
- చిక్కడపల్లి పీఎస్‌లో కేసు నమోదు
ముషీరాబాద్, వెలుగు: రియల్టర్‌ను ఓ మాజీ డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) చితకబాదిన ఘటన చిక్కడపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు బుధవారం రాత్రి పోలీసుకు కంప్లయింట్ చేశాడు. చిక్కడపల్లి సీఐ సీతయ్య తెలిపిన ప్రకారం... రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజుకు మాజీ డీఐ ప్రసాద్ డబ్బులు ఇచ్చారు. కంపెనీ రిజిస్ట్రేషన్‌లో తన అన్న శేఖర్ పేరు పెట్టాలని సూచించాడు.
రాజు మరో పేరుతో కంపెనీ రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో తను చెప్పిన పేరు పెట్టకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వనందుకు ప్రసాద్ ఆగ్రహించి రాజుపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రసాద్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. లావాదేవీల మొత్తం ఎంతనే దానిపై విచారణ చేపట్టామని చెప్పారు.
సంచలనంగా మారిన చిక్కడపల్లి పీఎస్
మూడేళ్లుగా చిక్కడపల్లి పీఎస్ పేరు సంచలనంగా మారింది. ఇన్ స్పెక్టర్ శివశంకర్ రావు, డీఐ ప్రభాకర్ భార్యాభర్తల కేసులో తలదొరిచ్చినట్లు ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత నిరుద్యోగి ప్రవళిక సూసైడ్ కేసులో నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలతో ఇన్స్పెక్టర్ పి. నరేశ్ సస్పెండ్ అయ్యారు.
ఇప్పుడు మాజీ డీఐ ప్రసాద్ రియల్టర్ పై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలతో చిక్కడపల్లి పీఎస్ పేరు మార్మోగుతోంది. ఇటీవల చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి కూడా ఎమ్మెల్యే ముఠా గోపాల్ కొడుకు ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేస్తుండగా అలసత్వ వహించాడనే ఆరోపణలతో సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.