అధికారుల నిర్లక్ష్యంతో అడ్మిషన్లు ఆలస్యమవుతున్నాయ్

అధికారుల నిర్లక్ష్యంతో అడ్మిషన్లు ఆలస్యమవుతున్నాయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యాసంవత్సరం ఆలస్యమవుతోంది. కరోనా ప్రభావానికి తోడు అధికారుల నిర్లక్ష్యంతో చదువు గాడి తప్పుతోంది. అక్టోబర్ వచ్చినా చాలా కోర్సుల్లో అడ్మిషన్లే పూర్తి కాలేదు. ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సుల క్లాసులు జులై, ఆగస్టులోనే ప్రారంభం కావాల్సి ఉండగా..అక్టోబర్ వచ్చినా మొదలు కాలేదు. కేవలం పాలిటెక్నిక్ మినహా ఏ కోర్సులోనూ తరగతులు ప్రారంభం కాలేదు. కొన్ని కోర్సుల్లో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ నడుస్తుండగా, మరికొన్నింటికి అదీ దిక్కులేదు. సెట్ల ఫలితాలు వచ్చినా అధికారులు ఇంకా కౌన్సెలింగ్ ప్రారంభించలేదు. దీంతో పలు కోర్సుల క్లాసులు నవంబర్​లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్​ సిస్టమ్ ఆధారంగానే రాష్ట్రాల్లో మార్పులు ఉంటాయని, కరోనాకు ముందున్న పరిస్థితులు రావాలంటే ఇంకో రెండేండ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు. పాలిసెట్ అడ్మిషన్లు మాత్రమే పూర్తి..  సాధారణంగా అకడమిక్ ఇయర్ అంటే జూన్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కరోనా కంటే ముందు రాష్ట్రంలో డిగ్రీ ఫస్టియర్ క్లాసులు జులై ఫస్ట్ వీక్​లోనే మొదలయ్యేవి. 

ఇంజనీరింగ్, ఇతర కోర్సులవి ఆగస్టు, సెప్టెంబర్ వరకు ప్రారంభమయ్యేవి. కానీ ఈ విద్యాసంవత్సరం ఆ షెడ్యూల్ గాడి తప్పింది. ఈసారి టెన్త్, ఇంటర్ ఫలితాలు జూన్ నెలాఖరులో రిలీజ్ కాగా.. డిగ్రీ ఫలితాలు జులై, ఆగస్టు నెలల్లో వచ్చాయి. అయినా ఇప్పటి వరకు కేవలం పాలిసెట్ అడ్మిషన్లు మాత్రమే పూర్తయ్యాయి. కొన్ని కోర్సుల కౌన్సెలింగ్ పూర్తికాకపోవడం, మరికొన్ని కోర్సులకు కౌన్సెలింగ్ షెడ్యూలే రాకపోవడంతో వేలాది మంది స్టూడెంట్లు ఎదురుచూస్తున్నారు.  

కొన్నింటికి కొనసాగుతున్న కౌన్సెలింగ్..  

ప్రస్తుతం ఎంసెట్(ఇంజనీరింగ్), దోస్త్, పీజీఈ సెట్, ఐసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా సెకండ్ ఫేజ్ నడుస్తోంది. ఏఐసీటీఈ షెడ్యూల్​ప్రకారం అక్టోబర్ 10 నుంచి క్లాసులు మొదలుకావాలి. కానీ ఇప్పటికీ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా పూర్తి కాలేదు. మరోపక్క డిగ్రీ అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. ప్రస్తుతం స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నడుస్తోంది. దోస్త్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1 నుంచే డిగ్రీ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంకా క్లాసులు మొదలుకాలేదు. మిగిలిన వారి కోసం సీట్లు పొందిన వారందరినీ వెయిట్ చేయించడంపై స్టూడెంట్లు, పేరెంట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీజీఈ సెట్.. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ నడుస్తోంది. ఇదంతా పూర్తికావాలంటే మరో నెల పట్టే అవకాశముంది. 

కొన్ని కోర్సులపై నేషనల్ టెస్టుల ప్రభావం.. 

జాతీయ స్థాయిలో జరిగే పలు ఎంట్రెన్స్​టెస్టుల ప్రభావం రాష్ర్టంలోని అడ్మిషన్లపైనా పడుతోంది. ప్రస్తుతం జోసా (ఐఐటీల్లో అడ్మిషన్లు) కౌన్సెలింగ్ నడుస్తోంది. దీంతో స్టేట్​లో  ఎంసెట్ కౌన్సెలింగ్ ను ఆలస్యం చేస్తున్నారు. నీట్(ఎంబీబీఎస్) కౌన్సెలింగ్ తో ఎంసెట్(ఫార్మసీ) కౌన్సెలింగ్ వాయిదా వేశారు. జాతీయ స్థాయిలోనే కౌన్సెలింగ్ ఆలస్యంగా జరుగుతుండటంతో రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. నేషనల్ లెవెల్​లో పలు కోర్సుల ఎంట్రెన్స్​లతోనూ వివిధ అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోందని పేర్కొంటున్నారు. అయితే నేషనల్ ఎంట్రెన్స్​లతో సంబంధం లేని కోర్సుల్లో అడ్మిషన్లు ఎందుకు పూర్తి చేయడం లేదనే దానిపై మాత్రం జవాబు చెప్పడం లేదు. 

ఈ సెట్లకు కౌన్సెలింగ్ మొదలు పెట్టలే.. 

ఇప్పటికే క్లాసులు ప్రారంభం కావాల్సిన కొన్ని కోర్సుల అడ్మిషన్ కౌన్సెలింగ్ కూడా ఇంకా షురూ కాలేదు. బీఈడీ, డీఈడీ, ఎల్ఎల్​బీ, ఎల్ఎల్​ఎం, బీపీఈడీ, డీపీఈడీ, బీఫార్మసీ తదితర కోర్సులకు సంబంధించి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చినా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. బీఫార్మసీ కౌన్సెలింగ్ నవంబర్​లో ఉంటుందని అధికారులు ప్రకటించారు. కానీ ఎడ్ సెట్, డీసెట్, లాసెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ సంగతి మాత్రం చెప్పలేదు. బీఈడీ, డీఈడీ, లా కాలేజీల్లో తనిఖీలు చేయకపోవడంతోనే కౌన్సెలింగ్ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. 

నేషనల్ టెస్టుల లింకుతోనే ఆలస్యం.. 

జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితుల వల్లే పలు కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇంటర్ ఫలితాలు త్వరగా వచ్చినా జోసా కౌన్సెలింగ్​తో ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ లేట్ అవుతోంది. నీట్ ప్రభావంతో అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్లు ఆలస్యమవుతున్నాయి. స్టూడెంట్లకు ఇబ్బందులు లేకుండా డిగ్రీ, పీజీ క్లాసుల షెడ్యూల్ రెడీ చేస్తున్నాం. కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఏడాది, రెండేండ్లలో అంతా సెట్ అయ్యే అవకాశముంది.   
- ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్