- ఈయేడు భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, బావులు, బోర్లు ఫుల్
- నీళ్లు ఎక్కువగా ఉండటంతో
- వరిసాగు పైనే ఇంట్రెస్ట్ చూపుతున్న రైతులు
- 70 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే చాన్స్ ఉందన్న అగ్రికల్చర్ ఆఫీసర్లు
- ఇప్పటికే 2.68 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి సాగయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ యేడు భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు, బావులు, భూగర్భ జలాలు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో యాసంగి వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఈ సీజన్‌లో 33 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 740.6 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటికే 988.4 మిల్లీమీటర్లుగా రికార్డయింది. మొంథా తుఫాన్ కారణంగా అధిక వర్షపాతం నమోదు కాగా, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, భూపాలపల్లి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగా సెప్టెంబర్‌లో 4.41 బిలియన్ గ్యాలెన్లు, అక్టోబర్‌లో 4.42 బిలియన్ గ్యాలెన్ల భూగర్భ జలాలు నమోదైనట్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెరిగిన భూగర్భ జలాలతో వ్యవసాయ బోర్లు ఫుల్ చార్జింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు సీజన్ మొత్తం నడిచే అకాశం ఉంది.
యాసంగిలో పెరగనున్న మక్కల సాగు జోరు..
ఈయేడు యాసంగిలో ఇప్పటి నుంచే మక్కల సాగు జోరందుకుంటోంది. యాసంగిలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 6.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 88 వేల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో ప్రధానంగా యాసంగిలో వరితో పాటు మొక్కజొన్న ఎక్కువగా సాగు జరుగుతుంది. అలాగే, అన్ని రకాల పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 4.01 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 65 వేల ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో ప్రధానంగా పప్పుశనగ 3.04 లక్షల ఎకరాల సాధారణ సాగు కాగా, ఇప్పటి వరకు 55 వేల ఎకరాల్లో సాగు జరిగింది. పప్పు శనగ ఈ యేడు భారీగానే పెరిగే అవకాశం ఉంది. మినుముల సాధారణ సాగు విస్తీర్ణం 54,968 ఎకరాలు కాగా, ఈయేడు ఇప్పటికే మినుములు 6,667 ఎకరాల్లో సాగు చేశారు. పొద్దుతిరుగుడు సాధారణ సాగు 24,786 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 155 ఎకరాల్లో, కుసుమలు 1,610 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. పొగాకు 4,483 ఎకరాల్లో, ఇతర పంటలు 7,249 ఎకరాల్లో వేశారు. ఈ యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 2.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
70 లక్షల ఎకరాలు దాటే చాన్స్..
ఈయేడు వానాకాలంలో రికార్డు స్థాయిలో 67.30 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. యాసంగి వరి సాధారణ సాగు విస్తీర్ణం 51.48 లక్షల ఎకరాలు కాగా, దీనికి అదనంగా మరో 40 శాతానికి పైగా సాగు పెరిగి, 70 లక్షల ఎకరాల మార్క్‌ను దాటే అవకాశం ఉందని అగ్రికల్చర్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సాధారణంగా యాసంగిలో దొడ్డు రకాలే ఎక్కువగా సాగు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర సర్కారు సన్న రకాలకు బోనస్ ప్రకటించినందున వానాకాలంలో సన్న రకాల సాగు భారీగా జరిగింది. అయితే, యాసంగిలో సన్నలు వేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు 9 వేల ఎకరాల వరకు వరి సాగు జరిగినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ చివరినాటికి వరి సాగు ప్రారంభమై జనవరి, ఫిబ్రవరిలో జోరందుకుంటుందని అగ్రికల్చర్ అధికారులు అంటున్నరు.
