ఓరుగల్లులో భూదందాలకు పోలీసుల దన్ను 

ఓరుగల్లులో భూదందాలకు పోలీసుల దన్ను 

ఓరుగల్లులో భూదందాలకు పోలీసుల దన్ను 
సీపీ వార్నింగ్ ఇచ్చినా పలువురు​​ డోంట్​కేర్​..
రియల్టర్లతో సెటిల్​మెంట్లు
సివిల్ వివాదాల్లో తలదూర్చి  అందినకాడికి దోపిడీ 
నిందితులతో కలిసి బాధితులకు బెదిరింపులు
ఇటీవల ఇద్దరు ఆఫీసర్లపై వేటు
పోలీస్​ గ్రీవెన్స్ కు ​ క్యూ కడుతున్న  బాధితులు

హనుమకొండ, వెలుగు : భూదందాలపై వరంగల్ సీపీ ఏవీ  రంగనాథ్​ కొరడా ఝలిపిస్తున్నా ఫీల్డ్​ లెవల్ లో వాటికి ​ చెక్​ పడడం లేదు.  పోలీసులు సివిల్​ తగాదాల్లోకి ఎంటర్​ కావొద్దని ఆయన ఆర్డర్​ వేసినా..  కొంతమంది ఆఫీసర్లు రియల్టర్లు, ల్యాండ్​ గ్రాబర్స్​తో  జతకడుతూ దందాలు చేస్తున్నారు.  అమాయకులను బెదిరించడంతో పాటు అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారు.  ఇందుకు కొంతమంది పోలీస్​ స్టేషన్లనే  సెటిల్​మెంట్​ అడ్డాగా చేసుకుంటున్నారు.  కొందరు పోలీస్​ ఆఫీసర్లు తమ తీరు మార్చుకోకపోవడంతో..  ఇటీవల ఇద్దరిపై వేటు పడింది.  

రియల్టర్లతోనే దోస్తీ..

కమిషనరేట్ పరిధిలో భూములకు విపరీతమైన డిమాండ్​ పెరగడంతో రియల్​ ఎస్టేట్​, కన్​స్ట్రక్షన్​ బిజినెస్​, భూపంచాయితీలతో  రూ.కోట్ల దందా నడుస్తోంది. దీంతో రియల్టర్ల అవతారమెత్తిన కొందరు అక్రమ సంపాదనపై  పడ్డారు. ‘ధరణి’లో  లోపాలు, పాసుబుక్కుల్లోకి  ఎక్కని భూములను టార్గెట్​ చేసుకుని దందా చేస్తున్నారు. అవతలి వ్యక్తులు అమాయకులైతే వారి భూములపై పడి అందినకాడికి దండుకోవడమే కాకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో బాధితులెవరైనా పోలీస్​ స్టేషన్ గడప తొక్కితే మేనేజ్​ చేసుకోవడానికి అక్రమార్కులు పోలీసులను  మచ్చిక చేసుకుంటున్నారు.  కాసులకు కక్కుర్తి పడి వారంతా భూఅక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు. రియల్టర్లతో దోస్తీ కలపడమే కాకుండా వారి ఆఫీసుల్లోనే దర్జాగా దందాలు చేస్తున్నారు. దీంతో భూ దందాలు పెరిగిపోతూ కమిషనరేట్​ ఆఫీస్​లో సీపీ నిర్వహించే  గ్రీవెన్స్​కు వందల మంది బాధితులు క్యూ కడుతున్నారు.  దాదాపు 3 వేలకు పైగా అప్లికేషన్లు పెండింగ్​ లో ఉన్నట్లు తెలిసింది. అందులో అత్యధిక శాతం ల్యాండ్​ ఇష్యూస్ కు సంబంధించనవే.  

