పొంగులేటి దూకుడు.. అభ్యర్థుల ప్రకటనతో హల్​చల్​

పొంగులేటి దూకుడు.. అభ్యర్థుల ప్రకటనతో హల్​చల్​

ఖమ్మం, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి దూకుడుగా ముందుకు పోతున్నారు.  బీఆర్ఎస్​తో విభేదాల నేపథ్యంలో కొంతకాలంగా ఆ పార్టీ హైకమాండ్​పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పొంగులేటికి బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్​టీపీ తమ పార్టీలో చేరాలని ఆహ్వానం పలికాయి. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారోననే ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో పొంగులేటి అనూహ్యంగా రాబోయే ఎన్నికల్లో తన వర్గం తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు. ఆదివారం వైరాలో విజయాబాయిని  క్యాండిడేట్ గా అనౌన్స్ చేసిన ఆయన, సోమవారం అశ్వారావుపేట నుంచి జారే ఆదినారాయణను తమ వర్గం అభ్యర్థిగా ప్రకటించారు. ఈ లెక్కన తన అనుచరులందరికీ టికెట్లు ఇచ్చే పార్టీలోనే పొంగులేటి చేరుతారని, అందుకు ఏ పార్టీ ఒప్పుకోకుంటే సొంతంగా నిలబడుతారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తాజా పరిణామాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్​ ఒక్కసారిగా హీటెక్కాయి. 

చెప్పినట్లే చేస్తున్నరు..

పొంగులేటి బీఆర్ఎస్​ నుంచి బయటకు పోవడం కన్ఫామ్ అయినా, ఇప్పటివరకు ఆయన ఏ పార్టీలో చేరబోయేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.  బీజేపీ, కాంగ్రెస్​, వైఎస్​ఆర్​టీపీ నుంచి ఆహ్వానాలున్నా పొంగులేటి తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. రాష్ట్ర స్థాయిలో ఆయా పార్టీల ముఖ్యులతో పాటు, ఢిల్లీ స్థాయిలో పొంగులేటితో టచ్​లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన మార్చి రెండో వారం వరకు సమయం ఉందంటూ దాటవేస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో తన అనుచరులందరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఈ ఏడాది కొత్త సంవత్సరం రోజే ఆయన చెప్పారు. దాని ప్రకారం ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. దీన్ని బట్టి తాను అనుకున్న వాళ్లందరికీ టికెట్ ఇచ్చే పార్టీలోనే పొంగులేటి చేరతారని తెలుస్తోంది. అది ఏ పార్టీ అయినా తన అనుచరులకు పోటీ చేసేందుకు సీట్లు కన్ఫామ్​ చేసుకున్న తర్వాతనే పొంగులేటి నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లేకుంటే ఇండిపెండెంట్ గా అయినా అభ్యర్థులను పోటీలో ఉంచుతారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

