గోదావరి పరివాహక గ్రామాలకు వరద ముప్పు తప్పించేందుకు ప్లాన్​

గోదావరి పరివాహక గ్రామాలకు వరద ముప్పు తప్పించేందుకు ప్లాన్​

నిర్మల్, వెలుగు: నిర్మల్​జిల్లాలోని గోదావరి నది పరివాహక గ్రామాల ప్రజలకు ఏటా వరద ప్రవాహం ప్రాణసంకటంగా మారుతోంది. ప్రధానంగా  శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్ల దిగువ నుంచి ఖానాపూర్ వరకు వర్షాకాలంలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంటుంది. ఎగువ మహారాష్ట్ర నుంచి వరద పెరిగినప్పుడల్లా ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుంటారు. ఒకేసారి లక్షల క్యూసెక్కుల నీరు వదలడంతో గోదావరి ఉప్పొంగుతుంటుంది. ఆ సమయంలో నదికి ఇరువైపులా ఉన్న పరివాహక గ్రామాలన్నీ ముంపునకు గురవుతుంటాయి. దాదాపు 15 గ్రామాలకు పైగా ఏటా గోదావరి నది వరద కారణంగా ముంపునకు గురవుతున్నాయి. దీంతోపాటు పరోక్షంగా మరికొన్ని గ్రామాలు కూడా ఇబ్బందుల పాలవుతున్నాయి. వానాకాలమంతా పరివాహక గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు గ్రామాల్లో సైరన్లు మోగించడం, దండోరాలు వేయించడం, మైకులలో ప్రచారం చేసి పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాల్సి వస్తుండడంతో వారికి సైతం కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో గ్రామాలకు వరద ముప్పు తప్పించేందుకు అధికారులు భద్రాచలం తరహాలో కరకట్టల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఇరిగేషన్ అధికారులు కరకట్టల ప్రతిపాదనలపై సమీక్ష జరిపారు. భద్రాచలంలో గోదావరి వరద ఉద్ధృతి నుంచి కరకట్టలు గ్రామాలను కాపాడుతున్నాయి. అదే విధంగా జిల్లాలోని  గోదావరి నదికిరువైపులా కరకట్టలు నిర్మించాలని అధికారులు తలపెట్టారు. ఇందుకనుగుణంగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

నదికి ఇరువైపులా..

జిల్లాలో సోన్  నుంచి  ప్రారంభమయ్య గోదావరి నది ఖానాపూర్ వరకు దాదాపు 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంటుంది. సోన్ నుంచి మొదలుకొని కూచన్ పల్లి, ధర్మారం, పార్ పల్లి, మునిపల్లి, చింతల్ చందా, మామడ మండలంలోని కమల్ కోట, పొన్కల్, ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్, మేడమ్ పల్లి, బాదన్ కుర్తి, ఖానాపూర్ గ్రామాలు ఏటా ముంపు బారిన పడుతున్నాయి. ఈ గ్రామాలతోపాటు గోదావరి ఉపనది అయిన స్వర్ణా నది పరివాహక గ్రామాలు సైతం ముంపునకు గురవుతున్నాయి. స్వర్ణ ప్రాజెక్టు నుంచి మాదాపూర్ వరకు గల గ్రామాలతో పాటు నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ కూడా ముంపునకు గురవుతోంది. దీంతో మొత్తం 40 కిలోమీటర్ల మేర నదికి ఇరువైపులా కరకట్టలను నిర్మించాలని అధికారులు  ప్లాన్​చేశారు. ఇందుకు దాదాపు రూ. 70 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. భద్రాచలంలో నిర్మించిన కరకట్టల తరహాలోనే మరింత శాస్త్రీయతను జోడించి, క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఈ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు.

నిర్మల్​జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు తప్పించేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఏటా శ్రీరాంసాగర్​ప్రాజెక్టు దిగువన ఉన్న 15కు పైగా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వేలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం తరహాలో కరకట్టల నిర్మాణంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని, ఇందుకు రూ. 70 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు.

ప్రతిపాదనపై  కసరత్తు చేస్తున్నం 

గోదావరి నది పరివాహకంలోని గ్రామాలను వరద ముప్పు నుంచి కాపాడేందుకు కరకట్టల ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నాం. దాదాపు 40 కిలోమీటర్ల పొడవుతో కరకట్టలను నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం సుమారు రూ. 70 కోట్లు వ్యయం కావచ్చని భావిస్తున్నాం. భద్రాచలం తరహాలో ఈ కరకట్టలను నిర్మిస్తాం. ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపగానే పనులు చేపట్టేందుకు సర్వే మొదలుపెడతాం.   – రామారావు, ఈఈ, ఇరిగేషన్, నిర్మల్