మాజీ నక్సలైట్ ​అంత్యక్రియలకు పోలీసుల అడ్డగింత

మాజీ నక్సలైట్ ​అంత్యక్రియలకు పోలీసుల అడ్డగింత

ఇల్లెందు, వెలుగు : ఇల్లెందులోని కోర్టు వివాదంలో ఉన్న భూమిలో మాజీ నక్సలైట్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. టౌన్​కు చెందిన కొడెం సమ్మయ్య(55) గతంలో మావోయిస్టులతో కలిసి పనిచేశాడు. 2008 తర్వాత జనజీవన స్రవంతిలో కలిశాడు. అందుకు గాను ప్రభుత్వం సమ్మయ్యకు సర్వే నంబర్​603/1లో 1.20 ఎకరాల భూమి ఇచ్చింది. అయితే సదరు భూమిని మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ కబ్జా చేశాడంటూ కొద్ది రోజులుగా సమ్మయ్య తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు.

ALSO READ:చంద్రబాబును సమర్థించే వాళ్లు ఈ 12 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: వర్మ

తనకు న్యాయం చేయడం లేదంటూ ఇల్లెందు తహసీల్దార్​ఆఫీస్​ముందు ఆత్మహత్యయత్నం కూడా చేశాడు. చివరికి కోర్టును ఆశ్రయించాడు. సానుకూల స్పందన లేకపోవడంతో మనస్థాపం చెందాడు. గురువారం రాత్రి కాకతీయ నగర్​లోని అద్దె ఇంట్లో చనిపోయాడు. కుటుంబ సభ్యులు సమ్మయ్య మృతదేహానికి శుక్రవారం వివాదాస్పద భూమిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, సమ్మయ్య కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని సదరు స్థలంలో విడిచిపెట్టి వెళ్తుండగా, పోలీసులు సర్దిచెప్పారు. చేసేదేంలేక కుటుంబ సభ్యులు మృతదేహానికి స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.