
- నయారా ఎగుమతులపై ఈయూ బ్యాన్
- రష్యాపై ఆంక్షల్లో భాగంగా రాస్‌నెఫ్ట్‌కు వాటాలున్న ఈ కంపెనీపై డైరెక్ట్‌గా చర్యలు
- రష్యా, చైనా బ్యాంకులపై రిస్ట్రిక్షన్లు, నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్‌పై నిషేధం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌తో యుద్ధం ఇంకా కొనసాగిస్తున్నందుకు రష్యాపై కొత్త ఆంక్షలను యూరోపియన్ యూనియన్ (ఈయూ) శుక్రవారం ప్రకటించింది. ఈ ఆంక్షల్లో భాగంగా రష్యా ప్రభుత్వానికి చెందిన ఆయిల్ రిఫైనరీ కంపెనీ రాస్‌నెఫ్ట్‌ను టార్గెట్ చేసింది.
ఈ కంపెనీకి చెందిన ఇండియా బిజినెస్ నయారా ఎనర్జీ లిమిటెడ్‌పై రిస్ట్రిక్షన్లు పెట్టింది. ఇక నుంచి పెట్రోల్, డీజిల్‌ను యూరోపియన్ దేశాలకు నయారా ఎగుమతి చేయలేదు. కాగా, రాస్‌నెఫ్ట్‌కు నయారా ఎనర్జీ లిమిటెడ్ (గతంలో ఎస్సార్ ఆయిల్)లో 49.13శాతం వాటా ఉంది. ఇది గుజరాత్‌లోని వడినార్‌లో 2 కోట్ల టన్నుల రిఫైనరీ, దేశం మొత్తంమీద 6,750 పెట్రోల్ పంపులను నిర్వహిస్తోంది.
అంతేకాకుండా రష్యా తన క్రూడాయిల్‌ను బ్యారెల్‌కు 45–50 డాలర్లలోపే అమ్మేలా ప్రైస్ క్యాప్‌ను తగ్గించింది. గతంలో బ్యారెల్‌పై ప్రైస్ క్యాప్ 60 డాలర్లుగా ఉంది. ఈ రిస్ట్రిక్షన్ వలన ఇండియా లాభపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతం దగ్గర ఉంది. అయితే 50 రోజుల్లో ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు.
దీంతో రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను ఇండియా తగ్గించే అవకాశం ఉంది. తాజా ఆంక్షల్లో భాగంగా నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్‌లపై నిషేధం, రష్యా బ్యాంకింగ్ సెక్టార్‌పై పరిమితులు, చైనా బ్యాంకులపై రిస్ట్రిక్షన్లు, 105 షాడో ఫ్లీట్ షిప్‌లపై చర్యలు ఉన్నాయి. కాగా, జీ7 దేశాలు 2022లో రష్యన్ ఆయిల్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల ప్రైస్ క్యాప్‌ను విధించాయి. కానీ రష్యా తన షాడో ఫ్లీట్ ద్వారా ఈ క్యాప్ కంటే ఎక్కువకు ఆయిల్‌ను అమ్మిందని అంచనా. ఇండియన్ రిఫైనరీలు రష్యన్ ఆయిల్‌ను డిస్కౌంట్‌లో కొని, డీజిల్, పెట్రోల్ వంటి పెట్రోలియం ప్రొడక్ట్‌లను ఈయూకి అమ్మి భారీగా సంపాదిస్తున్నాయి.