్​ శాంటోస్​ వివరించారు. ఇప్పుడున్న వడ్డీ రేట్ల ప్రకారం చూస్తే, క్లయింట్లకు తాము ఇచ్చే అప్పులు 5 శాతానికి (ఏడాదికి) దొరుకుతాయని చెప్పారు.