బీఆర్​ఎస్​పై తీవ్ర విమర్శలు

ఇక ప్రభుత్వ పథకాల అమలు, హామీలపై పొంగులేటి డైరెక్ట్ ఎటాక్​చేస్తున్నా బీఆర్ఎస్​నుంచి కౌంటర్లు తప్పించి యాక్షన్​ కనిపించడం లేదు. 24 గంటల కరెంట్, డబుల్ బెడ్రూం ​ఇండ్లు, రుణమాఫీ లాంటి పథకాలపై పొంగులేటి ఆత్మీయ సమావేశాల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి జిల్లా స్థాయిలో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​ ఇతర లీడర్లు తిప్పికొట్టారు. అయితే ఇప్పటికీ బీఆర్​ఎస్​లోనే ఉన్న పొంగులేటిపై చర్యలు తీసుకునేందుకు హైకమాండ్​ వెనుకంజ వేస్తున్నట్టు కనిపిస్తోంది. వైరా నియోజకవర్గంలో పొంగులేటి వెంట తిరుగుతున్నారనే కారణంతో పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని రెండ్రోజుల క్రితం దాదాపు 20 మంది లీడర్లను సస్పెండ్ చేశారు. ఇందులో మార్క్​ ఫెడ్ వైస్ చైర్మన్​ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్​ సూతకాని జైపాల్ వంటి వారితో పాటు పలువురు నాయకులున్నారు. ఆయన వెంట తిరుగుతున్న లీడర్లను సస్పెండ్ చేస్తున్న పార్టీ, నేరుగా అధిష్ఠానంపైనే విమర్శలు చేస్తున్నా పొంగులేటిని మాత్రం టచ్​ చేయకపోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. పొంగులేటిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయనకు మరింత సానుభూతి పెరుగుతుందనే కారణంతోనే చర్యలు తీసుకోవడం లేదని, తనంతట తానే పొంగులేటి వెళ్లిపోయేలా మాత్రమే వ్యవహరిస్తున్నారన్న విశ్లేషణలున్నాయి. తనపై యాక్షన్​ తీసుకోవాలనే పొంగులేటి కోరుకుంటున్నారని, ఆయనకు లబ్ధిచేకూరేలా ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలో పార్టీ ఉందని తెలుస్తోంది. పొంగులేటి వెంట వెళ్లాలనుకున్నవారు భయపడేలా సస్పెన్షన్లతో సరిపెడుతున్నారని తెలుస్తోంది.  

ధైర్యముంటే నన్ను సస్పెండ్​ చేయండి

భద్రాద్రికొత్తగూడెం/దమ్మపేట, వెలుగు: ‘నా వాళ్లను కాదు, ధైర్యముంటే నన్ను సస్పెండ్​ చేయండి.. అదీ మీ ఖలేజా’ అంటూ బీఆర్ఎస్​ లీడర్లకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సవాల్​ విసిరారు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమిలిపేటలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పొంగులేటి అనుచరులైన బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, మిట్టపల్లి నాగేశ్వర రావు, గుమ్మా రోశయ్య,  మురళిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు వైరా టౌన్ బీఆర్ఎస్​ అధ్యక్షుడు రాజశేఖర్ ఆదివారం ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పొంగులేటి స్పందించారు. ‘శ్రీనివాస్​రెడ్డికి సభ్యత్వం ఉందో లేదో మీకు తెలియదా, మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాల్లో నా ఫొటో వాడలేదా, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదా, మీ ఎన్నికలకు నన్ను ఉపయోగించుకోలేదా? అవన్నీ మర్చిపోయారా’ అని ప్రశ్నించారు. తన వెంట ఉన్నవారిని సస్పెండ్​ చేసే  స్థాయి వారికి ఉందో, లేదో తెలుసుకోవాలన్నారు. ఇన్నేండ్లయినా పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదని, గిరిజనులకు ఒక్క ఎకరా భూమి ఇవ్వలేదన్నారు. ఎక్కడో రెండుమూడిండ్లు కట్టి పేపర్లల్ల  ఫస్టు పేజీలో  వేయించుకుంటే సరిపోతుందా? అని నిలదీశారు.  సర్పంచులకు బకాయిలు ఇవ్వలేదని, ఇప్పుడు పంచాయతీకి రూ.10 లక్షలిస్తమంటే ఎవరూ నమ్మరన్నారు. సీఎం మాటలు వినసొంపుగా ఉంటాయని, కానీ ఫండ్స్​మాత్రం రావన్నారు. ‘శీనన్నకు రూ. వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని చెప్తున్నారు.. అవేమైనా దొడ్డిదారిన ఇచ్చారా? కాంట్రాక్టులపై చర్చకు నేను రెడీ.. ఎవరొస్తారో రండి..’ అని పొంగులేటి సవాల్ విసిరారు. 

అశ్వారావుపేట అభ్యర్థిగా జారే ఆదినారాయణ 

వైరా అభ్యర్థిగా బానోత్​ విజయను ఇప్పటికే ప్రకటించిన పొంగులేటి.. అశ్వారావుపేట అసెంబ్లీ స్థానానికి జారే ఆది నారాయణ పేరును ప్రకటించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లినా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులే ఉంటారని స్పష్టం చేశారు.