అభివృద్ధికి పాటుపడని రాజకీయ స్వామ్యం

అభివృద్ధికి పాటుపడని రాజకీయ స్వామ్యం

పాలక వర్గాలు బీసీ నాయకులకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా వారిని చైతన్యం కాకుండా భాగస్వామ్యం అనే మాయలో బంధించాయి.  దీనివల్ల ఉద్యమం స్వతంత్ర ఆలోచనా దిశ కోల్పోయింది. పాలకులు బీసీలకు పదవులు ఇచ్చారు.  కానీ  అధికారం, - చైతన్యాన్ని గుంజుకున్నారు అనేది స్పష్టం. ఈ ధోరణి వల్ల బీసీ ఉద్యమం తాత్కాలిక లాభాలకు మాత్రమే పరిమితమైంది. మొత్తం బీసీ సమాజ మార్పు దిశలో స్థిరమైన కార్యక్రమం లేని స్థితికి చేరింది.  బీసీల నుంచి వచ్చిన చాలామంది నాయకులు నేడు అధికార స్థానాల్లో ఉన్నా, ప్రజల సమస్యలపై మౌనం పాటిస్తున్నారు.  దీనికి కారణం వ్యక్తిగత బలహీనతే కాదు,  వ్యవస్థాత్మక రాజకీయ నిర్మాణం,  బీసీ నాయకులు ఎదగడానికి ఉపయోగించే రాజకీయ పార్టీలే వారిని బంధించే శక్తులుగా మారుతున్నాయి. 

 అధికారం పొందాలంటే పార్టీకి విధేయత చూపాలి.  ప్రజా పక్షంలో మాట్లాడితే పదవి పోతుంది. ఆ పదవే వారిని మౌనంగా ఉంచుతోంది.   ఫలితంగా ప్రజా ఉద్యమాల బలం రాజకీయ లాబీల బందీగా మారింది.  నిజమైన ప్రజా నాయకత్వం అంటే పార్టీ విధేయత కాదు.  ప్రజా బాధ్యత.  బీసీ నాయకులు ప్రజా ప్రత్యామ్నాయ దిశలో ఆలోచించి, సామాజిక చైతన్యాన్ని  రాజకీయ లక్ష్యంగా  మార్చినప్పుడే నిజమైన మార్పు సాధ్యం.  ఈ దిశగా భవిష్యత్తులో బీసీ ఉద్యమం కొత్త నాయకత్వాన్ని సృష్టించుకోవాల్సి ఉంటుంది.  పార్టీ, వ్యక్తిగత పరిమితులు దాటి ప్రజా సమూహాలతో అనుసంధానం చేసుకోగల వారిని గుర్తించి వారి వెంట నడవాల్సి ఉంటుంది.  బీసీ నాయకులు ప్రజాపక్షంలో లేరని విమర్శించడం సరిపోదు. ఆ పరిస్థితిని సృష్టించిన వ్యవస్థను విశ్లేషించుకొని సరిచేసుకుంటూ పోవాలి. అనగా,  విద్యావ్యవస్థలో చైతన్యం, ఉద్యమ ఆలోచనా పునాదులలో  బలహీనత ఉంది.   ఎవరివాటా ఎంతో  వారికంత కావాలన్న దానిపై నిర్లక్ష్యం చూపుతున్నారు.  పీడిత కులాల మధ్యలో సోదరభావం పెంపొందించే చర్యలకు కృషిచేయడం లేదు. దీని ఫలితంగా ప్రజా రాజకీయాలు వ్యక్తి రాజకీయాలుగా మారిపోయాయి. అయితే, చరిత్రలో కొంత మంది బీసీ నాయకులు స్వతంత్ర ప్రజాపక్షం కోసం పని చేస్తూ ఎదిగారు, కానీ వారిని స్వీకరించకపోవడం శోచనీయం.


-  పాపని నాగరాజు