తెలంగాణలో ఎక్కడ చూసినా కమ్యూనిస్టు అభిమానులే : కూనంనేని

తెలంగాణలో ఎక్కడ చూసినా కమ్యూనిస్టు అభిమానులే : కూనంనేని
  •  ఏ కష్టం వచ్చినా ప్రజలు ఎర్రజెండా వైపే చూస్తారు 

వేములవాడ, వెలుగు: తెలంగాణలో ఎక్కడచూసినా కమ్యూనిస్టు అభిమానులే ఉన్నారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుగా చూసేది ఎర్రజెండా వైపేనని సీపీఐ నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం వేములవాడలో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీ అత్యంత ప్రమాదకర పార్టీ అని, దానిని దగ్గరికి రానీయొద్దన్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమై డిసెంబర్ నాటికి 100 ఏండ్లు పూర్తికానున్నాయని తెలిపారు.

 కమ్యూనిస్టులు చట్టసభల్లో బలోపేతం కావలసి ఉందన్నారు. కమ్యూనిస్టులు లేని ప్రాంతం లేదని, ఖమ్మం నుంచి మొదలుకొని నల్గొండ, కరీనంగర్​  వరకు కమ్యూనిస్టులు ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ పేదలు, కార్మిక వ్యతిరేక పార్టీ అని, లోక్ సభ ఎన్నికల్లో సీట్లు తగ్గడంతో కార్మిక, పేదల  వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. హిట్లర్  బాటలో ప్రధాని నరేంద్ర మోదీ పయనిస్తున్నారని విమర్శించారు.