వాతావరణం సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగింది: ప్రయాణికుడు

వాతావరణం సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగింది: ప్రయాణికుడు
  • ప్రతీ ఒక్కరు ఏడుస్తునే ఉన్నారు..ప్రమాద క్షణాలను గుర్తు చేసుకున్న బాధితుడు

తిరువనంతపురం: ఏం అవుతుందో తెలిసేలోపే ప్రతి ఒక్కరు గట్టిగా కేకలు వేసి ఏడుపులు మొదలుపెట్టారని, ముందుకు పడిపోకుండా సీట్లు గట్టిగా పట్టుకుని బ్యాలెన్స్‌ చేసుకున్నామని కొజికోడ్‌ ప్రమాదం నుంచి బయట పడి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఒక బాధితుడు చెప్పారు. “ ఇది చాలా పెద్ద ట్రాజెడీ. మమ్మల్ని మేం బ్యాలెన్స్‌ చేసుకునేందుకు ముందు సీటును పట్టుకుని కింద పడకుండా జాగ్రత్త తీసుకున్నాం. విమానం క్రాష్‌ అవ్వగానే రెండు ముక్కలైపోయింది. ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఉన్నారు. ఇద్దరు పైలెట్లు చనిపోయారని, ముందు ఉన్న ఇద్దరు మహిళలు చనిపోయారని కేకలు వేశారు. పొద్దున లేసి పేపర్లో చూస్తే 18 మంది చనిపోయారనే వార్త చూశాం. వాతావరణం సరిగా లేదు. పరిస్థితి బాలేదని తెలిసి కూడా ల్యాండింగ్‌కి పర్మిషన్‌ ఇచ్చారు. వేరే ఎయిర్‌‌పోర్ట్‌కు పంపించి ఉంటే ఇలా జరిగేది కాదు” అని ఎమ్‌ఐఎమ్‌ఎస్‌ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న వ్యక్తి చెప్పారు. పైలెట్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే తాము ప్రాణాలతో ఉన్నామని మరో ప్రయాణికుడు చెప్పారు. అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల మంటలు చెలరేగలేదని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వచ్చి సాయం చేశారని చెప్పారు. రెస్క్యూ బృందాలు వచ్చేలోపే తమను బయటికి తీశారని, వాళ్ల వల్ల చాలా మంది బ్రతికామని చెప్పారు. కరోనా కారణంగా దుబాయ్‌లో చిక్కకున్న మనవాళ్లను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన వందే భారత్‌ ఫ్లైట్‌ కేరళలోని కొజికోడ్‌ ఎయిర్‌‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సహా 20 మంది చనిపోయారు. గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటళ్లకు తరలించి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు.