జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహులు

జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహులు

నాగర్ కర్నూల్: రేవంత్ రెడ్డి అబద్ధాలకోరు అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత చిత్తరంజన్ దాస్ విమర్శించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం కల్వకుర్తి అభివృద్ధి సాధన కమిటీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇద్దరు  కూడా తెలంగాణ ద్రోహులని ఆరోపించారు. వారిద్దరూ ఏనాడూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనలేదని చెప్పారు.

జైపాల్ రెడ్డిని కల్వకుర్తి ప్రజలు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేస్తే... ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఎన్నికైన తర్వాత ఏనాడూ కల్వకుర్తివైపు చూడలేదని ఆరోపించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి కరెంట్ తెచ్చింది శాంతాబాయి అని, కల్వకుర్తికి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు విషయంలో జైపాల్ రెడ్డి ప్రయత్నం ఏమీలేదని తేల్చి చెప్పారు. కల్వకుర్తి ప్రాంతానికి రేవంత్ రెడ్డి కూడా చేసిందేమీ లేదని విమర్శించారు.