MS Dhoni CSK Ownership: భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య ఉన్న బంధం ప్రత్యేకమైనది. ఐపీఎల్ 2027 సీజన్‌కి ముందే ధోనీకి సంబంధించి ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సీఎస్కే ఫ్రాంచైజీలో ధోనీ ఏకంగా 25 శాతం వాటా (స్టేక్) అడిగాడని, ఆ తర్వాత దానిని 20 శాతానికి తగ్గించుకోగా.. యాజమాన్యం 5.5 శాతం వాటా ఇచ్చేందుకు మాత్రమే ఒప్పుకుందంటూ ఒక రిపోర్ట్ హల్చల్ చేసింది. ఐపీఎల్లో 5 ట్రోఫీలు అందించిన ధోనీ నిజంగానే టీమ్ ఓనర్షిప్ అడిగారా అనే చర్చ అభిమానుల్లో కొనసాగుతుంది.
ఈ స్టోరీని ఎవరో పర్ఫెక్టుగా క్రియేట్ చేశారు:
ఈ వార్తలపై కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా తీవ్రంగా మండిపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆయన, ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండించడమే కాకుండా ఇది పక్కాగా ఎవరో కావాలని సృష్టించిన ప్లాంటెడ్ స్టోరీ అని కొట్టిపారేశారు. మైదానంలో ధోనీకి ఎంతటి క్రేజ్ ఉన్నప్పటికీ, ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీలో 25 శాతం వాటా అడగడం అనేది అసాధ్యమైన విషయం, అసలు ఈ కథనంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పేశారు.
400 మిలియన్ డాలర్లు ఊరికే ఇచ్చేస్తారా?:
ఈ సందర్భంగా ఫ్రాంచైజీ విలువకు సంబంధించిన అసలు లెక్కలను ఆకాష్ చోప్రా బయటపెట్టారు. ఇటీవల ఆర్సీబీ (RCB) యాజమాన్యం విలువ దాదాపు 1.8 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారని, 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కే బ్రాండ్ విలువ కూడా అదే స్థాయిలో ఉంటుందని గుర్తు చేశారు. ఒకవేళ సీఎస్కే విలువ 1.8 బిలియన్ డాలర్లు అనుకుంటే, అందులో 25 శాతం అంటే దాదాపు 400 మిలియన్ డాలర్లు (రూ. 3,300 కోట్లకు పైగా) అవుతుందని తెలిపారు. అంత పెద్ద మొత్తాన్ని లేదా ఉచితంగా 400 మిలియన్ల విలువైన వాటాను ఎవరైనా ఊరికే ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 25 శాతం వాటా కావాలంటే ఎదురు 400 మిలియన్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని చోప్రా లాజిక్ చెప్పాడు.
5.5 శాతం కూడా అసాధ్యమే: ఆకాశ్ చోప్రా
మహేంద్ర సింగ్ ధోనీ మొదట 25 శాతం అడగడం, ఆ తర్వాత 5.5 శాతానికి డీల్ కుదిరిందనడంలోనూ ఎలాంటి వాస్తవం లేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తేల్చి చెప్పారు. సీఎస్కే లాంటి దిగ్గజ ఫ్రాంచైజీలో 2 శాతం లేదా 5 శాతం వాటా కూడా భారీ మొత్తంతో కూడుకున్న వ్యవహారమని అన్నారు. అనవసర వివాదం సృష్టించడానికే ఈ వార్తలను బయటకు వదిలి ఉంటారని, ఈ అసత్య ప్రచారాన్ని చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని ఆకాష్ చోప్రా సూచించారు.
