గుడిసెలో పేలుడు పదార్థాలు స్వాధీనం

గుడిసెలో పేలుడు పదార్థాలు స్వాధీనం

జడ్చర్లలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయ నగర్ కాలనీ పారిశ్రామిక వాడలోని ఓ గుడిసెలో ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పేలుడు పదార్థాలను నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టగా.. 2,500 డిటోనేటర్లు, 2,750 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. రాజేష్ అనే వ్యక్తి బండరాళ్లను పేల్చేందుకు ఎలాంటి అనుమతి లేకుండా వాటిని దిగుమతి చేసుకున్నట్లు పక్కా సమాచారం అందడంతో అధికారులు సోదాలు నిర్వహించి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన గుడిసె చుట్టూ ఎత్తైన భవనాలు ఉన్నాయి. అనుకోని ప్రమాదం జరిగి ఉంటే భారీగా నష్టం వాటిల్లి ఉండేదని పోలీసులు చెబుతున్నారు. పేలుడు పదార్థాలను స్టేషన్ కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.