
- బ్యూటిఫికేషన్ పేరుతో కబ్జాలు
- నదిని ప్రభుత్వం ప్రక్షాళించాలి
- గ్రౌండ్ లెవల్లో చర్యలు ఉండాలి
- మా సహకారాలు అందిస్తాం
- రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్ పర్ట్స్ సూచన
- హైకోర్టు వద్ద మూసీ ఒడ్డున స్టూడెంట్స్ కు అవేర్ నెస్ వాక్
హైదరాబాద్, వెలుగు : మూసీ నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మళ్లీ ఒకప్పటి జీవ నదిలా మార్చాలి. ఇందుకు గ్రౌండ్ లెవల్ లో పని చేయాలి. నది ప్రక్షాళనకు ప్రభుత్వానికి ఏ విధమైన సహకారాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’’. అంటూ పలువురు ఎక్స్ పర్ట్స్ స్పష్టంచేశారు. ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. శుక్రవారం హైకోర్టు వద్ద మూసీ నది ఒడ్డున స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు.
మూసీని పరిరక్షించాలని, నదికి పూర్వవైభవం తీసుకురావాలని ఫోకస్ స్కూల్ స్టూడెంట్స్ వాక్ నిర్వహించారు. అనంతరం చర్చా గోష్టి కొనసాగించారు. విద్యార్థులకు మూసీనదిపై తమకు తెలిసిన విషయాలను వివరించారు. స్టూడెంట్స్ అనుమానాలను సీనియర్స్ నివృత్తి చేశారు. చర్చా అనంతరం స్టూడెంట్స్ కు ఎక్స్ పర్ట్స్ పలు సూచనలు చేశారు. స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
మూసీ పక్కన నివసించే వారి పరిస్థితి ఏంటీ..? ఏవైనా జబ్బులు వస్తే దానికి బాధ్యత ఎవరు..? మూసీ ఇలా ఎందుకు తయ్యారైంది..? ఇలా పలు ప్రశ్నలు ఎక్స్ పర్ట్స్ ను స్టూడెంట్స్ అడిగారు. మూసీపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు ఎంతో అవగాహన ఉంది. విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. భవిష్యత్ రోజుల్లో విద్యార్థులు కొత్త విధానాలపై స్టడీ చేయాలని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే దానిపై ఆలోచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నిపుణులు సూచించారు.
స్టూడెంట్స్ తో కలిసి మూసీ ఒడ్డున నది సమస్యపై విద్యార్థులకు వివరించామని, భవిష్యత్ తరాలకు నది ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. దీనికోసమే స్టూడెంట్స్ కు నదిపై అవగాహన కల్పించామని, మూసీ పరిరక్షణకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వానికి స్టూడెంట్స్ కూడా సలహాలు ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో లేక్ యాక్టివిస్ట్ కృష్ణ మోహన్, సోషల్ యాక్టివిస్ట్ ఫారూక్ హుస్సేన్, రాజీవ్ శర్మ, ఫోకస్ స్కూల్ స్టాఫ్ పాల్గొన్నారు.
ఫ్లోటింగ్ ట్రాష్ బేరియర్స్ మరిన్ని ఏర్పాటు చేయండి
మూసీ నదిలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పేరుకుపోయింది. నదిపై ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తున్నా ముందుగా తక్కువ ఖర్చుతో ప్లాస్టిక్ ని తొలగించేందుకు వీలుంది. ఇప్పటికే మూసీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నదిలోని నీరు వచ్చే 10 పాయింట్ల వద్ద స్టెయిన్ లెస్ స్టీల్, అల్యుమినియంతో తయారు చేసిన ఫ్లోటింగ్ ట్రాష్ బేరియర్స్ ని ఏర్పాటు చేసింది. వీటితో వ్యర్థ పదార్థాలు ఒకేచోట ఉండిపోతాయి. ఇండ్లలోంచి, పరిశ్రమల నుంచి వ్యర్థాలు వస్తున్నాయని, వాటిని ఎంట్రీ పాయింట్ లోనే ఆపడానికి ఫ్లోటింగ్ ట్రాష్ బేరియర్స్ ఉపయోగపడుతాయి. ఇలాంటివి మరికొన్నిచోట్ల ఏర్పాటు చేయాలి. కాలుష్యం ఎక్కువైతే చాలా ఖర్చు అవుతుంది. ఇప్పటి నుంచే కొద్దిగా తగ్గించుకుంటే ఒకేసారి ఇబ్బందులు లేకుండా ఉండటంతో పాటు ఖర్చులు తగ్గుతాయి.
ఎస్ఎస్ ప్రసాద్, ఓవోసీఎల్ రిటైర్డ్ జీఎం
వ్యర్థ జలాలను ట్రీట్ చేశాకే నదిలోకి వదలాలి
జీవనది మూసీ ఇలాంటి పరిస్థితికి చేరడం ఎంతో బాధను కలిగిస్తుంది. దీనికి కారణం ప్రధానంగా కెమికల్స్ కలిసిన వాటర్ నదిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలి. దీనికోసం పరిశ్రమల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ని శుద్ధి చేసిన తర్వాతనే బయటకు వదలేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బయోమెడికల్ వేస్టేజీ, కెమికల్ ఫర్టిలైజర్, డొమెస్టిక్ సీవరేజీని బయటకు వదులుతుండగా, వాటిని ట్రీట్ చేసి బయటకు వదిలిపెట్టే విధంగా చూడాలి. దీంతో కొంతమేరకైనా మూసీని కాలుష్యం నుంచి కాపాడవచ్చు.
కొండల్ రావు, రిటైర్డ్ పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజనీర్
నది ప్రక్షాళనలో రాజీ పడొద్దు
మూసీ డెవలప్ మెంట్ అంటే నదిపైన నిర్మాణాలు చేపట్టడం కాదు. నదిలోని నీటిని శుద్ధి చేసి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా చూడాలి. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా మూసీ ప్రక్షాళన చేయాలి. ముందుగా నదిలో కలిసే కాలుష్యాన్ని అరికట్టాలి. అందుకు నదిలో కాలుష్య జలాలు కలిసే ప్రాంతాల్లోనే చర్యలు తీసుకుని కాలుష్య నీటిని నియంత్రించాలి.
నది ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలి. ఆ తర్వాత నది బ్యూటిఫికేషన్ చేస్తే బెటర్. మూసీ చాలా వరకు ఆక్రమణలకు గురైంది. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉస్మానియా హాస్పిటల్ సమీపంలో నదిలో మట్టి పోసి ఏకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. మూసీని కాపాడేందుకు ప్రభుత్వం ఎక్కడా రాజీ పడొద్దు. నది ప్రక్షాళనకు ప్రభుత్వానికి ఏ విధమైన సహకారాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఏళ్లుగా మూసీపై ఎన్నోపోరాటాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేశారు.
డాక్టర్ లుబ్నా సర్వత్, సెంటర్ ఫర్ వెల్ బీయింగ్ ఎకనామిక్స్ ఫౌండర్ డైరెక్టర్