వామ్మో.. ఖర్చులు డబుల్​!..ఎంపీ అభ్యర్థుల్లో ఎన్నికల బుగులు

వామ్మో.. ఖర్చులు డబుల్​!..ఎంపీ అభ్యర్థుల్లో ఎన్నికల బుగులు
  • లీడర్లను కాపాడుకోవడానికి.. ఓటర్లకు  ఇచ్చేందుకు ఎంత ఖర్చవుతుందోనని టెన్షన్​
  • ప్రధాన పార్టీల అభ్యర్థికి  కనీసం రూ.50 కోట్లు.. ప్రైమ్​ నియోజకవర్గమైతే రూ.80 కోట్లు​ కావాల్సిందే
  • వేసవి, ఐపీఎల్​ సీజన్​ కావడంతో ఖర్చు తడిసి మోపెడు.. నాలుగో ఫేజ్​లో ఎలక్షన్​ ఉండటంతో ఆందోళన

హైదరా​బాద్ , వెలుగు: రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఖర్చుల బుగులు పట్టుకున్నది.  షెడ్యూల్​ వచ్చినంక నెల రోజుల్లోనే పోలింగ్​ ప్రక్రియ ముగుస్తుందని భావించిన ఆశావహులు, క్యాండిడేట్లకు ఎన్నికలు నాలుగో షెడ్యూల్​లో ఉండటంతో షాక్​ తగిలినట్టైంది. గత పార్లమెంట్​ ఎన్నికల్లో ఫస్ట్​ఫేజ్ (ఏప్రిల్​ రెండో వారం)లోనే రాష్ట్రంలో పోలింగ్​ జరిగింది. ఈసారి నాలుగో ఫేజ్ (మే 19)​కు మారాయి. రాష్ట్రంలో మే  13న పోలింగ్​ జరుగుతుందని ఈసీ ప్రకటించింది.  ఇప్పటికే అన్ని పార్టీలు చాలా చోట్ల క్యాండిడేట్లను ప్రకటించాయి. 

మరికొన్ని  స్థానాల్లో ఒకటి, రెండు రోజుల్లో ఫైనల్​ చేయనున్నాయి. అయితే, రెండు నెలలపాటు ఎన్నికల ప్రచారం, ఖర్చులు, లీడర్లను కాపాడుకోవడం, సంబంధిత పార్లమెంట్​ పరిధిలోని ఎమ్మెల్యేలను బుజ్జగించుకోవడం వంటివి తమకు తలకు మించిన భారమని అభ్యర్థులు భావిస్తున్నారు.  రెండు నెలల పాటు ఓటర్లను, క్యాడర్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకోవడమెలా? అని ఆందోళన చెందుతున్నారు. 

పైగా వేసవి, ఐపీఎల్​ సీజన్​ కావడంతో  ఖర్చులు తడిసి మోపెడు అవుతాయని తలలు పట్టుకుంటున్నారు. ప్రధాన పార్టీల్లో  ఒక్కో ఎంపీ అభ్యర్థి కనీసం రూ.50 కోట్లు అయినా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. ప్రైమ్​ నియోజకవర్గం అయితే ఇది రూ.80 కోట్లు దాటే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు. 

అన్నీ ఎంపీ క్యాండిడేట్లే చూసుకోవాలి

ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం..  లోక్​ సభ ఎన్నికల్లో అయితే ఒక్కో అభ్యర్థి రూ.95 లక్షల దాకా ఖర్చు పెట్టేందుకు అవకాశం ఉంది. గతంలో ఇది రూ.70 లక్షలు మాత్రమే ఉండేది.  ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల రోజువారీ ప్రచార వ్యయం అన్ని రకాలుగా కలిపితే కనీసం  రూ.10 లక్షలు దాటుతున్నది. 

ప్రాంతాన్ని బట్టి.. పోటీని బట్టి అది మారుతున్నది. జనరల్‌‌ స్థానాల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుండగా.. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్​డు స్థానాల్లో ఒకింత తక్కువగా ఉంటున్నది. ఇది ప్రచార ఖర్చు మాత్రమే. ఇక పోలింగ్‌‌ తేదీకి ఒకటి రెండు రోజుల ముందు ఓటర్లకు డబ్బు పంపిణీ ఖర్చు దీనికి అదనం.  ప్రచారానికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల రథం, దానికి డీజే సౌండ్‌‌ బాక్స్‌‌లు, పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్స్‌‌, ఫ్లెక్సీలకు తప్పనిసరిగా ఖర్చుపెట్టాలి. అలాగే, ర్యాలీలు నిర్వహిస్తే బైక్​లు, ఆటోలు, కార్లకు అయ్యే పెట్రోల్‌‌, డీజిల్‌‌ ఖర్చులు పెట్టుకోవాలి. దీంతోపాటు ప్రచారానికి వచ్చే వారికి  చెల్లించాల్సిన మొత్తం సగటున రోజుకు రూ.200- నుంచి రూ.500 దాకా ఉంటున్నది.

