ఒక్కో చారిత్రక కట్టడాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి

ఒక్కో చారిత్రక కట్టడాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి

హోటళ్లు, ఆతిథ్య రంగ ప్రముఖులకు కిషన్ రెడ్డి పిలుపు 

న్యూఢిల్లీ, వెలుగు: ప్రఖ్యాత హోటళ్లు, ఆతిథ్య రంగంలోని ప్రముఖులు ముందుకొచ్చి ఒక్కో చారిత్రక కట్టడాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏఎస్ఐ (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) పరిధిలోని 3,600కు పైగా ప్రాచీన వారసత్వ కట్టడాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించాలని కోరారు. టూరిస్ట్ సెంటర్లను దత్తత తీసుకోవడం ద్వారా ఆయా హోటళ్లకు ప్రచారం కూడా లభిస్తుందన్నారు. గురువారం ఢిల్లీలోని లలిత్ హోటల్లో జరిగిన 5వ ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ హోటలియర్స్ కాంక్లేవ్’లో కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశంలో సమగ్ర పర్యాటకాభివృద్ధి కోసం నేషనల్ టూరిజం పాలసీని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

అందరమూ కలిసి ప్రపంచంలోనే టూరిజంలో బెస్ట్ విధానాన్ని తెద్దామని పిలుపునిచ్చారు. పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యాటక రంగానికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రైవేటు సంస్థలు కలిసి వచ్చినపుడే మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. హోటళ్లు, ఇతర భాగస్వామ్య పక్షాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, జాతీయ పర్యాటకం విషయంలో మాత్రం అందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. టూరిజంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు త్వరలోనే ‘ఇండియన్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్’ నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.