కేటాయించిన జాగాలను కూడా వదుల్తలేరు

కేటాయించిన జాగాలను కూడా వదుల్తలేరు
  • స్థలం తమదంటూ కబ్జా చేసేందుకు యత్నం
  • ఇటీవల నిర్మాణాలు చేపట్టగా అడ్డుకున్న గ్రామస్తులు 
  • ఇష్యూ కోర్టులో ఉండగా పనులెట్ల చేస్తారని నిలదీత

మరికల్, వెలుగు: అధికార పార్టీ నేతలు సర్కారు, శిఖం, ఫారెస్ట్ స్థలాలే కాదు.. ప్రభుత్వ పనులకు కేటాయించిన జాగాలను కూడా వదలడం లేదు. నారాయణపేట జిల్లా మరికల్​ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్​ ముందు ఉన్న కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ స్థలాన్ని రెండేండ్ల క్రితమే రైతుబజార్‌‌‌‌‌‌‌‌కు కేటాయించి మంత్రులు శంకుస్థాపనలు చేసినా పనులు చేపట్టలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉండడంతో గత ఆదివారం ఆ స్థలం తమదని  నిర్మాణాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. గ్రామస్తులు అడ్డుకొని కోర్టు వివాదంలో ఉన్న జాగాలో పనులెట్ల చేస్తారని నిలదీశారు.  అనంతరం రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. 

ఎకరా రూ.2 కోట్లు..

మరికల్ మండల కేంద్రంలోని ఆర్టీస్టీ  బస్టాండ్​ ఎదురుగా సర్వే నంబర్.1లో 4.34 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది.  ఇందులో పోలీస్ స్టేషన్‌‌‌‌,  గ్రామపంచాయతీ, బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ కార్యాలయాలు ఉండగా ఎకరానికి పైగా స్థలం ఖాళీగా ఉంది.  రెవెన్యూ ఆఫీసర్లు రెండేండ్ల క్రితం చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు.  ప్రస్తుతం ఇక్కడ కరా రూ. 2 కోట్లకు చేరడంతో కొందరు వ్యక్తులు పాత ఓనర్ల ద్వారా ఈ స్థలాన్ని కొన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ వివాదం కోర్టులో ఉండడంతో ఎవరూ ఎలాంటి నిర్మాణాలు చేయరాదని రెవెన్యూ ఆఫీసర్లు బోర్డును ఏర్పాటు చేశారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన లీడర్లు అక్కడ తమ స్థలం ఉందని నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని జీపీకి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇందుకోసం నియోజకవర్గానికి చెందిన లీడర్‌‌‌‌‌‌‌‌తో సంబంధిత ఆఫీసర్లపై ఒత్తిడి కూడా చేయించారు. కానీ, ఆఫీసర్లు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ సదరు లీడర్లు గత ఆదివారం నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించారు. 

రూ. 30 లక్షలతో రైతు బజార్

ఆర్టీసీ బస్టాండ్ ముందున్న ప్రభుత్వ స్థలంలో నారాయణపేట మార్కెటింగ్‌‌‌‌ శాఖ రూ.30 లక్షలతో రైతు బజార్‌‌‌‌‌‌‌‌ను మంజూరు చేసింది. ఈ మేరకు 30–08–2020న  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌‌‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి, కలెక్టర్ హరిచందన శంకుస్థాపన చేశారు. అయితే రెవెన్యూ ఆఫీసర్లు ఇప్పటివరకు స్థలం అప్పజెప్పకపోవడంతో మార్కెటింగ్ ఆఫీసర్లు పనులు చేపట్టలేదు. తాజాగా ఆ జాగా కబ్జాకు గురవుతుండడంతో త్వరగా పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

రైతు బజార్ కట్టాలి

బస్టాండ్ ముందున్న స్థలంలో రైతు బజార్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలి. రెండేండ్ల క్రితమే మంత్రులు శంకుస్థాపన చేసినా నేటికీ అతిగతి లేదు.  టీఆర్ఎస్ అభివృద్ధి శిలఫలకాలకే పరిమితమైందని దీన్ని చూస్తే అర్థమైతుంది. లేదంటే ఇతర ప్రభుత్వ కార్యాలయాలకైనా ఇవ్వాలి. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే  బీజేపీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తం.  

–వేణుగోపాల్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి, మరికల్