పవన్​ కళ్యాణ్​పచ్చి దగాకోరు: మాజీ మంత్రి పేర్నినాని

పవన్​ కళ్యాణ్​పచ్చి దగాకోరు: మాజీ మంత్రి పేర్నినాని

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ మాటలు పిట్టల దొర మాటల్లా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి పచ్చి దగాకోరు ఎవరైనా వున్నారా అంటూ పేర్ని నాని ఫైర్‌ అయ్యారు.

 రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నటన చూస్తుంటే చిరంజీవి సైతం ఆశ్చర్యపోయేలా ఉందంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి రాజకీయ లబ్ధి చేకూర్చడమే పవన్ లక్ష్యమని.. జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు చంద్రబాబు కోసమే పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. 

మరోవైపు విశాఖపట్నంలోని ఫిషింగ్ హర్బర్‌లో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని తెలిపారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు బోటు కాలిపోయిన బాధిత మత్స్యకారులకు పరిహారం అందించామని వ్యాఖ్యానించారు. ఇంకా 4నెలలు ఆగితే నాది, చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది  పవన్​ కళ్యాణ్​ అంటున్నాడని పేర్ని నాని అన్నారు.  2014లో మీ ఇద్దరి ప్రభుత్వం ఉంది.. మరి ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో టీడీపీకి ఓటు వేసి గెలిపించండి.. ప్రశ్నించడానికి నేను ఉన్నానని చెప్పాడు.. మరి ఏనాడైనా ప్రశ్నించాడా అంటూ ఎద్దేవా చేశారు. 

960 కిలోమీటర్లు వున్న తీర ప్రాంతంలో ఒక్క హార్బర్ అయినా కట్టారా.. మరి ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. కనీసం ఒక్క జెట్టి అయినా కట్టారా కనీసం అనుమతులు అయినా ఇచ్చారా అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కుప్పిగంతులు, వేషాలు చూసి ఊసరవెల్లి కూడా కంగారు పడిపోతుందన్నారు. అసలు మీరు అధికారంలో వున్నప్పుడు ఏ ఒక్క పని అయినా చేశారా అంటూ ప్రశ్నలు గుప్పించారు