కుటుంబంలో ఫోర్ వీలర్ బండి ఉన్నా, ఐదెకరాల పొలం ఉన్నా పింఛన్ రద్దు

కుటుంబంలో ఫోర్ వీలర్ బండి ఉన్నా, ఐదెకరాల పొలం ఉన్నా పింఛన్ రద్దు
  • ఒక్క నెల ఇచ్చి.. బంద్​ పెట్టిన సర్కార్​ 
  • త్వరలో పాత జాబితాలోనూ కోత
  • 360 సాఫ్ట్​వేర్​తో కొత్త లిస్ట్​ నుంచి పేర్ల తొలగింపు
  • టాటా ఏస్, ట్యాక్సీ కారు నడుపుకునే వాళ్ల కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి

హైదరాబాద్/యాదాద్రి, వెలుగు: మూడున్నరేండ్లు ఊరించి ఊరించి కొత్త పింఛన్లు ఇచ్చిన సర్కార్.. నెల రోజులకే ఉసూరుమనిపించింది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఫోర్ వీలర్ బండి, ఐదెకరాల పొలం ఉందని.. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నారనే సాకులతో కొత్త పింఛన్లలో కోత పెట్టింది. ఫీల్డ్ ఎంక్వయిరీ చేయకుండానే  కేవలం 360 అనే సాఫ్ట్ వేర్ సాయంతో ఒక్క క్లిక్ తో కొత్త జాబితాలో లక్ష మంది లబ్ధిదారుల పేర్లను తొలగించింది. పింఛన్ కార్డులు, డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి నెల రోజులకే పేర్లు తీసేయడంపై అర్హులైన లబ్ధిదారులు మండిపడుతున్నారు. నిరుడు అప్లికేషన్లు తీసుకున్నాక ఫీల్డ్ ఎంక్వయిరీ కోసం సర్కార్ కు ఏడాది టైం ఉన్నప్పటికీ పట్టించుకోలేదని, ఇప్పుడు కేవలం ఒక సాఫ్ట్ వేర్ సాయంతో ఇలా పేర్లు తొలగించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

సీఎం కేసీఆర్ 2018లో ఎన్నికల సమయంలో 57 ఏండ్లు నిండినోళ్లకు కూడా ఆసరా ఓల్డేజ్ పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మూండేండ్లు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పైగా 65 ఏండ్లు నిండినోళ్లకు, కొత్తగా దివ్యాంగులుగా, వితంతువులుగా మారినోళ్లకూ పింఛన్ మంజూరు చేయలేదు. నిరుడు ఆగస్టులో పింఛన్లకు దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం.. సరిగ్గా ఏడాది తర్వాత గత సెప్టెంబర్ చివరివారంలో 9.46 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఇటీవల 360 అనే సాఫ్ట్ వేర్​తో కొత్త జాబితాలో నుంచి లక్ష మందిని అనర్హులుగా ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఐదెకరాల పొలం లేదా ఏడున్నర ఎకరాల మెట్టభూమి కలిగినవాళ్లు, ఫోర్ వీలర్ బండి ఉన్నవాళ్ల పేర్లు, ఒకే ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఉన్నా.. ఆటోమేటిగ్గా సాఫ్ట్​వేర్​ సాయంతో పేర్లు డిలీట్​ అయ్యేలా చేశారు. ఉపాధి కోసం ట్యాక్సీ ప్లేట్​తో టాటా ఏస్, టాటా మ్యాజిక్, మినీ ట్రాన్స్ పోర్ట్, కార్లు నడిపే వారి తల్లిదండ్రుల పింఛన్లు కూడా కట్ అయ్యాయి. ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు కొడుకులకు కలిపి ఐదెకరాల పొలం లేదా ఏడున్నర ఎకరాల మెట్టభూమి ఉన్నా మొత్తాన్ని ఒకే యూనిట్ గా తీసుకుని వారి తల్లిదండ్రుల పింఛన్ కూడా రద్దయింది. సీఎం దత్తత తీసుకున్న వాసాలమర్రిలో కొడుకు కండక్టర్ అన్న కారణంగా ఒకరికి, కొడుకుకు బస్సు ఉందన్న కారణంగా మరొకరికి తొలగించారు. త్వరలో పాత పింఛన్ల జాబితాలోనూ కోతలు పెట్టనున్నారు. 

