
అమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేయబోయే గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ఖరారైంది. మాజీ జర్నలిస్ట్, టీవీ యాంకర్ అయిన ఇసుదాన్ గాధ్వి పేరును.. ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పటికే అధికార బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్లో ప్రచారం వేగవంతం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దానిపై AAP సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఇసుదాన్ గాధ్వికి 73 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో.. ఆయన పేరును ఆప్ ఖరారు చేసింది. గతేడాది జూన్‌లో ఇసుదాన్ గాధ్వి ఆప్ పార్టీలో చేరారు. ఇక ఆప్ గుజరాత్ యూనిట్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఉన్నారు. పటీదార్ సంఘం ఆందోళనలో గోపాల్ ఇటాలియా కీలక పాత్ర పోషించారు. ఇటాలియా ద్వారకా జిల్లా పిపాలియా గ్రామంలోని ఓ రైతు కుటుంబానికి చెందినవాడు.
ప్రస్తుతం, గాధ్వి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. గతంలో మీడియాలో టీవీ జర్నలిస్ట్‌గా,VTV న్యూస్ ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే VTV గుజరాతీలో ప్రముఖ వార్తా కార్యక్రమం మహామంథన్‌కి యాంకర్‌గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇసుడాన్ 1982 జనవరి 10న గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లాలోని జంఖంభాలియా పట్టణానికి సమీపంలో గల పిపాలియా గ్రామంలో జన్మించారు. అతని తండ్రి ఖేరాజ్‌భాయ్ గాధ్వి.. వ్యవసాయం చేసేవారు.
ఇసుదాన్ జర్నలిజం కెరీర్
జర్నలిజంలో తన కెరీర్ ప్రారంభంలో, గాధ్వి ప్రముఖ దూరదర్శన్ షో 'యోజన'లో పనిచేశారు. 2007 నుండి 2011 వరకు, ఇసుదాన్ ETV గుజరాతీలో పోర్‌బందర్‌లో ఆన్-ఫీల్డ్ జర్నలిస్ట్‌గా పనిచేశారు. తరువాత, అతను మహామంథన్ కార్యక్రమంలో... గుజరాత్‌లోని డాంగ్ మరియు కపరాడ తాలూకాలలో రూ.150 కోట్ల అక్రమ అటవీ నిర్మూలన కుంభకోణాన్ని బయటపెట్టారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఈ కుంభకోణం పై చర్యలు తీసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే గాధ్వి పేరు ప్రఖ్యాతలు పొందడానికి ఈ సంఘటన దోహదపడింది. అతనికి నిర్భయ జర్నలిస్టు అనే బ్యాడ్జ్‌ని సంపాదించిపెట్టింది. ఇప్పుడు అమ్ ఆద్మీ పార్టీ నుంచి గుజరాత్ సీఎం అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నారు. డిసెంబర్ 1,5 తేదీల్లో గుజరాత్ లో పోలింగ్ జరగనుండగా.. అదే నెల 8న ఫలితాలు వెల్లడించనున్నారు.