వరద వస్తున్నా ఎత్తిపోస్తలే..ఎస్సారెస్పీ, మిడ్​మానేరుకు భారీగా ఇన్ ఫ్లో

వరద వస్తున్నా ఎత్తిపోస్తలే..ఎస్సారెస్పీ, మిడ్​మానేరుకు భారీగా ఇన్ ఫ్లో
  • అయినా మల్లన్నసాగర్​కు లిఫ్ట్​ చేస్తలే
  • ఇంకో 10 టీఎంసీలు నింపుతామని ప్రకటన
  • ఆ దిశగా ప్రయత్నాలేమీ చేయని సర్కార్
  • 50 టీఎంసీల కెపాసిటీకి 11 టీఎంసీలే నిల్వ


హైదరాబాద్, వెలుగు: శ్రీరాంసాగర్, మిడ్ మానేరు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఈ రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి లక్షలాది క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలేస్తున్నారు. ఇంతటి వరద వస్తున్నా ఆ నీటిని ఒడిసిపట్టి మల్లన్నసాగర్​కు ఎత్తిపోసే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. 50 టీఎంసీల కెపాసిటీ ఉన్న మల్లన్నసాగర్​లో 11 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఈ ఏడాది ఇంకో పది టీఎంసీలు జలాశయానికి ఎత్తిపోయాలని జూన్​19న సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన హైలెవల్​ మీటింగ్​లో నిర్ణయించారు. 

ఒకవేళ సమయానికి వర్షాలు కురవకుంటే కొండపోచమ్మ సాగర్​ నుంచి నిజాంసాగర్​కు ఐదు టీఎంసీలు తరలించాలని కేసీఆర్​ఆదేశించారు. ఈ లెక్కన మల్లన్నసాగర్​లోకి కనీసం 15 టీఎంసీలు ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఎత్తిపోతలతో అవసరం లేకుండానే నిజాంసాగర్​ నిండింది.. ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆఫ్​లైన్​ రిజర్వాయర్లుగా ఉన్న రంగనాయక సాగర్​లో 3 టీఎంసీలకు గాను 2.85 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇందులో 2 టీఎంసీలకు పైగా జూన్​లో ఎత్తిపోశారు. మల్లన్నసాగర్​లో 50 టీఎంసీలకు 11.03 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్​లో 15 టీఎంసీలకు 8.96 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

వరద వస్తున్నా ఎత్తిపోస్తలే!
డ్యామ్ ప్రొటోకాల్ ​ప్రకారం ఒక్కసారే రిజర్వాయర్​లను పూర్తిగా నింపొద్దని, అందుకే ఈ ఏడాది మల్లన్నసాగర్​లో ఇంకో పది టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాలని నిర్ణయించామని ఇరిగేషన్ వర్గాలు చెప్తున్నాయి. కొండపోచమ్మ సాగర్​లో ఇంకో మూడు టీఎంసీల వరకు నింపే అవకాశముంది.

కరెంటు బిల్లులు 60 శాతం తగ్గుతయ్
మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్​కు నీళ్లు తరలించా లంటే ఎనిమిది స్టేజీల్లో నీళ్లు ఎత్తిపోయాల్సి ఉం టుంది. అదే మిడ్​మానేరుకు వచ్చే వరదను 3స్టేజీల్లో ఎత్తిపోస్తే సరిపోతుంది. కరెంట్​ బిల్లుల భారం 60 శాతం తగ్గుతుంది. వరదను మళ్లించుకుంటే మిడ్​మానేరులో నిల్వపైనా పెద్దగా ప్రభావం ఉండదు. దీంతో మిడ్​మానేరు దిగువన ఉన్న ఎస్సా రెస్పీ ఆయకట్టుకు సాగునీటికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మిడ్​మానేరుకు వరద రాకున్నా ఎస్సారెస్పీ వరద కాలువ నుంచి రోజుకు 2 టీఎంసీలను గ్రావిటీ మిడ్​మానేరుకు తరలించి ఆ నీటిని లిఫ్ట్ చేయొచ్చు. 