ఎమ్మెల్యేల దగ్గర నుంచి సర్పంచ్​ దాకా

ఒక పార్లమెంట్​ నియోజకవర్గంలో యావరేజ్​గా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఆయా సెగ్మెంట్లలోని ఎమ్మెల్యేలు  లేదంటే  నియోజకవర్గ ఇన్​చార్జిలు గ్రామాల్లో ప్రచారానికి వచ్చినప్పుడు స్థానికంగా ఉండే నేతలు, సర్పంచ్‌‌లు, ఎంపీటీసీలు అంతా తామై వ్యవహరిస్తుంటారు. ఆయా గ్రామాల్లో ప్రచారానికయ్యే వ్యయాన్ని అంతా ఎంపీ అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది.  

ప్రచారానికి వచ్చినప్పుడు వారికి వేసే పూల దండలు, డీజే సౌండ్‌‌, డప్పులు, పటాకుల ఖర్చు అంతా ఇప్పుడు అభ్యర్థులే  పెట్టుకుంటున్నారు. ఆ ఖర్చులతో పాటు వారందరిని ఇతర పార్టీల వైపు మళ్లకుండా కాపాడుకోవాలి. ఇందుకోసం వారు అడిగే వాటిన్నింటినీ తీర్చాల్సి ఉంటుంది. దీంతో ఖర్చులపై ఎంపీ అభ్యర్థుల్లో గుబులు పట్టుకున్నది. రెండు నెలలవరకు ఎంత ఖర్చువుతుందో? అన్ని డబ్బులు పెట్టాక గెలవకపోతే ఎలా? అని ఆందోళన చెందుతున్నారు.

ప్రజాప్రతినిధులకూ ప్యాకేజీలు

రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా ప్రజాప్రతినిధులు ప్యాకేజీలు ఆశించడం కామన్​గా మారింది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ స్థాయిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా డిమాండ్​ చేసి, తీసుకున్నారు. ఈ సారి కూడా ఆ మేరకు ఆశిస్తున్నారు. ప్రస్తుతం సర్పంచులు మాజీలు అయినప్పటికీ వారి డిమాండ్​ ఏమాత్రం తగ్గడం లేదని చెప్తున్నారు. ఇక కులసంఘాలకు కూడా ఈ స్థాయిలో సమర్పించుకోవాల్సి వస్తున్నది. గత బీఆర్ఎస్ పార్టీ కులసంఘాలను కమ్యూనిటీ భవనాలు, ఫంక్షన్​ హాళ్లు, టెంపుల్స్​ పేరుతో మభ్యపెట్టింది.  కానీ ప్రస్తుతం వాళ్లు కూడా పైసలే డిమాండ్​ చేసే చాన్స్ ఉన్నది.

ఇప్పటికే మొదలైన పైసల పంపిణీ 

పార్లమెంట్​ ఎన్నికల షెడ్యూల్​ రావడానికి ముందే  పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చు కోసం డబ్బును సేఫ్​ జోన్లకు తరలించినట్టు తెలుస్తున్నది. ఖర్చుకు భయపడి అభ్యర్థులు పోటీకి ముందుకురాకపోవడంతో ఓ పార్టీ హైకమాండ్​ఈ నెల 15న ఒక్కో సెగ్మెంట్​కు రూ.20 కోట్ల చొప్పున తరలించిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. 

ఈ క్రమంలో 16వ తేదీ తెల్లవారుజామున కరీంనగర్​లోని ప్రతిమ మల్టీప్లెక్స్​లో రూ.6.67 కోట్లు పట్టుబడటం కలకలం రేపింది. హైదరాబాద్​లోని మెహిదీపట్నం నుంచి  డబ్బులతో బయల్దేరిన వాహనం రాత్రి 11.30 గంటలకు ప్రతిమ మల్టీప్లెక్స్​లోని సెల్లార్ కు చేరుకోగా, ఇద్దరు ఏసీపీల నేతృత్వంలో  దాదాపు 30 మంది పోలీసులు హోటల్​పై మెరుపు దాడి చేసి డబ్బులు సీజ్​ చేయడం గమనార్హం.