- వాణిజ్య లోటు రూ. 3,44,550 కోట్లు
- 200 శాతం పెరిగిన బంగారం దిగుమతులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్‌లో మనదేశం నుంచి ఎగుమతుల విలువ ఏడాది లెక్కన 11.8 శాతం తగ్గి రూ. 2,83,830 కోట్లుగా నమోదయింది. దిగుమతులు 16.63 శాతం పెరిగి రూ. 6,28,380 కోట్లకు చేరాయి. ఫలితంగా, గత నెలలో వాణిజ్య లోటు రూ. 3,44,550 కోట్లకు చేరుకుంది. బంగారం, వెండి రవాణా పెరగడం వల్లే దిగుమతులు పెరిగాయని డేటా చెబుతోంది.
గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన రూ. 40,511 కోట్లతో పోలిస్తే, ఈసారి బంగారం దిగుమతులు ఏకంగా రూ. 1,21,328 కోట్లకు పెరిగాయి. అమెరికాకు మనదేశం నుంచి ఎగుమతులు కూడా గత ఏడాది అక్టోబర్‌లో రూ. 57,690 కోట్ల నుంచి ఈ అక్టోబర్‌లో రూ. 51,915 కోట్లకు తగ్గాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-–అక్టోబర్) ఎగుమతులు స్వల్పంగా 0.63 శాతం పెరిగి రూ. 20,95,780 కోట్లకు, దిగుమతులు 6.37 శాతం పెరిగి రూ. 37,17,400 కోట్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.