పది రోజులు పంపులు రన్​ చేస్తే ఈ టార్గెట్​ను రీచ్​కావొచ్చు.. ఎస్సారెస్పీ నుంచి ఐదు రోజుల్లోనే మిడ్​మానేరుకు పది టీఎంసీలు తరలించే చాన్స్​ ఉంది. ఎస్సారెస్పీ గేట్లు గురువారం ఓపెన్​చేశారు. అంతకుముందు నుంచే ఆ ప్రాజెక్టులోకి లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తున్నది. మరికొన్ని రోజులు వరద వచ్చే చాన్స్​ ఉంది. ఇప్పుడు మిడ్​మానేరులో 19 టీఎంసీలు నిల్వ ఉండగా, 30 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉంది. గురువారం మిడ్​మానేరు గేట్లు ఎత్తిన ఇంజనీర్లు శుక్రవారం మూసేశారు. ఎగువ నుంచి వచ్చే వరదను గేట్ల నుంచి నదిలోకి వదిలేయకుండా అనంతగిరి, రంగనాయకసాగర్​మీదుగా మల్లన్నసాగర్​కు లిఫ్ట్​చేసే అవకాశమున్నా ఆ దిశగా కనీసం ప్రయత్నించడం లేదు.

ఆ హెచ్చరికే కారణమా?
మల్లన్నసాగర్ ​నిర్మించిన ప్రాంతంలోని భూ అంతర్భాగంలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద లీనమెంట్​ఉందని, ఇక్కడ రిజర్వాయర్​ నిర్మించే అంశాన్ని మరోసారి పరిశీలించాలని నేషనల్ ​జియో ఫిజికల్ ​రీసెర్చ్ ​ఇన్​స్టిట్యూట్​(ఎన్​జీఆర్ఐ) తన రిపోర్టులో పేర్కొన్నది. ఈ రిపోర్టును ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని ఇటీవల కాగ్ ​తన ప్రాథమిక నివేదికలోనూ పేర్కొంది. 

మల్లన్నసాగర్​ నిర్మించిన తర్వాత దాని రక్షణ చర్యలపై మరో రెండు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీలు ఏ రిపోర్టు ఇచ్చాయనే అంశాన్ని బయటపెట్టడం లేదు. భూకంప ప్రభావ ప్రాంతంలో మల్లన్నసాగర్​ను నిర్మించడంతో నీటిని నింపడం ద్వారా దాని కట్టపై పడే ప్రభావంతో పాటు భూ అంతర్భాగంలో తలెత్తే పరిణామాలను గుర్తించడానికి కట్టలోపల ప్రెజో మీటర్లు (నీటి నిల్వను తెలియజేస్తాయి), ఎర్త్​ప్రెషర్ సెల్స్ (ఫౌండేషన్​పై ఎంత ఒత్తిడి పడుతుందో గుర్తిస్తాయి)​, కట్ట కింద భాగంలో సెటిల్​మెంట్ ​ఫైండ్స్ (కట్టపై పడే ప్రభావాన్ని నిర్దారిస్తాయి) ఏర్పాటు చేశారు. 

ఈ మూడు పరికరాలు కలిపి మొత్తం 125 ఏర్పాటు చేయగా అందులో 80 శాతం పరికరాలు పనిచేయడం లేదు. ఈ మూడు ఎక్విప్​మెంట్లు ప్రతి అర గంటకోసారి తన ఫైండింగ్స్​ను కంట్రోల్​రూమ్​కు నివేదిస్తాయి. వాటి రిపోర్టుల ఆధారంగానే కట్ట, రిజర్వాయర్​ భద్రతను బేరీజు వేసుకుంటూ నీటిని నిల్వ చేస్తారు. ఎన్​జీఆర్ఐ హెచ్చరికలతో పాటు, రిజర్వాయర్​ భద్రత కోసం ఏర్పాటు చేసిన ఎక్విప్​మెంట్స్​కూడా పనిచేయకపోవడంతోనే మల్లన్నసాగర్​లో నీటి నిల్వకు వెనుకాడుతున్నట్టు తెలుస్తున్నది. అందుకే వరద వస్తున్నా ఆ నీటిని ఎత్తిపోయడం లేదని సమాచారం.