జిల్లాకు 40 వేల రీడింగ్ ​అద్దాలు వచ్చినయ్

జిల్లాకు 40 వేల రీడింగ్ ​అద్దాలు వచ్చినయ్
  •     ఎమ్మెల్యేలతో చర్చించాకే పంపిణీ చెయ్యాలె
  •     ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​

మహబూబ్​నగర్​, వెలుగు : రాష్ట్రంలో ఎవరూ కంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్​ ‘కంటి వెలుగు’ కార్యక్రమం చేపట్టారని ఎక్సైజ్​ శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ చెప్పారు. సోమవారం మహబూబ్​నగర్​కలెక్టరేట్‌‌లో కంటి వెలుగుపై నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన సదస్సుకు  జడ్పీ చైర్​పర్సన్​ స్వర్ణాసుధాకర్​రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డితో కలిసి చీఫ్‌‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ‘కంటి వెలుగు’లోని లోటుపాట్లను సవరించుకొని  ముందుకెళ్లాలని సూచించారు. ఇప్పటికే జిల్లాకు 40 వేల రీడింగ్ అద్దాలు వచ్చాయని,  వీటితోపాటు ప్రిస్క్రిప్షన్ అద్దాలు, అవసరమైన వారికి కాటరాక్ట్ ఆపరేషన్లు కూడా చేస్తామని చెప్పారు.  

గ్రామ,మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి  విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టాలని, కరపత్రాలు వాడుకోవాలని సూచించారు.  గ్రామాల్లో సర్పంచుల ద్వారా దృష్టిలోపంతో బాధపడుతున్నారనే వివరాలు తీసుకొని టెస్టులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని,  ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత కంటిఅద్దాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు.  గ్రామంలో ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారో లిస్ట్​ తయారు చేయాలని ఆశ , అంగన్​వాడీలను ఆదేశించారు.   

అంతకుముందు  మంత్రి  వీరన్నపేట ఓల్డ్ ఈద్గా సమీపంలో రూ.8 లక్షలతో, హెచ్ఎన్ ఫంక్షన్ హాల్ సమీపంలో రూ. 25 లక్షలతో, న్యూ రైల్వే గేట్ సమీపంలో రూ. 25 లక్షలతో, మక్కా మసీద్ సమీపంలో రూ.16 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు.  అలాగే కలెక్టరేట్‌‌ మీటింగ్ హాల్‌‌లో  జీవో నంబర్ 58 కింద రెగ్యులరైజేషన్  అయిన వారికి ఇంటి పట్టాలను మంత్రి అందజేశారు.  మొత్తం 313 అప్లికేషన్లు రాగా..  231కి అనుమతి ఇచ్చామని మంత్రి  చెప్పారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకటరావు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్య నాయక్,  డీసీసీబీ చైర్మన్​ నిజాం పాషా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడ్గల్​ యాదయ్య, అడిషనల్‌‌ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, కె. సీతారామారావు పాల్గొన్నారు.

జిల్లాలో 50 టీమ్‌‌లువ్యవసాయ శాఖ  మంత్రి నిరంజన్ రెడ్డి  

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.  సోమవారం నాగర్ కర్నూల్‌‌లోని  ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌‌లో ‘కంటి వెలుగు’పై  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా జనవరి 18 నుంచి ‘కంటి వెలుగు’ రెండో విడతను  ప్రారంభించనుందన్నారు.  జిల్లాలో టెస్టుల కోసం 50 బృందాలు నియమించి, శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

ఇక్కడ ప్రజల కోసం అన్ని సౌలత్‌‌లు కల్పిస్తామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కంటి వెలుగు మొదటి విడతలో 5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి 54 వేల మందికి దగ్గరి చూపు అద్దాలు,  43 వేల మందికి ప్రెస్క్రిప్షన్ అద్దాలు ఇచ్చామన్నారు. 22 వేల మందిని చికిత్స కోసం పంపించామన్నారు. ఈ సారి 6 లక్షల మందికి పరీక్షలు చేసేలా ప్లాన్ రెడీ చేశామన్నారు.  ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు,  మర్రి జనార్దన్ రెడ్డి,  ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ శాంతకుమారి, అడిషనల్‌‌ కలెక్టర్ మనుచౌదరి, డీఎంహెచ్‌‌వో సుధాకర్ లాల్ పాల్గొన్నారు.