ఆదాయం తగ్గినా.. బడి ఫీజులు పెంచుతున్నరు

ఆదాయం తగ్గినా.. బడి ఫీజులు పెంచుతున్నరు

కరోనాతో 80 శాతానికి పైగా ప్రజల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆదాయం గణనీయంగా పడిపోయింది. దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. మూడు కోట్ల మంది మధ్యతరగతి నుంచి పేదరికంలోకి వెళ్లినట్లు అనేక సర్వేలు తేల్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో బడి పిల్లల స్కూలు ఫీజులు తగ్గక పోగా.. మరింత పెరిగాయి. ఫీజుల నియంత్రణకు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేశాయి. ట్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని  ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. ఇప్పటికైనా ఫీజుల నియంత్రణకు పాలకులు చర్యలు తీసుకోవాలి.

కార్పొరేట్, బడా ప్రైవేటు స్కూళ్ల మేనేజ్​మెంట్లు వాటి స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి మొదలుకొని రూ.3.5 లక్షల వరకు వార్షిక ఫీజును వసూలు చేస్తున్నాయి.  ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్, ఇతర ఫీజులన్నీ కలిపి ట్యూషన్‌ ఫీజు కిందే వేసి తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. పుస్తకాలు, షూస్‌, టై, బెల్టులను స్కూళ్ల పక్కనే ఏర్పాటు చేసిన దుకాణాల్లో విక్రయిస్తున్నారు. మార్చి15 నుంచే బడులు మూతపడ్డాయి. ప్రభుత్వం విద్యార్థులందరినీ అప్‌గ్రేడ్‌ చేస్తూ పైతరగతులకు ప్రమోట్​చేసింది. కొన్ని కార్పొరేట్‌, బడా విద్యాసంస్థల్లో మే నుంచి ఆగస్టు వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించారు. వాటికి ఇప్పుడు ఫీజులు వసూలు చేయాలని చూస్తున్నారు. రాయితీ అంటూ తల్లిదండ్రుల నుంచి ఫీజులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు.

విద్యా హక్కు చట్టం అమలేది?
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు బడుల్లో 25 శాతం  సీట్లు పేద పిల్లలకు ఇయ్యాలి. ఇందుకు నిర్ణీత రుసుములు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కాగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యా హక్కు చట్టం సరిగా అమలు కావడం లేదు. స్కూళ్ల ఫీజులు నియంత్రించాలనే డిమాండ్ రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫీజుల నియంత్రణపై ప్రొఫెసర్‌ తిరుపతిరావు నేతృత్వంలో 2017లో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 2018 ఫిబ్రవరిలో కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్​అందజేసింది. ఆ నివేదిక ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. 2016–17 ఏడాదిలో ఉన్న ఫీజులపై ఏటా10 శాతం లోపు పెంచుకోవచ్చని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని తిరుపతిరావు కమిటీ సిఫారసు చేసింది. సదుపాయాలపై శాస్త్రీయ అంచనా లేకుండా ఏటా10 శాతం ఫీజులను పెంచుకునేలా ఎలా సిఫారసు చేశారంటూ కమిటీని ప్రభుత్వం ప్రశ్నించింది. ఆ తర్వాత ఫీజుల నియంత్రణ కోసం హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో డీఈఓలతోనూ ఓ కమిటీ వేసింది. ఫీజుల నియంత్రణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకునేలా పక్కా ప్రణాళిక రూపొందించాలని సూచించింది. ఏపీలో హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆర్.కాంతారావు చైర్మన్‌గా పలువురు విద్యారంగ నిపుణులతో ప్రభుత్వం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు ఎంత వసూలు చేయాలో నిర్ణయిస్తూ జీఓలు(53, 54) తీసుకొచ్చింది. పంచాయతీల్లో అయితే నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు రూ.10 వేలు.. పట్టణాల్లో 11 వేలు.. నగరాల్లో రూ.12 వేలు, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు గ్రామాల్లో రూ.12 వేలు, పట్టణాల్లో రూ.15 వేలు, నగరాల్లో రూ.18 వేలుగా ఫీజులు నిర్ణయించారు. విద్యార్థులకు రవాణా సౌకర్యం అందిస్తే కిలోమీటరుకు రూ.1.20 వసూలు చేసుకోవచ్చని సూచించింది. ఇతర శిక్షణల పేరిట కూడా ఏ రుసుమూ వసూలు చేయకూడదని ఆదేశించింది.

