- టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ట్వీట్‌తో మరోసారి చర్చ
- ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు: ఎలన్ మస్క్
- ఇండియాలోని ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం: రాజీవ్ చంద్రశేఖర్
- మన ఈవీఎంలు బ్లాక్ బాక్స్‌ల లాంటివి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఈవీఎంల విషయంలో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని మస్క్ కామెంట్ చేయగా, ఇండియాలో తయారైన ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘‘మనం ఈవీఎంలను తొలగించాలి. వాటిని వ్యక్తుల సాయంతో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది”అని ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
దీనిపై రాజీవ్ చంద్రశేఖర్ ఆదివారం స్పందిస్తూ.. ‘‘సెక్యూర్ డిజిటల్ హార్డ్ వేర్‌ను తయారు చేయడం అసాధ్యమన్నట్లు మస్క్ మాట్లాడుతున్నారు. కానీ అది తప్పు. అమెరికా సహా ఇతర దేశాలలో సాధారణ కంప్యూటర్ ప్లాట్ ఫామ్స్‌ను వాడి ఇంటర్నెట్ కనెక్టెడ్ ఈవీఎంలను తయారు చేస్తారు. కానీ ఇండియాలో తయారుచేసే ఈవీఎంలు ఏ నెట్‌వర్క్‌తో, మీడియాతో అనుసంధానం కావు. ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఉండదు. రీప్రోగ్రామ్ చేసే వీలుండదు” అని ట్వీట్ చేశారు. హ్యాకింగ్‌కు అవకాశంలేని ఈవీఎంలను తయారుచేసుకోవాలని అనుకునే దేశాలకు శిక్షణ ఇవ్వడానికి ఇండియా రెడీ అంటూ కౌంటర్ ఇచ్చారు. దీనికి మస్క్ బదులిస్తూ.. ‘దేన్నయినా హ్యాక్ చేయవచ్చు’ అని అన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. ‘అవును ఏదైనా సాధ్యమే. కానీ థియరీ వేరు.. ప్రాక్టికల్ వేరు. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా నేను ఏ లెవల్ ఎన్ క్రిప్షన్ అయినా డీక్రిప్ట్ చేయగలను. కానీ దీనికి, ఈవీఎంలకు సంబంధం లేదు. ఈవీఎంలు పూర్తిగా సేఫ్” అని చెప్పారు.
ఎన్నికల పారదర్శకతపై ఆందోళనలు: రాహుల్ గాంధీ
దేశంలో ఎన్నికల పారదర్శకతపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్‌పై ఆయన స్పందించారు. ‘‘ఇండియాలోని ఈవీఎంలు బ్లాక్ బాక్స్‌ల లాంటివి. వాటిని పరిశీలించడానికి ఎవరినీ అనుమతించరు. వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక బూటకంగా మిగిలిపోతుంది” అని రాహుల్ ట్వీట్ చేశారు.