అన్నీ జిల్లాల్లోనూ కోత

రాష్ట్రంలోని జిల్లాల్లో సర్కార్ పింఛన్లకు కోత పెట్టింది. నల్గొండ జిల్లాలో 51,007 మందికి పింఛన్లు మం జూరు చేయగా.. వీటిలో 2,432 పింఛన్లు తొలగించింది. జోగులాంబ గద్వాలలో 14,339 పింఛన్లు మంజూరు కాగా.. 1,093 పెన్ష న్లు కట్ చేసింది. కామారెడ్డిలో  29,678 మందికి మంజూరు కాగా.. 1,098 మందికి రద్దుచేసింది. సిద్దిపేటలో 25,349 పింఛన్లలో 2,431(10 శాతం) పింఛన్లు తీసేసింది. భద్రాద్రి కొత్తగూడెంలో 28,427 మందికి మం జూరు చేయగా.. 879 మందిని, ఖమ్మంలో 41,000 మంజూరు చేయగా..2,012 పేర్లను, నాగర్ కర్నూల్ లో 23 వేల పింఛన్లు మంజూరు చేయగా.. 1300 మంది పింఛన్లను ప్రభుత్వం నిలిపివేసింది. రాజన్న సిరిసిల్లలో 1,086, జనగామలో 786, సూర్యాపేటలో 3,183 పింఛన్లు, పెద్దపల్లిలో 726, కరీంనగర్ జిల్లాలో 2,366 పింఛన్లు తీసేసింది. ఇలా ఒక్కో జిల్లాలో 2 వేల నుంచి 3 వేల పేర్లు తొలగించింది. 

భూమి, కారు ఉన్న వాళ్లను తొలగించారు

ఫ్యామిలీలో ఏ ఒక్కరికైనా కారు, భూమి ఉంటే పింఛన్ లబ్ధిదారులను పైస్థాయిలోనే తొలగించారు. ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. మరొకరికి పింఛన్ వస్తున్నా తీసేశారు. తొలగించిన వారిలో నిజమైన అర్హులు ఉన్నారా..? అని తెలుసుకోవడానికి పర్సన్ టు పర్సన్ ఎంక్వైరీ జరపాల్సి ఉంది. 

- ఉపేందర్​రెడ్డి, డీఆర్డీఓ, యాదాద్రి

నా కొడుకు కారు నడుపుతున్నడని పింఛన్ ఆపిన్రు

నా కొడుకు లోన్​లో కారు తీసుకుని కిరాయిలకు నడుపుతూ బతుకుతు న్నడు. నాకు మొన్ననే పింఛన్ శాంక్షన్ అయింది. ఫస్ట్ నెల పింఛన్ తీసుకున్న. మళ్లనెల  పింఛన్​ కోసం పోతే.. పేరు తీసేసిన్రని చెప్పిన్రు. ఎందుకని ఆఫీసర్లను అడిగితే నీ కొడుక్కు కారు ఉన్నదని ఆపేసినమని ఆఫీసర్లు చెప్పిన్రు.

- పంగ రాములమ్మ, మాసాన్ పల్లి, గుండాల మండలం, యాదాద్రి జిల్లా

వింతంతు పింఛన్ ఆపేసిన్రు

నా భర్త రెండేండ్ల కింద కరోనాతో చనిపోయిండు. నేను వింతతు పింఛన్ కింద దరఖాస్తు పెట్టుకున్న. ఒక్క నెల డబ్బులు వచ్చినయ్. తర్వాత నుంచి రావట్లే. ఆఫీసుల చుట్టూ తిరిగిన. కలెక్టర్​కు  కూడా ఫిర్యాదు చేసిన. చూస్తమని చెప్పిన్రు. కానీ ఏం పని అయితలేదు. నాకు ఒక్క కొడుకు ఉంటే చనిపోయిండు. ఒక్కదాన్నే ఉంటున్న.

- కర్నె కామేశ్వరమ్మ, వేపలమాధారం, మేళ్లచెరువు మండలం, సూర్యాపేట జిల్లా