పైసల్లేక పరేషాన్​ .. కామారెడ్డి మున్సిపాలిటీకి ఆర్థిక కష్టాలు​

పైసల్లేక పరేషాన్​ .. కామారెడ్డి మున్సిపాలిటీకి ఆర్థిక కష్టాలు​
  • ఆదాయానికి మంచి ఖర్చులు
  • రూ.16 కోట్లకు పైగా కరెంట్​బిల్లుల బకాయిలు
  • కార్మికులకు జీతాలివ్వలేని పరిస్థితి
  • ఆదాయ మార్గాలపై దృష్టి సారించని యంత్రాంగం

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపాలిటీకి ఆర్థిక కష్టాలొచ్చాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రతినెలా కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. నెలల తరబడి జీతాలు రాక కార్మికులు రోడ్డెక్కుతున్నారు. ఆదాయ వనరులను పెంచుకోవడంపై మున్సిపల్​యంత్రాంగం దృష్టి సారించడం లేదు. మున్సిపాలిటీకి ఆస్తిపన్ను, నల్లాల బిల్లు, వివిధ పన్నుల రూపంలో ఏడాదికి రూ.8.50 కోట్ల ఆదాయం వస్తోంది.

ఖర్చులు మాత్రం ఇందుకు రెట్టింపు ఉన్నాయి. స్ట్రీట్​లైట్లు, చెత్త సేకరణ ట్రాక్టర్లు, ఆటోలకు డీజిల్, బోరు మోటార్ల రిపేర్లు,​ ఇతర నిర్వహణకు ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా అవసరం. వీటితో పాటు ఇతరత్రా కలిపి ఏడాదికి రూ.3 కోట్లు కావాలి. ఏడాదికి రూ.4 కోట్ల కరెంట్​ బిల్లు వస్తోంది. జనరల్ ఫండ్స్​తో చేపట్టే పనులు, ఇతరత్రా అన్ని కలిపి ఏడాదికి రూ.15 కోట్ల మేర ఖర్చవుతోంది.

శానిటేషన్, వాటర్​వర్క్స్, ఎలక్ట్రికల్, ఆఫీస్, కంప్యూటర్​ వింగ్, ఆడిటోరియం, స్టేడియం, పార్క్​ల్లో పనిచేసే 470 కార్మికుల జీతాలకు  ప్రతినెలా రూ.65 లక్షలు అవసరం. ఈ లెక్కన ఏడాదికి రూ.7 కోట్ల 80 లక్షలు కావాలి. పైసలు లేక కార్మికులకు  ప్రతి నెలా జీతాలు అందడం లేదు. రెండు, మూడు నెలలకోసారి ఇవ్వాల్సి వస్తోంది. 2 నెలలుగా తమకు జీతాలు రాలేదని, తమకు జీతాలు ఇప్పించాలని కోరుతూ 10 రోజుల కింద కార్మికులు ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ ఎదుట ధర్నా చేశారు. ఎమ్మెల్యే ఆఫీసర్లతో మీటింగ్​ఏర్పాటు చేసి పరిస్థితులపై చర్చించారు. కార్మికులకు ఒక నెల జీతం చెల్లించారు. పీఎఫ్​బకాయిలు కూడా చెల్లించడం లేదు.

రూ.16 కోట్ల కరెంట్​ బకాయిలు

కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.16 కోట్ల కరెంట్​బిల్లులు పెండింగ్​ఉన్నాయి. బకాయిలు చెల్లించాలంటూ ఇటీవల ఎన్ పీడీఎసీఎల్​ఆఫీసర్లు మున్సిపల్​అధికారులకు నోటీస్​ఇచ్చారు. స్ట్రీట్​లైట్, సెంట్రల్​లైటింగ్, డ్రికింగ్​వాటర్, బోర్​వెల్స్, ఆఫీస్​కు సంబంధించి ప్రతినెలా రూ.35 లక్షల నుంచి రూ.38 లక్షల వరకు కరెంట్​ బిల్లు వస్తోంది. పైసలు లేక నెలనెలా కరెంట్​బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. 

సిగ్నళ్లు పనిచేయట్లేదు

జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ​సమీపంలోని చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్​సిగ్నల్​ఏడాదిగా పని చేయడం లేదు. నిజాంసాగర్​ చౌరస్తాలో ఉన్న సిగ్నల్ ​కూడా మధ్యలో మొరాయిస్తోంది. టైమర్​ సెట్టింగ్​సరిగా లేదు. అయినా వీటికి రిపేర్లు చేయించడం లేదు. ఆరేండ్ల కింద వివిధ ప్రాంతాల్లో సిగ్నళ్లు ఏర్పాటు చేయగా ఇవి పని చేయనప్పుడు రిపేర్​ చేసిన సంస్థకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. సిగ్నల్​ వ్యవస్థను బాగు చేయించాలని పోలీసులు అనేకసార్లు మున్సిపల్ ఆఫీసర్లకు విన్నవించినా ఫలితం లేదు.

మధ్యలోనే ఆగిన కాంప్లెక్స్​ పనులు

ఇది సుభాష్ ​రోడ్​లోని చౌరస్తాలో నిర్మించిన మటన్, ఫిష్​మార్కెట్​. రూ.37.50 లక్షల వ్యయంతో 2003లో నిర్మాణ పనులు పూర్తిచేశారు. 21ఏండ్లు కావొస్తున్నా ఇందులోని షాప్​లను అఫిషీయల్​గా కేటాయించలేదు. దీంతో కిరాయిలు రావడం లేదు. షాప్​లు అద్దెకిస్తే ప్రతినెలా కిరాయి వస్తుంది. కానీ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఇలా పలు రకాలుగా ఆదాయ మార్గాలున్నా మున్సిపల్​యంత్రాంగం దృష్టి సారించడం లేదు.

సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం

ఆర్థిక సమస్యను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కార్మికుల జీతాలకు సమస్య కాకుండా చూస్తున్నాం. కార్మికులకు రెండు నెలల జీతాలు చెల్లించాల్సి ఉండగా, నెల జీతం చెల్లించాం. ఆదాయ మార్గాల కోసం కౌన్సిల్​లో చర్చించి, చర్యలు తీసుకుంటాం.

 దేవేందర్, మున్సిపల్​ కమిషనర్​