సర్కారు నిషేధించినా పట్టించుకోని ఆఫీసర్లు

సర్కారు నిషేధించినా పట్టించుకోని ఆఫీసర్లు
  • హరిత హారంలో అవే మొక్కలు నాటిన్రు

  • పలు జిల్లాల్లో ఏపుగా పెరిగిన చెట్లు

  • శ్వాసకోస సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వద్దని చెప్పినా హరితహారం కింద చాలా జిల్లాల్లో, ముఖ్యంగా జిల్లాకేంద్రాలు, పట్టణాల్లో ఆఫీసర్లు నాటుతున్న కోనోకార్పస్​ మొక్కలతో ఆరోగ్యసమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మార్కెట్​లో తక్కువ ధరకు దొరకడం, నర్సరీల్లో తొందరగా పెరిగే అవకాశం ఉండడంతో నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు ఆఫీసర్లు ఈ మొక్కలు నాటారనే  విమర్శలు వస్తున్నాయి. తీరా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చాలా పట్టణాలు, గ్రామాల్లో ఈ మొక్కలు ఏపుగా పెరిగి పూలు పూస్తున్నాయి. దీంతో వాటి పుప్పొడి కారణంగా ఆస్తమా, అలర్జీ లాంటి శ్వాసకోస వ్యాధులు వస్తున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో ఇప్పుడు ఏం చేయాలోనని ఆఫీసర్లు దిక్కులు చూస్తున్నారు. 

టార్గెట్​కోసం నాటిన్రు 

రాష్ట్రవ్యాప్తంగా ఆఫీసర్లు, ముఖ్యంగా పాలకవర్గాలు హరితహారం టార్గెట్​చేరుకునేందుకు మున్సిపాలిటీల్లో, గ్రామపంచాయతీల్లో వేలకొద్దీ కోనోకార్పస్​ మొక్కలు నాటారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ సుందరీకరణ పేరుతో సిరిసిల్ల టౌన్​తో పాటు అన్ని మండల కేంద్రాల్లో ఈ మొక్కలను నాటారు. ఆఖరికి ప్రకృతి వనాలు, సిరిసిల్ల అర్బన్ పార్క్ నూ ఈ మొక్కలతో నింపేశారు.  స్మార్ట్ సిటీలో భాగంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో  2020-–21 హరిత హారంలో ఈ మొక్కలు నాటి సంరక్షించారు. ప్రస్తుతం సిరిసిల్ల పట్ణణంలో కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు, అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా వరకు కోనోకార్పస్ చెట్లు ఏపుగా పెరిగి పూలు పూస్తున్నాయి.  ఈ చెట్ల ఆకులను పశువులు కూడా తినడం లేదు. పలు దేశాలు చాలా ఏళ్ల క్రితమే కోనోకార్పస్ మొక్కలను బ్యాన్ చేశాయి. కోనోకార్పస్ మొక్క పుష్పాల నుంచి వెలువడే పుప్పొడితో అలర్జీ,శ్వాసకోశ, ఆస్తమా సమస్యలు వస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. వీటి వేర్లు భూమి లోతుల్లో పాతుకుపోవడం వల్ల కమ్యూనికేషన్ కేబుళ్లు, డ్రైనేజీలు, మంచినీటి లైన్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని గ్రహించి సర్కారు కోనోకార్పస్​ మొక్కలను నాటవద్దని పేర్కొంది. అయితే నాటిన మొక్కలను తొలగించేందుకు పాలకవర్గాలు చర్యలు చేపట్టడం లేదు. 

శ్వాస వ్యాధులొస్తున్నయ్​

కోనోకార్పస్ మొక్కలోని పుప్పొడితో అలర్జీ, ఆస్తమా, శ్వాసకోస సంబంధ వ్యాధులు వస్తున్నాయి. ఆస్తమా పేషెంట్లకు ఈ మొక్కలతో చాలా ప్రమాదం. ఈ మొక్కలను తాకినా  స్కిన్ అలర్జీ వస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. పోస్ట్ కరోనా తర్వాత చాలా మందికి లంగ్స్ సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి  మొక్కల  వల్ల సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. –డా. సురేంద్రబాబు, పీడియాట్రిషియన్, సిరిసిల్ల

ప్రస్తుతం నాటడం లేదు

గతంలో ఈ మొక్కలను నాటాం. మూడేండ్లగా హరితహారంలో కోనోకార్పస్ మొక్కలను నిషేధించాం. కానీ కోనోకార్పస్ మొక్కల స్థానంలో వేరేవి నాటాలనే ఆదేశాలు లేనందున చర్యలు తీసుకోలేదు. పట్టణంలోని ఏడు నర్సరీలలో పూలు, పండ్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వీలున్న ప్రాంతాల్లో ప్రస్తుతం పూలు, పండ్ల మొక్కలనే నాటుతున్నాం.  – సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల