జెట్ ను కొనెటోళ్లు దొరకడం కష్టమే?

జెట్ ను కొనెటోళ్లు దొరకడం కష్టమే?

జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ప్రస్తుత పరిస్థితిపై వైమానికరంగ నిపుణుడు ఒకరు వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. ఈ కంపెనీలో వాటా అమ్మకానికి ఎస్‌‌బీఐ నేతృత్వంలో కన్సార్షియం చేపట్టిన బిడ్డింగ్‌‌కు శుక్రవారం నాటికి ఆఖరి రోజు కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కంపెనీని కొనేందుకు ఏ ఒక్క బిడ్డర్‌‌ కూడా ముందుకు రాకపోవచ్చని, ఇప్పుడు వేసిన బిడ్లలోనూ చిత్తశుద్ధి లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.  గత నెల 17 నుంచి జెట్‌‌ను మూసివేయడంతో వందల మంది ఉద్యోగులు ఇతర కంపెనీల్లో చేరారు. విమానాలు కూడా ఒక్కొక్కటిగా డిరిజిస్టర్‌‌ అవుతున్నాయి. ఫలితంగా జెట్‌‌ భవిష్యత్‌‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

జెట్‌‌కు రూ.8,400 కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. వీటిని రాబట్టుకోవడానికి బ్యాంకులు జెట్‌‌ వాటాలను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రైవేట్‌‌ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్‌‌, ఇండిగో పార్టనర్స్‌‌, నేషనల్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ అండ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ ఫండ్‌‌ (ఎన్‌‌ఐఐఎఫ్‌‌), ఎతిహాద్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ఆసక్తిని చూపించడంతో బిడ్స్‌‌ వేసేందుకు అనుమతించారు. అయితే ఇవి ఇంత వరకు ప్రతిపాదనలను సమర్పించలేదు.  తాజాగా మూడు బిడ్లు వచ్చిన మాట నిజమేనని, అయితే మొదట బిడ్లు వేసిన వారికే ప్రాధాన్యం ఇస్తామని ఎస్​బీఐ  ప్రకటించింది. శుక్రవారం బిడ్లకు గడువు ముగియడంతో జెట్‌‌ కొనేది ఎవరనే విషయమై పారిశ్రామిక వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం జెట్‌‌లో 24 శాతం వాటా ఉన్న ఎతిహాద్‌‌కు అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. అయితే జెట్‌‌ ఎయిర్‌‌వేస్ డొమెస్టిక్‌‌ స్లాట్లను, ఇంటర్నేషనల్‌‌ ట్రాఫిక్‌‌ రైట్స్‌‌ను ప్రభుత్వం స్పైస్‌‌జెట్‌‌ వంటి ఇతర కంపెనీలకు కేటాయించింది. జెట్‌‌ ఇచ్చిన బ్యాంక్‌‌ గ్యారంటీని కూడా సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.