అందరి జీన్స్​ ఒకేచోట!

అందరి జీన్స్​ ఒకేచోట!

20 మంది సైంటిస్టులతో
జీనోమ్​ ఇండియా ప్రాజెక్ట్​
జెనెటికల్​ డిజార్డర్స్​ను ముందే గుర్తించేందుకు ఉపయోగం
నష్టాలూ ఉంటాయంటున్న నిపుణులు

ఒక మనిషి తీరుతెన్నులను చెప్పేది జీన్స్​. ఆ మనిషి ఆరోగ్యం, జబ్బులు, శరీరతత్వం వంటి గుట్టులను దాచుకునే బ్రహ్మ పదార్థం. అలాంటి జీన్స్​ను ఒక్కచోట చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్ట్​ను చేపట్టబోతోంది. జీనోమ్​ ఇండియా ప్రాజెక్ట్​ (జీఐపీ) పేరిట రూ.238 కోట్ల ఖర్చుతో జీన్​ మ్యాపింగ్​ను చేయించబోతోంది. దేశంలోని జీన్స్​ వైవిధ్యాన్ని ఒక చోటుకు చేర్చేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్​కు గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఓకే కూడా చెప్పింది. బెంగళూరులోని ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​ (ఐఐఎస్​సీ), కొన్ని ఐఐటీలకు చెందిన 20 మందికిపైగా సైంటిస్టులు ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారు.

అతిపెద్ద ప్రాజెక్ట్​ హెచ్​జీపీ​

నిజానికి జీనోమ్​ మ్యాపింగ్​ అనేది 1990లోనే మొదలైంది. తొలిసారిగా అమెరికా హ్యూమన్​ జీనోమ్​ ప్రాజెక్ట్​ (హెచ్​జీపీ) ను ప్రారంభించింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జీనోమ్​ మ్యాపింగ్​ ప్రాజెక్ట్​ అదే. అది 2003లో పూర్తయింది. హెచ్​జీపీలో నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​, అమెరికా డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఎనర్జీకి చెందిన సైంటిస్టులు పాల్గొన్నారు. జీనోమ్​లను సీక్వెన్స్​ చేసి, అందులోని జీన్స్​ను గుర్తించడం ఈ ప్రాజెక్ట్​ ప్రధాన ఉద్దేశం. దీంట్లో చాలా వరకు సైంటిస్టులు సక్సెస్​ అయ్యారు. జీన్స్​ లొకేషన్​ను గుర్తించి, వాటి నిర్మాణం, పనితీరును తెలుసుకోగలిగారు.

లాభమేంటి?

జీనోమ్​ మ్యాపింగ్​లో భాగంగా క్రోమోజోముపై ఒక జీన్​ ఉండే కచ్చితమైన ప్రాంతాన్ని తెలసుకుంటారు. ఆ క్రోమోజోముపై జీన్స్​ మధ్య దూరాన్ని లెక్కగడతారు. వాటితో తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే జబ్బులను సైంటిస్టులు తేలికగా గుర్తించగలుగుతారు. ఒక జీన్​ వల్లే ఆ జబ్బు వస్తుందా.. లేదా కొన్ని జీన్స్​ వల్ల వస్తుందా అన్నది తేలుస్తారు. జీనోమ్​ మ్యాపింగ్​ ద్వారా జబ్బు కారణమయ్యే ఆ జీన్​ ఉన్న క్రోమోజోమ్​ ఏదో కూడా కచ్చితంగా గుర్తించగలుగుతారు. ఉదాహరణకు అదరుదైన సింగిల్​ జీన్​ డిజార్డర్స్​ సిస్టిక్​ ఫైబ్రోసిస్​ (ఊపిరితిత్తులు, పాంక్రియాస్​లో అడ్డుపడే మ్యూకస్​), డుషినీ మస్క్యులర్​ డిస్ట్రొఫీ (కండరాల బలహీనత) వంటి వాటికి కారణమయ్యే ప్రత్యేకమైన జీన్స్​ను జీనోమ్​ మ్యాపింగ్​ ద్వారా గుర్తించొచ్చని నేషనల్​ హ్యూమన్​ జీనోమ్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ (ఎన్​హెచ్​జీఆర్​ఐ) సైంటిస్టులు చెబుతున్నారు. అంతేగాకుండా కామన్​గా వచ్చే ఆస్తమా, కేన్సర్​, గుండెజబ్బులకు కారణమయ్యే జీన్స్​నూ తెలుసుకునే వీలు కలుగుతుందంటున్నారు.

నష్టాలేంటి?

ఏదైనా రోగమొస్తుందని ముందే తెలిస్తే ఏమవుతుంది? ముందు ఆ మనిషి కుంగిపోతాడు. ఆ జబ్బు రాకముందే, వస్తుందన్న బెంగతోనే ఎక్కువ ఆందోళనకు గురవుతారు. దాని వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుందని సైంటిస్టుల వాదన. ఇంకొకటి, పిల్లలను కనకపోవడం. అవును, తమ వల్ల పిల్లలకు ఏ జబ్బు రాకూడదనుకునే వాళ్లు, పిల్లలను కనకుండా ఉండిపోతారని అంటున్నారు. ఇంకో ముఖ్యమైనది, ఉద్యోగాల్లో వివక్ష ఎదుర్కవోల్సి వస్తుందట. జబ్బు వచ్చే అవకాశం ఉన్న వ్యక్తికి కంపెనీలు ఉద్యోగం ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించే అవకాశం లేకపోలేదన్నది సైంటిస్టుల వాదన. అంతేగాకుండా ఇన్సూరెన్స్​ కంపెనీలూ ఆ సౌకర్యాన్ని సదరు వ్యక్తికి కల్పించకుండా అడ్డుకునే చాన్స్​ ఉంటుందని అంటున్నారు. మొత్తంగా వీటన్నింటి వల్ల మనిషికి ఎదురయ్యేది అతిపెద్ద సమస్య ‘ప్రైవసీ’. ఇవన్నీ కలిసి జీనోమ్​ మ్యాపింగ్​కు నష్టాలంటున్నారు నిపుణులు.

ఒక్కో కణంలో 20,500 జీన్స్

కణము..కణము కలిస్తే మనిషి. ఒక్కో కణంలో 23 జతల క్రోమోజోములుంటాయి. అంటే మొత్తం ఒక్క కణంలో 46 క్రోమోజో ములుంటాయి. వాటిలో దాదాపు 20,500 జీన్స్​ ఉంటాయని హెచ్​జీపీలో గుర్తించారు. ఆ జీన్స్​ అన్ని కలిసికట్టుగా ఉండేదే జీనోమ్​. అంటే డీఎన్​ఏల సమాహారమన్నమాట. క్రోమోజోముపై ఇవి వరుసగా ఉంటాయి. ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. ఆ వరుస క్రమమే ఓ మనిషిలో పుట్టుకతో వచ్చే జీన్స్​ను ఎఫెక్ట్​ చేస్తుందన్నది సైంటిస్టుల వాదన. ఉదాహరణకు జీన్స్​ ఆనుకుని ఉంటే, ఆ జీన్స్​ మరో వ్యక్తిలో జంటగా ఉండే అవకాశం ఉంటుందట. అందుకే వాటి గుట్టును విప్పేందుకే ఈ జీనోమ్​ మ్యాపింగ్​ను చేస్తున్నారు. ఇప్పుడు మన దేశమూ
ఆ ప్రాజెక్ట్​ను చేస్తోంది.

see also: పిల్లి కాదు.. పులి

మరిన్ని వార్తల కోసం