సీపీ మాటనూ లెక్కచేస్తలేరు

సీపీ ఏవీ రంగనాథ్ గత డిసెంబర్​ 3న చార్జ్​ తీసుకున్న రోజే  భూదందాలు చేస్తే యాక్షన్​ తప్పదని ఇక్కడి ఆఫీసర్లను హెచ్చరించారు.  దీంతో   కొద్దిరోజులు సైలెంట్​ అయిన  కొందరు  ఆఫీసర్లు మళ్లీ దందా మొదలు పెట్టారు. రియల్టర్లు, కబ్జాకోరులకు సపోర్ట్ చేస్తూ భూముల మీదకు వెళ్లి అమాయకులను బెదిరిస్తున్నారు. రెండ్రోజుల కిందట సస్పెండ్​ అయిన రఘునాథపల్లి ఎస్సై వీరేందర్​ విషయంలో ఇదే జరిగింది.  చుట్టుపక్కల గ్రామాల్లోని భూవివాదాల్లోకి ఎంటరవడం, ఆ తర్వాత రాజకీయ పలుకుబడి ఉన్న నేతలకు సపోర్ట్ చేస్తుండడంతో సీపీ సస్పెండ్​ చేశారు. అంతకుముందు హసన్ పర్తి మండలం సీతంపేట శివారులోని ఓ ఐదెకరాల కబ్జా విషయంలో అక్కడి సీఐ నరేందర్​ అక్రమార్కులకే సపోర్ట్ చేశారు. ఆ తర్వాత సెటిల్​ మెంట్​ పేరుతో బాధితుల నుంచి రూ.50 వేలు కూడా తీసుకున్నారు. విషయం ఉన్నతాధికారులకు తెలిసి ఆధారాలు సేకరించడంతో తప్పుడు సాక్ష్యం చెప్పాలని బాధితుడిని తుపాకీతో ఎన్​ కౌంటర్​ చేస్తానంటూ బెదిరించారు. చివరకు బాధితుడి ఫిర్యాదు మేరకు సస్పెండ్​ అయ్యాడు.  మట్వాడా సీఐ రమేశ్​పై  కూడా ఇలాగే సస్పెన్షన్​ వేటు పడింది. 

అదే దారిలో మరికొందరు..

వరంగల్  మహా నగరంలో ఓ మహిళా పోలీస్ అధికారి తండ్రి పేరుతో ఉన్న ల్యాండ్​ ను అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేశాడు.  రూ.కోట్ల విలువైన ల్యాండ్​పై  కన్నేసి ఫేక్​ డాక్యుమెంట్స్​ కూడా సృష్టించి ఆక్రమించాడు. దీంతో బాధితులు సీపీకి ఫిర్యాదు చేయగా.. కబ్జా జరిగింది నిజమేనని గుర్తించి, ఆ స్థలాన్ని ఖాళీ చేయించి బాధితులకు అప్పగించాలని సంబంధిత  సీఐని ఆర్డర్​ వేశారు.  సీపీ ఆదేశాలను లెక్కచేయకుండా సంబంధిత సీఐ అక్రమార్కులకే సపోర్ట్​ చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి.  హసన్ పర్తి మండలంలోని జయగిరి గ్రామ శివారులోని ఓ భూమి విషయంలో  కొంతకాలంగా గొడవ జరుగుతోంది.  ఆ పక్క గ్రామ శివారుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపుతూ కొంతమంది ల్యాండ్​ మీదికి రాగా.. కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. అదే ల్యాండ్​పై  ఇదివరకు కొంతమంది రౌడీ షీటర్లు కూడా రావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే  కొద్దిరోజుల కింద పక్క మండలానికి చెందిన ఓ పోలీస్​ ఆఫీసర్​ ఈ భూమి విషయంలో ఎంటరయ్యాడు. అక్రమార్కులకు సపోర్ట్​ చేస్తూ అసలు ఓనర్లను బెదిరిస్తుండడంతో  వారు కలెక్టరేట్​లో ఫిర్యాదు చేశారు.  ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఎస్సారెస్పీ భూములపై నగరంలో పని చేసే ఓ ఎస్సై కన్నేసి  ఆ పక్కనే కొంతభూమి కొన్నాడు.  దాని పక్కన ఎస్సారెస్పీ భూముల్లో గుడిసె వేసుకుని ఉంటున్న కుటుంబాన్ని ఖాళీ చేయించి, దాన్ని ఆక్రమించాడు. ఆ స్థలంలోనే ఇల్లు కట్టి జీడబ్ల్యూఎంసీ నుంచి ఇంటి నెంబర్​ కూడా తీసుకున్నాడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు ఫిర్యాదు అందడంతో గ్రేటర్​ ఆఫీసర్లు ఇంటి నెంబర్​ క్యాన్సిల్ చేశారు.  కాగా గుడిసె ఖాళీ చేయించి పంపేయడంతో కుటుంబ పెద్ద మనస్తాపంతో చనిపోయాడు. భూదందాలపై సీపీ సీరియస్​గా ఉన్నా  ఇంకా తీరు మార్చుకోని పోలీస్​ ఆఫీసర్లపై  విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనరేట్​ పరిధి జనాలు డిమాండ్​ చేస్తున్నారు.

ఏసీపీ ఆఫీస్ పక్కనే​ ప్రభుత్వ భూమి కబ్జా

నర్సంపేట, వెలుగు :   వరంగల్​ జిల్లా నర్సంపేట ఏసీపీ ఆఫీసు పక్కన 204, 318 సర్వే నంబర్లలోని 20 గుంటల ప్రభుత్వ జాగను అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు స్వాహా చేశారు.  దాదాపు రూ.3 కోట్ల ల్యాండ్​పై కన్నేసిన కబ్జాదారులు దొడ్డిదారిన డాక్యుమెంట్స్​​సృష్టించుకుని భూమిపైకి రాగా అక్కడ నివసిస్తున్న గుడిసె వాసులు ఎదురు తిరగడంతో  కబ్జా బాగోతం బయటకు వచ్చింది.  నర్సంపేట టౌన్​లోని ద్వారకపేట రోడ్​లో ఏసీపీ ఆఫీసు ఉంది.  దానికి పక్కనే  ఓ భూస్వామి  బిట్స్​ స్కూల్​ కోసం దాదాపు 11 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారు.  కొన్నేళ్ల కింద రోడ్డుకు ముందు వైపు ఉన్న  భూమిని కాజేసేందుకు కొంత మంది రియల్టర్లు  ప్రయత్నించారు. ఇదే టైమ్​లో  సీపీఎం ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేశారు. కొంత మందిపై కేసులు ఫైల్​ కాగా అప్పట్లో జైలుకు వెళ్లారు. కాగా ఏసీపీ ఆఫీసు కాంపౌండ్​ గోడను ఆనుకుని ఉన్న 20 గుంటల గవర్నమెంట్ ల్యాండ్​లో దాదాపు 20 కుటుంబాలు (కుంచె ఎరుకల) 50 ఏండ్ల నుంచి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈస్థలంపై కన్నేసిన అధికార పార్టీకి చెందిన రియల్టర్లు కొన్నేళ్ల నుంచి ఇల్లీగల్​గా రిజిస్ర్టేషన్లు చేయించుకున్నారు. 

పట్టపగలే.. దర్జాగా.. 

పట్టపగలే అందరూ చూస్తుండగా అధికార పార్టీకి చెందిన రియల్టర్లు  204, 318 సర్వే నంబర్లలోని 20 గుంటల ల్యాండ్​ను చదును చేసేందుకు మంగళవారం సాయంత్రం జేసీబీ తెప్పించారు. చెట్లు, గుడిసెలను తొలగిస్తుండగా గుడిసె వాసులు అడ్డుకున్నారు. తాము కొనుక్కున్నామని గుడిసె వాసులను రియల్టర్లు దబాయించారు. గుడిసెవాసులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి పనులు ఆపించి వెళ్లిపోయారు.  వారు వెళ్లిపోయిన కొద్ది సేపటికే చెట్ల తొలగింపు పనులను మళ్లీ స్టార్ట్​ చేశారు. జేసీబీని సీజ్​ చేయకపోవడంతో పోలీసుల తీరుపై  గుడిసె వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.