మియాపూర్ నుంచి చందానగర్ వరకు మెట్రోను పొడిగిస్తం : మంత్రి కేటీఆర్

మియాపూర్ నుంచి చందానగర్ వరకు మెట్రోను పొడిగిస్తం : మంత్రి కేటీఆర్
  • బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీకి మద్దతుగా ప్రచారం

చందానగర్, వెలుగు: బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సిటీలో 70 కి.మీ మేర ఉన్న మెట్రో లేన్​ను తొందరలోనే 250 కి.మీలకు పెంచుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మియాపూర్ మీదుగా చందానగర్ వరకు మెట్రోను పొడిగిస్తామన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీతో కలిసి బుధవారం శేరిలింగంపల్లిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. తారానగర్ తుల్జాభవాని ఆలయం వద్ద నిర్వహించిన మీటింగ్​లో మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ... తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలు శేరిలింగం పల్లిలో కొలువుదీరాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఇవేమీ కనిపించవని కేటీఆర్ మండిపడ్డారు.

బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. శేరిలింగంగంపల్లిని ఎంతో డెవలప్ చేశామని కేటీఆర్ తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అరికెపూడి గాంధీని గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం లింగంపల్లి, చందానగర్​ మీదుగా ఇంద్రారెడ్డి అల్విన్​క్రాస్ రోడ్ వరకు రోడ్​ షో నిర్వహించారు. ఆ తర్వాత మియాపూర్, హైదర్​నగర్, జేఎన్టీయూ, కేపీహెచ్​బీకాలనీ మీదుగా అల్విన్​కాలనీ లాస్ట్​బస్టాప్​వరకు రోడ్​ షో జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు.