రూ. 5లక్షల కోట్లు అప్పు చేసినా జీతాలిచ్చే పరిస్థితి లేదు : బండి సంజయ్

రూ. 5లక్షల కోట్లు అప్పు చేసినా జీతాలిచ్చే పరిస్థితి లేదు : బండి సంజయ్
  • పేదోళ్ల బలి దానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పెద్దోడు రాజ్యమేలుతుండు

జగిత్యాల జిల్లా : పేదోళ్ల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పెద్దోడు రాజ్యమేలుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం ఎలాంటి త్యాగం చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేసింది పేదోళ్లు.. బలిదానమైంది పేదోళ్లేనని చెప్పారు. ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలోని రాఘవపేటకు వెళ్లిన బండి సంజయ్  గ్రామంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. నివాళులర్పించారు.

అనంతరం రాఘవపేట గ్రామ ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలకు నమ్మకద్రోహం చేశారంటూ మండిపడ్డారు. డిస్కమ్ లు రూ.60 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాల నుంచి డిస్కమ్ లకు రూ.18 వేల కోట్లు బకాయి ఉందని తెలిపారు. రూ.5 లక్షల కోట్ల అప్పు చేసినా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డుల జారీ ఎక్కడని ప్రశ్నించారు. 

100 రోజుల్లో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న కేసీఆర్.. ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరవాలా..? వద్దా? అని ప్రశ్నించారు. క్యాసినో, సారా దందాలు కేసీఆర్ బిడ్డ కవితవేనని ఆరోపించారు. దొంగ దందాలు చేయడానికి లక్ష కోట్లు పెడతారు గానీ రూ. 250 కోట్లు పెట్టి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేరా? అని ప్రశ్నించారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత తమదేనని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా తెరిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీని కలిసి, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత తమదేనన్నారు. 

దేవుడికే శఠగోపం పెట్టినోడు కేసీఆర్ అని ఆరోపించిన బండి సంజయ్ వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి రూ. 120 కోట్ల ఇస్తానని చెప్పి ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కొండగట్టుకు రూ.100 కోట్లు ఇస్తానని అంటున్న కేసీఆర్.. ఆయన కూతురు స్థలం కొన్నారు కాబట్టే 100 కోట్లని అంటున్నారని ఆరోపించారు. 

‘‘ధర్మపురి గోదావరి పుష్కరాలప్పుడు ఏమైనా వసతులు కల్పించారా..? రాఘవపేటలో 24 గంటల ఉచిత కరెంటు వస్తుందా..? లిక్కర్ దందా... దొంగ దందా చేసిన కేసీఆర్ బిడ్డను, పట్టకపోవాలా..? వద్దా?.. సారా దందా చేసిన కవితను అరెస్టు చేస్తే... రాఘవపేట ప్రజలు ధర్నా చేయాల్నా..? వద్దా..? అంటూ బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. 

రైతులకు 24 గంటల కరెంటు నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం

కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ సవాల్ విసిరారు. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని తాను నిరూపిస్తే..కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అని ప్రశ్నించారు. ప్రజల కోసమే తాను పోరాడి జైలుకు వెళ్లానని బండి సంజయ్ అన్నారు. 

కోర్టు అనుమతితో పాదయాత్ర

ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. కోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. ‘భాషలో నాకు కేసీఆరే గురువు. అందుకే గురుదక్షిణ తీర్చుకుంటున్నాను’ అని చెప్పారు. కేసీఆర్ కు రెస్ట్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని.. మరోసారి అవకాశం ఇవ్వొద్దని బండి సంజయ్ కోరారు. రాష్ట్ర ప్రజల బతుకులు బాగుపడాలంటే... భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలన్నారు. నిధులు, నియామకాలు, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే.. మోడీ లాంటి నాయకత్వం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క నెలలోనే  రోజ్ గార్ మేలా పేరుతో లక్షా 46 వేల ఉద్యోగాలను ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ఒక్కరికైనా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా..? పోడు భూముల సమస్యను పరిష్కరించారా..? అని ప్రశ్నించారు. రైతుబంధు, దళితులకు మూడెకరాలు, దళిత బంధు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నల వర్షం కురిపించారు.

తెలంగాణకు రామరాజ్యం కావాలి.. రజాకారుల రాజ్యం పోవాలి

తెలంగాణకు రామరాజ్యం కావాలని.. రజాకారుల రాజ్యం పోవాలని బండి సంజయ్ అన్నారు. ఖాసిం చంద్రశేఖర్ రజ్వీ పాలనకు చరమగీతం పాడాలని కోరారు. కేసీఆర్ కు మీటర్ పెట్టినం కాబట్టే, కేసీఆర్ బిడ్డ కవిత బండారం బయటపడిందన్నారు. మోడీ పేరు చెప్పి కేసీఆర్ మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ మోటార్లకు మీటర్లు పెడితే.. గుంజుకొచ్చుడు ఖాయం అన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టమని ఎవరూ చెప్పలేదన్నారు. తెలంగాణలో రైతు రాజ్యం... రామరాజ్యం రావాలని బండి సంజయ్ కోరారు.