దేశంలో..
దేశంలోని సుమారు 14 రాష్ట్రాలు ఫీజులు పెంచవద్దంటూ ప్రైవేటు పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశాయి. ఉత్తరప్రదేశ్ లో అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలన్నింటినీ ఆర్టీఐ పరిధిలోకి తీసుకువచ్చారు. దీని ద్వారా పాఠశాలలు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాయి, ఆదాయ, వ్యయ వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునే అవకాశం లభించింది. ఆదాయ, వ్యయాలను ప్రతి పాఠశాల తమ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని పంజాబ్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జూన్ లో ఫీజుల నియంత్రణకు డ్రాఫ్ట్ బిల్ పాస్ చేసింది. తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాతే ఫీజులను పెంచేలా ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకువచ్చింది. కర్నాటకలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మహారాష్ట్రలో నిపుణులతో కూడిన ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా  సుమారు 40 శాతం పాఠశాలలు తమ ఫీజులు పెంచేశాయంటూ పలు రిపోర్టులు వెల్లడించాయి. కరోనా మహమ్మారికి ముందే 2019లో నిర్వహించిన ఓ సర్వేలో ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణలో విఫలమయ్యాయంటూ 83 శాతం మంది తల్లిదండ్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

డ్రాపౌట్లు పెరిగే ప్రమాదం..
దేశవ్యాప్తంగా విద్యార్థులు 8వ తరగతి వరకు బాగానే చదువుతున్నారు. కానీ పేదరికం, ఇతరత్రా కారణాల వల్ల 9, 10 తరగతులు వచ్చే సరికి బడులు మానేస్తున్నారు. తెలంగాణలో బడి మానేస్తున్నవారి రేటు 12.3 శాతంగా ఉంది. కరోనా తర్వాత ఇది మరింత ఎక్కువైంది. కరోనా, లాక్‌డౌన్ కారణంగా బాల కార్మికుల సంఖ్య పెరిగిపోతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌వో), ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. కరోనా రాకముందు భారతదేశంలో 5.6 కోట్ల మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారు. వారిలో 1.1 కోట్ల మంది వరకు వ్యవసాయ క్షేత్రంలో, ఫ్యాక్టరీల్లోనూ పనిచేస్తున్నారు. కరోనా తర్వాత ఈ సమస్య మరింత పెరిగినట్టు గుర్తించారు. ఏడాదిన్నర కాలం పాటు బడులు మూసివేసి ఉండటంతో పిల్లల అభ్యాస స్థాయిలపై ప్రతికూల ప్రభావం పడింది. గతంలో నేర్చుకున్న విద్యార్థులు కనీస సామర్థ్యాలు మరచిపోయారు. ఇదే విషయంపై 2021లో అజీమ్ ప్రేమ్​జీ ఫౌండేషన్​విస్తృతమైన క్షేత్ర స్థాయి అధ్యయనం చేసింది. 82 శాతం మంది గణితంలో ప్రాథమికమైన అంశాలు  కూడా మరిచిపోయినట్టు తేలింది. 92 శాతం మంది భాషలో కనీస అంశాలు మరిచిపోయినట్టు గుర్తించారు. చాలా మంది విద్యార్థులు కూడికలు, తీసివేతలు కూడా మర్చిపోయారని, ఒక పేరాగ్రాఫ్ చదవడం చాలా మందికి వీలుకావడం లేదని ఈ అధ్యయనంలో తేలింది. 

పరిష్కారం ఇలా..
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం పక్కాగా నిబంధనలు రూపొందించి పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంటుంది. విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రుల మధ్య మంచి రిలేషన్​డెవలప్​చేసి, పారదర్శకత, జవాబుదారినతనం పెంచాల్సి ఉంటుంది. తల్లిదండ్రులకు అన్ని వివరాలు తెలిసేలా ప్రతి పాఠశాల తమ ఆదాయ, వ్యయ వివరాలను పాఠశాల వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం కింద పేరెంట్, టీచర్స్ అసోసియేషన్లు ఏర్పాటు చేస్తే ఫీజులు ఎంత ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించుకునే అవకాశముంటుంది. ఈ అసోసియేషన్లకు పాఠశాల ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేసే అధికారం ఇస్తే ఇంకా పారదర్శకత పెరుగుతుంది.

టీచర్ల పరిస్థితి దుర్భరం
తెలంగాణలో 10,700 పైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వీటిల్లో సుమారు సుమారు 1.28 లక్షల మంది టీచర్లు పని చేస్తున్నారు. సుమారు 17 వేల మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఓ వైపు తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులను వసూలు చేస్తున్నా.. అంతే మొత్తంలో టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు. కొన్ని చోట్ల మూడు నుంచి ఆరు నెలలుగా వేతనాలు అందని పరిస్థితి. కరోనా ఎఫెక్ట్​తో పలువురు ప్రైవేటు టీచర్లు కూరగాయల దుకాణాలు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు పెట్టుకున్నారు. మరికొందరు ఉపాధి కూలీ పనులకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్