ఖమ్మం జిల్లాలో వనరులు ఉన్నా.. పరిశ్రమలు వస్తలే

ఖమ్మం జిల్లాలో వనరులు ఉన్నా.. పరిశ్రమలు వస్తలే

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వనరులున్నా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు  దిశగా అడుగు ముందుకు పడడం లేదు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటులో ఐటీడీఏ నుంచి సరైన ప్రోత్సాహం అందడం లేదనే విమర్శలున్నాయి. కోల్డ్​ స్టోరేజ్, వేరుశనగ, కంది, మొక్కజొన్న, మామిడి, ఆయిల్​పామ్, రైస్​ మిల్స్, జిన్నింగ్​ మిల్లుల ఏర్పాటుకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నట్లుగా పరిశ్రమల శాఖ అధికారులు గుర్తించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీలతో కూడిన స్కీమ్స్​ ఉన్నా భూ సమస్యతో పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదని అంటున్నారు. 

ప్రతిపాదనలు, చర్చలకే పరిమితం..

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై కలెక్టర్​తో పాటు పరిశ్రమల శాఖ అధికారులు  పలుమార్లు చర్చించారు. జిల్లాలో మిర్చి, మామిడి, చింతపండుతో పాటు ఇతర పండ్ల తోటలు ఎక్కువగా సాగవుతున్నాయి. 4 వేల టన్నుల నుంచి 6 వేల టన్నుల కెపాసిటీ కలిగిన 10 కోల్డ్​ స్టోరేజీలను దమ్మపేట, అశ్వారావుపేట, బూర్గంపహాడ్, జూలూరుపాడు, సుజాతనగర్, కొత్తగూడెం ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు జిల్లాలో అవసరమైన వనరులు ఉన్నాయని పరిశ్రమల శాఖ గుర్తించింది. జిల్లాలో 20 నుంచి 25 వరకు రైస్​ మిల్లులు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి.  ప్రతి ఏటా15 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుండగా, జిల్లాలో 3 జిన్నింగ్​ మిల్లులు మాత్రమే ఉన్నాయి. సుజాతనగర్, ఇల్లందు, జూలూరుపాడు, టేకులపల్లి ప్రాంతాల్లో మరో 3 జిన్నింగ్​ మిల్లులు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ ప్రాంతాల్లో ఇంజనీరింగ్​ వర్క్స్, రిపేరింగ్, సర్వీస్, స్పేర్స్​ తయారీ పరిశ్రమలకు అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఫ్లయాష్​ ఎక్కువగా అందుబాటులో ఉండడంతో కొత్తగూడెం, చుంచుపల్లి, మణుగూరు, ఇల్లందు, పాల్వంచ ప్రాంతాల్లో రోజుకు 2 వేల సిమెంట్​ ఇటుకల తయారు చేసే కెపాసిటీ ఉన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఇల్లందు, టేకుపల్లి, గుండాల, ఆళ్లపల్లి ప్రాంతాల్లో 4 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి అవుతోంది. జిల్లాలో 20 వేల ఎకరాల్లో మామిడి, జీడి మామిడి సాగవుతుండగా, ప్రాసెసింగ్​ యూనిట్లను రూ. 50 లక్షలతో 10 ప్రాసెసింగ్​ యూనిట్లు ఏర్పాటు చేసుకునే ఛాన్స్‌ ఉంది. పినపాక, కరకగూడెం, చర్ల, అశ్వాపురం, దమ్మపేట, బూర్గంపహాడ్, ఇల్లందు, ముల్కలపల్లి, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్లు స్థాపించేందుకు మంచి అవకాశాలున్నట్లు పరిశ్రమల శాఖ గుర్తించింది. ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో పరిశ్రమల స్థాపనకు కొంత ఇబ్బంది కలుగుతోందని అధికారులు అంటున్నారు. ఐటీడీఏ ఆసక్తి ఉన్న గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇదిలాఉంటే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం
 చేస్తున్నారు.  

ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలున్నా అధికార పార్టీ నేతలు పట్టించుకుంటలేరు. పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ల్యాండ్​ ఇప్పించేలా చొరవ చూపాలి. 
- కోనేరు సత్యనారాయణ, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్

మాటలకే పరిమితమవుతున్రు

పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్​ చెబుతున్నా అమలు కావడం లేదు. పరిశ్రమల ఏర్పాటుకు ఎస్టీలకు సబ్సిడీతో కూడిన స్కీమ్​లను ప్రభుత్వం అమలు చేయాలి. 
- యెర్రా కామేశ్, బీఎస్పీ జిల్లా ప్రెసిడెంట్​